మీకు మీరే సాటి… మేటి!
భగవద్గీతతో విజయవంతమైన కెరీర్ – 5
మీకు మీరే సాటి… మేటి!
ప్రతి మనిషికీ స్వశక్తితో ఎదిగేంత నైపుణ్యం ఉండి తీరుతుంది. అది ప్రకృతి స్వతహాగా మనిషికి ఇచ్చే వరం. కానీ తన మీద తనకు నమ్మకం లేకపోవడంతో… ఎవరో వచ్చి ఆదుకుంటారనీ, సాయపడతారనీ, అనుక్షణం అండగా నిలుస్తారనీ ఎదురుచూస్తుంటారు. విద్యార్థి దశలోనో, పరీక్షలకు వెళ్లే సమయంలో, ఉద్యోగప్రయత్నంలో, కోర్సులలో చేరేటప్పుడు… ఈ అభద్రత స్పష్టంగా కనిపిస్తుంది. కోచింగుకి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి, చదువుకునే సమయంలో మరొకరు పక్కనే ఉండలి, అప్లికేషన్ నింపడం దగ్గర నుంచీ పరీక్ష వరకూ మరో మనిషి గమనింపులో ఉండాలి.
ఇలాంటి సందర్భంలో స్వప్రయత్నం గురించి గీత చెప్పే మాటలు గుర్తు చేసుకోవాలి. భగవద్గీత ఆరవ అధ్యాయంలో…
“ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః”
అంటాడు పరంధాముడు. ‘ప్రతి వ్యక్తీ తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ తనను తాను అథోగతి పాలు చేసుకోకూడదు. ప్రతి వ్యక్తీ తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు’ అని స్పష్టంగా చెబుతుందీ శ్లోకం.
పురాణేతిహాసాలు కేవలం విధిరాతకే ప్రాధాన్యం ఇచ్చాయని చాలామంది అపోహ పడుతుంటారు. గమనించాలనే కానీ స్వీయ ప్రయత్నం గురించి చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చేసే పనుల్లో ఎంతవరకు విజయం సాధిస్తామనేది విధితో పాటు స్వప్రయత్నం మీద సమానంగా ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చెబుతోంది యాజ్ఞవల్క్య స్మృతి. ఇదే విషయాన్ని మరింత బలంగా, కచ్చితంగా చెబుతుంది గీత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధన దగ్గర్నుంచీ, భౌతికమైన విజయాల వరకూ వ్యక్తే కీలకం అని తేల్చింది.
అర్జునుడు ఎంత శక్తి సంపన్నుడైనా, పక్షిని కొట్టమంటే దాని కంటికి గురిపెట్టేంత ఏకాగ్రత ఉన్నవాడైనా… ఆఖరికి శ్రీకృష్ణపరమాత్ముడే తనకు రథసారధిగా ఉన్నా సందిగ్ధంలో పడిపోయాడు. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రతిష్టించడంతో పాటు… జీవితం మీద, ఇహపరాల మీద అతనికి ఏర్పడిన ప్రతి అనుమానానికీ తిరుగులేని జవాబులు అందించింది భగవద్గీత కురుక్షేత్ర మధ్యంలో!
- నిర్జర.