Read more!

వేపకాయల బతుకమ్మ వేలవేల దండాలమ్మా!!

 

వేపకాయల బతుకమ్మ వేలవేల దండాలమ్మా!!

 

తొమ్మిది రోజుల బతుకమ్మ  పండుగ. తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టే పండుగ. ఇంటింటి ఆడబిడ్డ ఇల్లంత సందడి చేసే పండుగ. పువ్వూ, పువ్వూ తెచ్చి, పుత్తడి బొమ్మలు తమ నవ్వులను జోడించి, అంతరాలు అంతరలుగా పేర్చి, మనసుల దొంతరలలో నిండుకున్న భావాలకు పదం కట్టి, పాట కట్టి, ప్రకృతి అంత గొంతు కట్టి పాడుతూ ఉంటే వీధి వీధి, పల్లె పల్లె, కృత్రిమత్వంలో నిండిపోయిన పట్టణం కూడా ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ దాకా, తొడిగిన మొగ్గ కాస్తా పువ్వై పూసినట్టు బతుకమ్మల సంబంరాలు జరిగేవేళ తెలంగాణ జవసత్వాలన్నీ సంస్కృతి దారిలో మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకుంటాయి.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో  భాగంగా ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అందరి ఇళ్లలో సందడి చేస్తుంది. వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆదిపరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో శక్తి స్వరూపంగా ఎల్లమ్మ దేవతను ఎంతో భక్తి పారవశ్యంతో  పూజించడం అందరికి తెలిసినదే. 

వేపకాయల బతుకమ్మ పండుగరోజు చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడవరోజును ప్రతిబింబించేలా ఏడు అంతరాలలో బతుకమ్మను పేరుస్తారు. సకినాలను తయారుచేయడానికి ఉపయోగించే పిండితో చిన్న  వేపపండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి వాటిని బతుకమ్మకు పెడతారు. అలాగే నైవేద్యంగా బెల్లం, పప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

తరువాత సాయంత్రం కాగానే బతుకమ్మను ఇంటి ముంగిట్లో పెడతారు. ఆ తరువాత ఆ వీధి ఆడవాళ్లు అందరూ ప్రతి ఇంట్లో ఉన్న తమ బతుకమ్మలను తీసుకొచ్చి ఒకచోట పెట్టి తమ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటలను పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేస్తారు.ఆ తరువాత అందరూ ఎవరి బతుకమ్మను వాళ్ళు తలకెత్తుకుని నేరుగా నీళ్లున్న ప్రాంతాలైన, చెరువులు, కాలువలు వంటి చోటుకు వెళ్లి బతుకమ్మలను నీళ్లలో వదులుతారు. తరువాత బతుకమ్మకు పెట్టిన నైవేద్యాన్ని అందరూ పంచుకుని తిని ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాధికి కూడా పంచి పెడతారు. అలా ఏడవరోజు ఏడు తరాల బతుకమ్మ గంగమ్మ ఒడిలోకి చేరడంతో ఆరోజు ముగుస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ