సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు!
posted on Dec 9, 2025 2:58PM

తెలంగాణలో అత్యంత కీలకమైన సీఎంవో, లోక్ భవన్ లకు బాంబు బెదరింపు మెయిల్ కలకలం రేపింది. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి వచ్చిన ఈ బెదరింపు ఈమెయిల్ లో ముఖ్యమంత్రి కార్యాలయం, లోక్ భవన్ లను బాంబులతో పేల్చివేయాడానికి కుట్ర జరుగుతోందని హెచ్చరిక ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు వాసుకిఖాన్ పేరుతో ఈ ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్‌ను వెంటనే ఖాళీ చేయాలని, పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన గవర్నర్ కార్యాలయం, ఈ నెల 3న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి నిజంగా ఎవరు? వాసుకి ఖాన్ పేరు అసలుదా? ఇది కేవలం భయపెట్టేందుకా? లేక మరేదైనా కుట్రలో భాగమా? అన్న అనుమానాల దృష్ట్యా సైబర్ నిపుణుల సహాయంతో పంజాగుట్ట పోలీసులు ఇమెయిల్ సోర్స్ మరియు ఐపీ వివరాలను ట్రాక్ చేస్తున్నారు. భద్రతా సంస్థలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.సీఎంవో, లోక్ భవన్ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారని తెలిసింది.