జనవరి నాటికి రెండు క్వాంటం కంప్యూటర్లు!

అమ‌రావ‌తిలో క్వాంటం వ్యాలీ పనులు అనూహ్య వేగంతో జరుగుతున్నాయి. క్వాంటం వ్యాలీ నిర్మాణం కోసం సీఆర్డీయే 50 ఎకరాల స్థలం కేటాయించింది. ఇలా ఉండగా  క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వ‌చ్చే జ‌న‌వ‌రి క‌ల్లా రెండు క్వాంటం కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయ‌నుంది.  2027 నాటికి మ‌రో మూడు కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి   భాస్క‌ర్ కాటంనేని మంగళవారం (సెప్టెంబర్ 16) వెల్ల‌డించారు.

స‌చివాలయంలో జ‌రుగుతున్న జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండ‌వ రోజు ఆయ‌న అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  గ్లోబ‌ల్ క్వాంటం డెస్టినేష‌న్‌గా ఏపీని మార్చాల‌నే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నామ‌న్న ఆయన  ఇందుకోసం రెండు ద‌శ‌లుగా రోడ్ మ్యాప్ రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.  2030 క‌ల్లా అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హ‌ర్డ్‌వేర్ ఎగుమ‌తుల‌ను సాధించాల‌న్నలక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా  ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నామన్నారు.  వెయ్యి కోట్ల రూపాయల ప్రోత్స‌హ‌కాల‌తో క్వాంటం వ్యాలీలో క‌నీసం 100  స్టార్ట‌ప్‌లు  ఏర్పాటు చేయాన్న సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు. క్వాంటం వ్యాలీ రాక‌తో రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయ‌న్నారు.  వైద్య ఆరోగ్యం, బీమా, ఫైనాన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అండ్ మిష‌న్ లెర్నింగ్‌, మెటీరియ‌ల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేష‌న్ అండ్ లాజిస్టిక్స్‌, క్లైమేట్, ఎన‌ర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట స‌హా మొత్తం 14 రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ లాగ‌ర్థ‌మ్స్‌తో అద్భుత ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపారు.   

జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటం రంగంపై అవగాహన కల్పించడానికి జిల్లాల్లో రాయబారులుగా వ్యవహరించాల్సింది జిల్లా కలెక్టర్లేనని భాస్కర్ కాటంనేని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా జిల్లాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.  

రాజధాని అమరావతిలో నిర్మించనున్న అమరావతి క్వాంటం వ్యాలీ భవన సముదాయ నమూనాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంత్రుప్తి వ్యక్తం చేశారు. నమూనా బాగుందని, అనేక కసరత్తులు చేసిన తర్వాత తక్కువ సమయంలోనే మంచి నమూనా రూపొందించారని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేనిని అభినందించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu