గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో లోకేష్ భేటీ.. ఏఐ డేటా సెంటరే కాదు..ఇంకా ఎన్నో
posted on Dec 10, 2025 8:21AM

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్‌వర్కింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే కూడా పాల్గొన్న ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు, ఉద్యోగ కల్పనకు సంబంధించి చర్చ జరిగింది. ముఖ్యంగా విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఏఐ డటా సెంటర్ పనుల పురోగతిపై ఈ భేటీలో సమీక్షించారు. విశాఖ ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అనుబంధంగా విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకో సిస్టమ్ ను రాష్ట్రంలో నెలకొల్పడానికి గూగుల్ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ పై కూడా మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని సుందర్ పిచాయ్ ను కోరారు.
ప్రస్తుతం గూగుల్ సంస్థకు చెందిన డ్రోన్ విభాగం వింగ్స్ డ్రోన్‌లు చెన్నైలోని ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా తయారవుతున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనపై సంస్థలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ఏపీ ఏరోస్పేస్ టెక్నాలజీ విభాగంలో పారిశ్రామికీకరణను సాధించే అవకాశం ఉంది.
భారతదేశంలో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతో పాటు, గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ కార్యక్రమం ద్వారా దేశీయ స్టార్టప్‌లకు తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాపిటల్ హోదాను బలోపేతం చేయనున్నాయి.
ఈ కీలక భేటీ ఆంధ్రప్రదేశ్ లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏరోస్పేస్ వంటి ఫ్యూచర్‌స్టిక్ టెక్నాలజీలలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాప్‌లో ముఖ్యమైన గమ్యస్థానంగా రూపాంతరం చెందేందుకు లోకేష్ దృష్టిసారించినట్లు అవగతమౌతుంది.
ఆంధ్రప్రదేశ్‌కు భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన ఇంటెల్, ఎన్విడియా సంస్థల ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
శాంటాక్లారాలోని ఇంటెల్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల తయారీకి అపార అవకాశాలు, అనుకూల వాతావరణం ఉందన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే.. ఐఐటీ తిరుపతి లేదా ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఇంటెల్ శిక్షణ కార్యక్రమాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, యూనివర్సిటీలలో ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్" స్థాపించాలని కోరారు.
అలాగే చిప్ డిజైనింగ్ దిగ్గజం ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరితో సమావేశమైన లోకేష్ ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్విడియా టెక్నాలజీతో ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్రతిపాదించారు. అలాగే రాష్ట్రంలో డీప్‌టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు, మోంటార్ సహకారం అందించాలనీ, ప్రభుత్వ అధికారులకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరి, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.