Read more!

నాలుగు అంతరాల నానే బియ్యం బతుకమ్మ!!

 

నాలుగు అంతరాల నానే బియ్యం బతుకమ్మ!!

 

తెలంగాణ రాష్ట్ర పండుగ నాలుగవ రోజు, నానే బియ్యం బతుకమ్మ పండుగను చేసుకుంటారు. ప్రతి ఇల్లు ఒక నందనవనంలా పూలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు. తెలంగాణ అడబిడ్డలు అందరూ ఎంతో ఆడంబరంగా జరుపుకునే ఈ పండుగలో నాలుగవరోజు  నానే బియ్యం బతుకమ్మ సందడి కనిపిస్తుంది. ఇంతింతై పెరుగుతూ మొదటి రోజు నుండి నాలుగవ రోజుకు నాలుగు అంతరాల ఎత్తులో పూల పూల సొగసులో నవ్వుతూ అడబిడ్డలను అందరిని నవ్విస్తుంది బతుకమ్మ.

నాలుగవ రోజు ఉదయాన్నే మహిళలు అంతా తాజా పూలను కోసుకొచ్చి, ఇల్లంతా చక్కబెట్టుకుని, శుభ్రంగా తయారయ్యి కోసుకొచ్చిన పూలను పొందికగా పేరుస్తూ నాలుగు అంతరాలుగా బతుకమ్మను తయారుచేస్తారు. నాలుగు అంతస్తులు అన్నమాట. ఈ బతుకమ్మను పేర్చడానికి ముఖ్యంగా తంగేడు, గునుగు పూలను వాడతారు. పసుపు తెలుపు రంగులలో పల్లెదనపు మమకారాన్ని, ప్రకృతి సొగసును తనలోనే నింపుకుని అచ్చం ప్రతి ఇంటి ఆడబిడ్డ అయిపోతుంది బతుకమ్మ. 

పసుపుతో గౌరమ్మను చేసి పేర్చిన బతుకమ్మ పైన గౌరమ్మను ఉంచి అందులోకి గౌరమ్మను ఆవాహన చేస్తారు. తరువాత నానబెట్టిన బియ్యం, పాలు బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ఈ నైవేద్యాలు కూడా కొత్త రూపు దాల్చుకుంటున్నాయి.  నానబెట్టిన బియ్యం, మెత్తగా రుబ్బి, అందులో పలు, బెల్లం కలిపి మృదువైన బియ్యపు చలిమిడి తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరమైనది కూడా. 

ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని  బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. సాయంత్రం అవ్వగానే ఈ బతుకమ్మను ఇంటి ముంగిట్లో పెడతారు. తరువాత చుట్టుపక్కల అందరూ కలసి ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ జానపద పాటలు పాడుతారు. ఆ తరువాత ఆ బతుకమ్మలను తీసుకెళ్లి ఊరి చెరువులో వదిలి పెడతారు. అంతా అయ్యాక నానే బియ్యం బతుకమ్మ కు పెట్టిన నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం తో చేసిన నైవేద్యాన్ని అందరికి పంచి ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా తింటారు.   అలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడిలో చేరడంతో నాలుగవరోజు పండుగ ముగుస్తుంది. 

◆ వెంకటేష్ పువ్వాడ