శ్వేతార్కమూల గణపతి
శ్వేతార్కమూల గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో వీరాంజనేయ, సీతారామలక్ష్మణులు, పద్మావతి వేంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యస్వామి, గణపతి, అయ్యప్పస్వామి, షిరిడీ సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి.
శ్వేతము అంటే తెల్లని అర్కము తెల్ల జిల్లేడు, మూల అనగా మొదలు నుండి పుట్టినదని అర్థం. తెల్లజిల్లేడు మొదలు నుండి ఉద్భవించిన ఈ గణపతిని చెక్కడం, మలచడం లాంటిది చేయలేదు.
స్వయంగా భూమి నుండి శ్వేతార్క గణపతిగా అనగా నేత్రములు, నుదురు, వక్రతుండము కుడి దంతము, ఎడమ దంతము, కాళ్లు పాదములు, చేయి, మోచేయి, అరచేయి సుఖాసీనత, ఆసనము, తల్పము, ఎలుక అన్నీ స్పష్టముగా కనపడుతూ సర్వాయన సంపూర్ణ శ్వేతార్కమూల గణపతి రూపాంతరము చెందినది. ఇక్కడకు వచ్చే భక్తులు మంగళవారము,స్వామిని దర్శించి ప్రదక్షిణలు చేయడం వలన వివాహ ఉద్యోగ, సంతాన, కోర్టు, ఆరోగ్య సమస్యలు నుండి బయటపడుతున్నారు.
విదేశీయులు కూడా ఈ మూర్తిని దర్శించాలని వస్తుంటారు. ప్రతి నెల మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం, మరియు గరిక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6.30 గం. అభిషేకం, 8.00 గం. మహానివేదన, రాత్రి 7.00 గం. పూజలు, జరుగుతున్నాయి.
సంపత్ వినాయగర్ - విశాఖపట్టణం
వైజాగ్ సిటీ ఆర్.టి.సి. కాంప్లెక్స్ నుండి సిరిపురము వెళ్ళే మెయిన్ రోడ్ ప్రక్కన శ్రీసంభందన్ అండ్ కంపెనీ వారిచే వారి ఆఫీసు ప్రాంగణంలో 1961 సంవత్సరంలో (సుమారు 30. సంవత్సరాల క్రితం) ప్రతిష్ఠ జరిగినది. మొదట సంభందన్ కంపెనీ కుటుంబసభ్యులు మాత్రమే పూజ చేసేవారు. తరువాత ఇతర భక్తులను కూడా పూజచేయడానికి అనుమతించారు.1971వ సంవత్సరంలో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సమయంలో ఈస్ట్రన్ నేవల్ కమాండర్, వైస్ ఎడ్మిరల్ కృష్ణన్, స్వామి వారికి మ్రొక్కుకుని వెళ్ళగా పాకిస్తాన్ జలాంతర్గామిని ముంచడం జరిగినది. వెంటనే 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకొన్నారు.
1975వ సంవత్సరం శ్రీకంచికామ కోటి పీఠాధిపతిపతులైన శ్రీ శంకరాచార్య స్వామి వారిచే శ్రీ చక్రప్రతిష్ఠ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీ గణేశ నవరాత్రులు 9 రోజులు పురాణ కాలక్షేపములు, బీదలకు అన్నదానము జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామి వారికి జరిగే పంచామృత అభిషేకం కార్యక్రమం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా విశాఖనగరంలో ఖ్యాతి పొందింది.