Read more!

ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?

 

ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?

యుద్ధంలో మైరావణుని తలపడే సమయంలో అనుకోని విధంగా లక్ష్మణుడు,కొంతమంది వానరులు మైరావణుని శరాఘాతాలకి మూర్ఛపోతాడు .ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక నిరుత్సాహంగా, దిగులుతో ఉవ్న శ్రీరాముని వంక చూసిన హనుమ తనవంతు సహాయం కోసం, రామచంద్రుని ఆజ్ఞకోసం ఎదురుచూస్తున్నాడు. దీన్ని గమనించిన రాములవారు మునీశ్వరులు  తదితరులు చెప్పిన విధంగా సంజీవిని పర్వతం తీసుకురమ్మని చెప్పారు. రామచంద్రుని ఆజ్ఞరాగానే హనుమ వాయువేగంతో ఆకాశమార్గానికేసి పయనమయ్యాడు.


దీన్ని గమనించిన శుక్రాచార్యులు (రాక్షసుల కులగురువు)వారు ఎలా అయినాసరే హనుమ పయనాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాడు. కార్యసాధకుడని పేరుగల హనుమ సంజీవిని మూలికలను తీసుకువస్తే ముర్చపోయి అందరికి తిరిగి శక్తి వస్తుంది. ఇక వారితో తలపడటం ఎవరివల్ల కాదు అని దుర్బుద్ధితో నవగ్రహాల్లో అత్యంతభయోత్పాతకుడైన శనిని హనమ ఇబ్బందిపాలుచేసి అతని కార్య సాధనకు భంగం కలిగించమని ఆజ్ఞ జారీ చేసాడు. గురువుగారు చెప్పిందే తడవుగా శనేశ్వరుడు తన ప్రతాపాలన్నిటిని హనుమ మీద ప్రయోగించటానికి సిద్ధమవుతాడు.

ఈ లోగ హనుమ తాను వెళ్ళిన ప్రదేశమంతా వెతికి వెతికి ఆ సంజీవిని మూలిక ఏదో తెలియక మొత్తం పర్వతాన్నేపేకిలించుకుని ఆకాశ మార్గాన వస్తుంటాడు. దీన్నిచూసిన శని హనుమని మార్గమధ్యన ఆపి, తను రావణాసురుడు పంపగా వచ్చానని, ఈ పర్వతాన్ని తీసుకు వెళ్ళడానికి వీల్లేదని గొడవ చేస్తాడు. ఈ మాటలకి హనుమకు విపరీతమైన కోపం వచ్చి తన ఆవేశాన్ని ఆపుకుంటూరామనామ జపం చేస్తూ తన పాదాలతో శనికి ఊపిరికూడా ఆడకుండా నొక్కి పెడతాడు. హనుమ మహిమ తెలుసుకున్న శని చివరకు తను తప్పుగా అడ్డుకున్నాని హనుమకు  క్షమాపణలు చెప్పి తనను వదిలేయమని ప్రాధేయపడతాడు.  శని పడే బాధను చూసి తప్పు తెలుసుకున్న శనిని హనుమ విడిచిపెడుతూ .....కొన్ని షరతులు పెడతాడు. ఎవరైతే ప్రతిరోజు మూడుపూటలా రామనామ జపం జపిస్తూ౦టారో వారి జోలికి, ఎవరైతే తనను ఎల్ల వేళలా పూజిస్తుంటారోవారి జోలికి వెళ్ళటంకానీ, వారి మీద కనీసం నీ చూపు కూడా పడటానికి వీల్లేదని శని భయపడేవిధంగా ఆజ్ఞ జారీ చేస్తాడు.

దానికి శనేశ్వరుడు తన అంగీకారం తెలియజేస్తూ తనూ ఓ కోరిక కోరతాడు. అది ఏమిటంటే ..... మీ దేవాలయాలు ఉండేచోట నా విగ్రహం ఉంటూ, ప్రతి శనివారం మీతోపాటు నాకు అభిషేకాలు జరిగేలా చూడాలని అప్పుడే భక్తుల పాలిట జాగ్రత్తగా వుంటానని తన కోరికను హనమకు చెప్తాడు. హనుమ శని కోరికకు తధాస్తు పలికి శనేశ్వరుని అశ్వీర్వదించి పంపిస్తాడు.అప్పట్నించి శని దశ నడుస్తున్నవారు, మాములుగా భక్తులు ప్రతి శనివారం ఆంజనేయస్వామికి అభిషేకాలు, పూజలు తప్పక చేస్తుంటారు అలా చేస్తేనే శని మహారాజు వీరిపట్ల తన అనుగ్రహం ఇస్తాడని పురాణ కథ.