Top Stories

ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర : పయ్యావుల

  ఏపీ బ్రాండ్‌ను  దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ  రాష్ట్రంలో  ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని అడ్డుకునేందుకు  పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాభివృద్దికై ఏపిఎండిసి ద్వారా రూ.9 వేల కోట్ల మేర ఋణా తెచ్చేందుకు  ప్రభుత్వం జి.ఓ. నెం.32 ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఆ ఋణం రాకుండా అడ్డు పడేందుకు విఫల యత్నం చేశారని పేర్కొన్నారు.  జర్మనీలో పనిచేస్తున్న విప్రో ఉద్యోగి ఉదయభాస్కర్ అనే అతనితో  బాంబో మార్కెట్లోని పెట్టుబడిదాలు అందరికీ  పెట్టుబడులు పెట్టవద్దు అంటూ దాదాపు 200 మెయిల్స్  పంపించారు. వైసీపీ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యులు మరియు ఫైనాన్సు స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి ఆర్.బి.ఐ.కి సెబీ కి కంప్లైంట్స్ పెట్టించారు, వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో  పిల్ వేయించారని ఆర్థిక మంత్రి తెలిపారు. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదు, ఓవర్ గా సబ్ స్క్రైబ్ చేశారు. ఇప్పటికైనా వాళ్లు ఏడుపులు ఆపితే మంచిదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేలా వీరు చేసిన తప్పుడు ప్రచారానికి, రాద్దాంతానికి దేశ ద్రోహం కేసులు వీరిపై పెట్టాలని అన్నారు  
ఏపీ బ్రాండ్‌ను  దెబ్బతీసేందుకు జగన్ కుట్ర : పయ్యావుల Publish Date: Jul 8, 2025 9:52PM

టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్

  టీటీడీలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును అధికారులు సస్పెండ్ చేశారు.తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది.  
టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు  సస్పెన్షన్ Publish Date: Jul 8, 2025 9:35PM

ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ సీరియస్

    నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి , వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ, పదవులు పోయినా కూడా కొందరు వైసీపీ నేతలు హీరోలు లాగా ఫీల్ అవుతున్నారని అన్నారు.  మహిళల పట్ల వ్యక్తిత్వహననానికి పాల్పడటం సర్వ సాధారణమైపోయిందని అన్నారు.  రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అమరావతి మహిళల పై కూడా ఇలాగే కించపరిచేలా మాట్లాడారని, ఇటువంటి వారిపై మహిళా కమిషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు.మీరు అనుకుంటున్నట్లు మహిళలు బలహీనులు కాదని, మీకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.
ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ సీరియస్ Publish Date: Jul 8, 2025 9:18PM

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్

  అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, మదనపల్లి కలెక్టరేట్లో.. గత ఏడాది జులై  21 రాత్రి ఫైళ్ల దగ్ధం పాఠకులకు విధితమే అన్నారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, మాధవ రెడ్డీలను అరెస్టు చేయగా, ఇప్పుడు మాజీ ఆర్డీఓ మురళిని తిరుపతి కె ఆర్ నగర్‌లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ్ ను ఏపీ సీఐడీ  అరెస్టు చేసింది.   మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.  
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్ Publish Date: Jul 8, 2025 9:00PM

టీటీడీ ఉద్యోగులపై భక్తుల రాళ్లదాడి

  తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన  భక్తులు సమయమనం కోల్పోయి  నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు. దీంతో తిరుపతికి చెందిన ఒక భక్తుడు విసిరిన రాళ్లతో ఇద్దరి ఉద్యోగులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి పరారైపోవడంతో వారి మిత్రులను అదుపులోకి తీసుకుని తిరుమల క్రైమ్ పోలీసులు విచారిస్తున్నరు. అయితే ఈ ఘటనతో మిగతా భక్తులకు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంత వాతావరణం ఉన్న తిరుమలలో ఈ తరహా ఘటనలు ఏమిటని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  
టీటీడీ ఉద్యోగులపై భక్తుల రాళ్లదాడి Publish Date: Jul 8, 2025 8:49PM

కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ భేటీ

  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డాతో  భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం.. సాగు ప‌నులు జోరుగా సాగుతున్నందున‌ యూరియా స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.. దేశీయంగా ఉత్ప‌త్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణ‌కు పెంచాల‌ని సీఎం కోరారు.  యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన రేక్‌లు కేటాయించ‌డం లేద‌ని... వాటి సంఖ్య పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో  ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా అనుకుంటున్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే విదేశాల నుంచి ముడి సరుకులు దిగుమతుల విషయంలోనూ వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ముడిసరుకులు సకాలంలో రాకపోవడం వల్ల తెలంగాణలోని పరిశ్రమల ఉత్పత్తులు తగ్గిపోతున్నదని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నదని అందువల్ల ముడిసరుకుల దిగుమతుల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.   
కేంద్ర మంత్రి  జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ భేటీ Publish Date: Jul 8, 2025 6:57PM

రాజావారి బడిలో నారాయణ వ‌ర్సెస్ రామ నారాయ‌ణ‌

  ఆయ‌నొక మంత్రి. ఈయ‌నా మంత్రే. ఒక‌రు దేవాదాయం, మ‌రొక‌రు మున్సిప‌ల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చ‌రిత్ర గ‌లిగిన విద్యా సంస్థ‌లుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్క‌డ చ‌దువుకున్న వారే అన్న హిస్ట‌రీ సైతం క‌లిగి ఉందీ ప్రాంగ‌ణం. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌లు గ‌త యాభై ఏళ్ల నుంచి ఆనం కుటుంబం అధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. అయితే గ‌త  జ‌గ‌న్ స‌ర్కార్.. ఈ విద్యా సంస్థ‌ల‌ను ఆనం వారి  నుంచి లాగేసుకుంటే.. ఇప్పుడా ప్ర‌క్రియ‌ను మంత్రి నారాయ‌ణ పూర్తిస్థాయిలో నిర్వ‌హిస్తున్నారా? అన్న అనుమానం  వెలుగు చూస్తోంది. తాజాగా VRCకి సంబంధించి ఒక ప్రొగ్రాం జ‌రిగింది. ఇది మంత్రి నారాయ‌ణ అధ్వ‌ర్యంలో జ‌రిగింది. బేసిగ్గానే మంత్రి నారాయ‌ణ అంటే నారాయ‌ణ కార్పొరేట్ ఎడ్యుకేష‌న‌ల్ సంస్థ‌ల అధినేత‌. ఆయ‌న కూడా VRCలో చ‌ద‌వ‌డం మాత్ర‌మే కాదు.. ఇక్క‌డ అతి త‌క్కువ జీతానికి లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేసినట్టుగానూ చెబుతారు. ఆయ‌నే చాలా సార్లు త‌న‌కూ వీఆర్సీకీ ఉన్న గ‌తాన్ని గుర్తు చేసేవారు. త‌న‌కూ VRCకి ఉన్న అనుబందం దృష్ట్యా తాను గెలిస్తే.. 15 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంస్థ‌ల‌ను ఆధునీక‌రిస్తాన‌ని హామీ ఇచ్చిన నారాయ‌ణ అన్నంత ప‌నీ చేశారు. అంతే కాదు విద్యా మంత్రి నారా లోకేష్ ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ స‌భ‌కు పిల‌వ‌కుండానే మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ  రెడ్డి వ‌చ్చారు. ఈ విద్యా సంస్థ‌ల చ‌రిత్ర గురించి వివ‌రించారు. 150 సంవ‌త్స‌రాల క్రితం బ్రిటీష్ హ‌యాంలో క్రిస్టియ‌న్ మిష‌న‌రీ స్కూళ్లు మాత్ర‌మే ఉండేవ‌నీ.. 1975లో సుంకాల నారాయ‌ణ స్వామి శెట్టి- హిందూ వ‌ర్నాక్యుల‌ర్ ఆంగ్లో హై స్కూల్ స్థాపించార‌నీ.. అప్ప‌ట్లో వెంక‌ట‌గిరి రాజా వారు రూ. 50 వేల విరాళం ఇస్తామ‌న్నార‌నీ. దీంతో ఈ విద్యా సంస్థ‌ల‌కు వెంక‌ట‌గిరి రాజాస్ కళాశాల అని  పేరు పెట్టార‌నీ.. అయితే రాజావారు ఇస్తాన‌న్న విరాళం ఇవ్వ‌లేద‌నీ.. గ‌త  యాభై ఏళ్లుగా ఆనం పెద్ద‌లు... ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంక‌ట‌రెడ్డి, ఆనం వివేకానంద‌రెడ్డి, ఆ త‌ర్వాత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి చైర్మ‌న్ గా ఉండేవార‌నీ.. వైసీపీ హ‌యాంలో ఆనం వారి అధికారం పోయిందనీ.. దీంతో ఇక్క‌డి విద్య మ‌స‌క‌బారింద‌ని చెప్పుకొచ్చారు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. సొంత ప్ర‌భుత్వం వ‌చ్చాక అయినా.. ఈ విద్యా సంస్థ‌ల్లో ఆనం వారి ప‌ట్టు నిలుస్తుంద‌ని భావిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కూ తాము విస్త‌రిస్తూ వ‌చ్చిన VRC లెగ‌సీని.. ఒక్క దెబ్బ‌తో మంత్రి పొంగూరు నారాయ‌ణ త‌న్నుకు పోవ‌డంతో.. అది పిల‌వ‌ని పేరంట‌మే అయినా స‌భ‌లోకి దూసుకొచ్చేశారు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. త‌న ఆక్రోశం మొత్తం వెళ్ల‌గ‌క్కారు. త‌మ కుటుంబం ఈ క‌ళాశాల‌ను ఎలా కాపాడుకుంటూ వ‌స్తుందో చెప్పి.. ప్ర‌స్తుతం మంత్రి పొంగూరు నారాయ‌ణ వంటి వారు ఎలా ఆక్ర‌మిస్తున్నారో వివ‌రించారాయ‌న‌.తాము మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌మ‌నీ. అందుకే వెంక‌ట‌గిరి రాజా వారి విద్యా సంస్థ‌ల‌ను మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల విద్యాభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ వ‌చ్చామ‌నీ.. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థ‌ల అధినేత అయిన నారాయ‌ణ వ‌చ్చి.. ఇక్క‌డి విద్య‌ను కార్పొరేటీక‌ర‌ణ చేయ‌డం స‌రికాద‌న్న ధోర‌ణిలో  ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి చేసిన కామెంట్లు నెల్లూరు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. వీటిలో మొద‌టిది స్థానికంగా ఒక మంత్రి ఉండ‌గా.. ఆయ‌నకంటూ ఒక ప్రొటోకాల్ ఉంటుంది. అది ఎందుకు పాటించ‌లేదు? ఇది ప్ర‌భుత్వ ప‌ర‌మైన చ‌ర్చ కాగా.. ఇద్ద‌రు మంత్రులు.. నారాయ‌ణ వ‌ర్సెస్ ఆనం రామ‌నారాయ‌ణ మ‌ధ్య విబేధాలు అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తున్నాయా? అస‌లేం జ‌రుగుతోందీ నెల్లూరులో అన్న మ‌రో రాజ‌కీయ రగ‌డ ప్రారంభ‌మైంది.మ‌రి అధిష్టానం ఈ ఇరువురు మంత్రుల‌ మ‌ధ్య గ‌ల వివాదాన్ని ఎలా ప‌రిష్క‌రిస్తుంద‌న్న‌ది ఉత్కంఠ‌గా  మారింది. అయితే కార్పొరేట్ విద్యా సంస్థ‌ల అధినేత‌ అయిన నారాయ‌ణ పిల‌వ‌గానే విద్యా మంత్రి లోకేష్ రావ‌డం చూస్తుంటే ఈ రాజ‌కీయ‌పు త్రాసు అటు వైపే ఎక్కువ‌గా మొగ్గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.  గ‌త వైసీపీ పాల‌న‌లో ఇలాంటివి స‌హించ‌లేక‌.. టీడీపీలోకి వ‌చ్చిన ఆనం రామనారాయ‌ణ రెడ్డికి  మంత్రిత్వం ఇచ్చారు లే అనుకుంటే అది కూడా దేవాదాయ శాఖ కావ‌డం. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ టీటీడీ నుంచి అప్ప‌న్న ఆల‌యం వ‌ర‌కూ ఏవో ఒక వివాదాలు. ఆపై ఈ శాఖ‌కున్న సెంటిమెంటూ వెర‌సీ.. ఆనం ఒకింత అస‌హ‌యానికి గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఉన్న త‌ల‌నొప్పులు చాల‌వ‌న్న‌ట్టు గ‌త అర శ‌తాబ్దంగా త‌మ ఆధీనంలో ఉన్న VRC ఆనే బ్రాండెడ్ విద్యా సంస్థ‌ల‌ను ఇన్నేళ్ల పాటు కాపాడుకుంటూ వ‌స్తే.. అది కూడా  కార్పొరేట్ కింగ్ మంత్రి నారాయ‌ణ క‌బ్జా చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిలో ప‌డ్డార‌ట మ‌రో మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ  రెడ్డి. మ‌రి చూడాలి.. ఈ ఇద్ద‌రు అమాత్యుల మ‌ధ్య చెల‌రేగుతోన్న వివాదాల‌ను అధిష్టానం ఎలా ప‌రిష్క‌రిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు నెల్లూరు వాసులు.
రాజావారి బడిలో నారాయణ వ‌ర్సెస్ రామ నారాయ‌ణ‌ Publish Date: Jul 8, 2025 6:29PM

ఏపీ సీఎం చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెంట్రిక్‌గా  సాగుతున్నట్లే కన్పిస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వివిధ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.  ప్రధానంగా బనకచర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ సర్కారు భగ్గుమంటోంది. ఓవైపు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కారు.. వరద జలాలతో సముద్రంలోకి వృథాగా పోయే నీటితో బనకచర్ల కట్టుకుంటామని చెప్పడం సరికాదని వాదిస్తోంది. కేంద్రంలో పలుకుబడి ఉందని.. బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని  ముఖ్యమంత్రి రేవంత్ దెప్పిపొడుస్తున్నారు. కేంద్ర అండతో ముందుకు పోదామని అనుకుంటే తమ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉన్నాయంటున్నారు. అదలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది. ఇక..  ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు.. బనకచర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావంటున్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ..ఏపీ సీఎం డజన్ల కొద్దీ లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారాయన. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతోందని విమర్శించారాయన. ప్రజాభవన్‌లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బనకచర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనంటూ చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు, కేంద్ర ప్రభుత్వ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారని.. అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు.  ఒక్క బనకచర్ల అంశమనే కాదు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైనా సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణలాంటి వాళ్లు ఉండగా.. తనకు అనుకూలమైన రామచంద్రరావుకు చంద్రబాబు ఆ పదవి ఇప్పించుకున్నారని ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్.         అయితే.. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకు ఉంటుందని కమలం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అధ్యక్షుడిని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.  అలాంటి వాళ్లకు నల్లా, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలని ధ్వజమెత్తారు. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలూ చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేయడం వెనుక కారణం ఏంటన్న దానిపై  పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చే సాగుతోంది.త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటం, తెలంగాణలోనూ టీడీపీ అధినేత పార్టీని యాక్టివ్ చేస్తుండటంతో తెలంగాణ పార్టీలు చంద్రబాబు సెంట్రిక్‌గా రాజకీయం మొదలుపెట్టాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏపీ సీఎం చుట్టూ తెలంగాణ రాజకీయం Publish Date: Jul 8, 2025 5:41PM

వైసీపీ నుంచి ప్రసన్నను సస్పెండ్ చేయాలి : అనిత

  మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి  స్పందించారు. ప్రసన్న కుమార్ నువ్వు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను నీ తల్లికి చూపించు మీరు మాట్లాడిన మాటల్లో తప్పులేదని ఆమె అంటే మాకు చెప్పడి మేం మాట్లాడటం మానేస్తాం అని హోం మంత్రి  అన్నారు .మహిళల గౌరవాన్ని జగన్ కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 11 సీట్లు వచ్చినప్పటికీ వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని నిప్పులు చెరిగారు.  ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై.. ప్రసన్నకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనపై కూడా ప్రసన్న కుమార్ ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడారని ఆమె గుర్తుచేశారు. వైసీపీలో మహిళలను అగౌరవపరిచే సంస్కృతి ఉందని, సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు అనేక మంది నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆమె విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటనలో భాగంగా ఆమె సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు  రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి డిమాండ్. తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో కోవూరులో జరిగిన అక్రమాల గురించి మాట్లాడుతుంటే మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై నోరు పారేసుకున్న ప్రసన్నను మహిళా సమాజం క్షమించదన్నారు.
వైసీపీ నుంచి ప్రసన్నను సస్పెండ్ చేయాలి : అనిత Publish Date: Jul 8, 2025 4:54PM

తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కావాలనేది నా లక్ష్యం : సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది.  ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి  కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు.  దీంతో జలాశయానికి వరద పోటెత్తుతున్నది. సుంకేశుల, జురాల నుంచి 1.70లక్షల క్యూసెక్కులకరుపైగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు.  ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది.అనంతరం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చన, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. ఆ తప్పులు సరిచేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని తెలిపారు. ఇవాళ తన జీవితంలో సంతోషకరమైన రోజుని సీఎం అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం శుభపరిమాణం అని తెలిపారు. నీటి కరువు ఉన్న రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలా మంది  అన్నారు.  కానీ ఆ ప్రాంతం స్థితిగతులు మార్చందుకు ఎన్టీఆర్ నడుం బిగించారు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నానని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఈనెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్‌ విధించా. ఈనెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తాం. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట.. అన్నీ మేమే తెచ్చామన్నారు. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, జనార్దన్ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవోలు పాల్గొన్నారు.
తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కావాలనేది నా లక్ష్యం :  సీఎం చంద్రబాబు Publish Date: Jul 8, 2025 4:17PM

30 యాక్ట్... హౌస్ అరెస్టులు లేవు.. ఆంక్షలకే వైసీపీ అనవసర గగ్గోలు!

ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిప్పుకుని పర్యటన అనుమతు కోసం వెళ్తే 30 యాక్ట్ అంటూ హడావుడి చేసి అనుమతులు ఇవ్వకుండా చేశారు. ఆనుమతులు ఇచ్చ కూడా ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కూడా ఉంటాయని చూపించిన ఘనత వైసీపీకే దక్కుతుందని ప్రజలు అంటున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలన ముగిసింది. ఇప్పుడు జగన్ పార్టీకి రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఐదేళ్ల నిర్బంధ కాండ నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడిలో పడింది. పోలీసులు సైతం తమ విధులు స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన వైసీపీ మాత్రం ప్రశాంతంగా పర్యటనలు చేసుకుంటే   మైలేజ్ రాదని పరామర్శ యాత్రల పేరిట వెళ్తు గొడవలు, దాడులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల, చివరికి సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలతో చెలగాటాలాడుతోంది.   మామిడి రైతుల సమస్యలు అంటూ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంకు రానున్న జగన్ కు గతంలో జరిగిన కారణాలతో పోలీసులు ఆంక్షలు విధిస్తే దాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. గతంలో వైసీపీ చేసిన పనిని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ప్రజాస్వామ్యం లో తిరిగే హక్కుతో పాటు భద్రత కూడా కల్పిస్తున్నది. 30 యాక్ట్ అంటూ అరెస్టులు చేయడం లేదు. శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలు మాత్రమే విధిస్తున్నది. దీనికే జగన్ అంటే, జగన్ వస్తుంటే.. కూటమి ప్రభుత్వం భయపడుతోంది అంటూ నానా యాగీ చేస్తున్నది వైసీపీ. జగన్  బంగారుపాల్యం యాత్రనే తీసుకుంటే.. మామిడి సీజన్ ముగిసిన దశలో మామిడిరైతుకు పరామర్శ, భరోసా కోసం అంటూ జగన్ కుట్ర కోణం దాగి ఉందన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. అయితే నిజమైన రైతులతో మాట్లాడుతారా లేక పేటీఎం బ్యాచ్ ను జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తారా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ యాత్ర ఏ తీరున సాగుతుందో చూడాలి. 
30 యాక్ట్... హౌస్ అరెస్టులు లేవు.. ఆంక్షలకే వైసీపీ అనవసర గగ్గోలు! Publish Date: Jul 8, 2025 3:33PM

సిగాచీ ప్రమాద ఘటనపై..ఎన్‌డీఎం బృందం సీరియస్

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది.   పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఘటనపై ఇప్పటి వరకు 44కు మృతుల సంఖ్య చేరింది. అనంతరం ఎన్‌డీఎంఏ అక్కడే సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. యాజమాన్యం సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంతో సీరియస్ అయింది. పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.  సమావేశం అనంతరం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది.  సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 30న పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
సిగాచీ ప్రమాద ఘటనపై..ఎన్‌డీఎం బృందం సీరియస్ Publish Date: Jul 8, 2025 3:30PM

జమిలికి లైన్ క్లియర్!?

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది. ఆ నివేదిక జమిలిని సానుకూలంగా ఉండటంతో దేశంలో అన్ని ఎన్నికలూ ఒకే సారి జరిపే దిశగా అడుగులను వేగవంతం చేసింది. ఈ విషయంగా రాష్ట్రాలతోనూ చర్చించింది.  బీజేపీ పాలిత రాష్ట్రాలూ, ఎన్డీయే కూటమి పార్టీలూ జమిలికి సై అన్నాయి. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలూ, బీజేపీ ప్రత్్యర్థి పార్టీలూ జమిలికి నో అన్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రాలు జ‌మిలికి   గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. విషయం అలా ఉండగా కొందరు న్యాయవాదులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించారు.  జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. అలాగే జమిలి నిర్వహణ వల్ల వ్యయం తగ్గుతుందన్న విషయంలోనూ వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకే దఫా ఎన్నికల నిర్వహణ ఎన్నికల అవినీతి పెచ్చరిల్లడానికే దారి తీస్తుందని విమర్శలు గుప్పించారు. అయితే వీటిలో వేటికీ కేంద్రం బదులివ్వకపోవడంతో ఢిల్లీ బార్ అసోసియేషన్ సహా దేశ వ్యాప్తంగా సుప్రీం కోర్టులో పెద్ద సంఖ్యలో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. సరే సుప్రీం కోర్టు ఆ పటిషన్లను ఏకకాలంలో విచారించేందుకు అంగీకరించడంతో కేంద్రం కూడా సుప్రీం కు మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను సుప్రీం కు సమర్పించింది. ఆ నివేదిక ప్రకారమే ముందకు వెడుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదికపై అధ్యయనం చేసి జమిలికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను క్వాష్ చేయాలని సుప్రీం ను కోరింది. దీనిపై నివేదికను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జమిలి ఎన్నికలకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు భారీగా తగ్గుతుందన్న అంశంతో ఏకీభవించింది.  అలాగే జమిలికి ఓకే చెప్పింది. దీంతో జమిలికి ఇక అడ్డంకులన్నీ తొలగిపోవడంతో కేంద్రం తన కార్యాచరణను స్పీడప్ చేసింది. జమిలికి దేశ వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలలోనే జమిలి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది.  
జమిలికి లైన్ క్లియర్!? Publish Date: Jul 8, 2025 3:12PM

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

  భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు.  ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోగా ఈవోను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. 
భద్రాచలం ఆలయ ఈవోపై దాడి Publish Date: Jul 8, 2025 3:02PM

జగన్.. షర్మిల.. ఎవరికి వారుగా తండ్రి వైఎస్ కు నివాళులు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా  నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీని నడిపిస్తోంది. జగన్ షర్మిలల మధ్య ఉన్న విభేదాలు జరిగిన ఎన్నికల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జగన్ పై ఆ ఎన్నికల్లో షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డి కూతురు సునీతను వెంటబెట్టుకొని బాబాయ్ హత్య గురించి ఎన్నికల్లో తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. ఆ  ఎన్నికల నుండి ఇద్దరు మధ్య రాజకీయ, కుటుంబ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలులలో జరిగే తండ్రి వైయస్ జయంతి వేడుకల్లోగాని, వర్ధంతి వేడుకల్లో గాని వేరువేరుగానే పాల్గొంటూ నివాళులర్పిస్తూ వస్తున్నారు. మంగళవారం (జులై 8) జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలల్లోనూ ఇదే తీరున ఎవరికి వారుగా తండ్రికి నివాళులర్పించారు. వారి తల్లి విజయం మాత్రం ఇద్దరితో కలిసి ఘాట్లో నివాళులు అర్పించారు .ఉదయం 7:30 కు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, తల్లి విజయమ్మ, బంధువులు, కుటుంబ సభ్యులు, వైసిపి నాయకులతో కలిసి ఉదయం  8 .45 గంటల నుంచి 9.54 గంటల  వరకు నివాళులర్పించి ప్రార్థనలు చేసి జగన్ వెళ్ళిపోయారు.జగన్ వెళ్లిన తర్వాత ఆయన సోదరి షర్మిల వైయస్ ఘాట్ కు  వచ్చి తండ్రికి నివాళులర్పించారు. తల్లి విజయమ్మ అటు జగన్ తోనూ ఆ తర్వాత షర్మిళ తోను  నివాళులర్పించడం ఆమె లో భావోద్వేగాన్ని నింపింది.
జగన్.. షర్మిల.. ఎవరికి వారుగా తండ్రి వైఎస్ కు నివాళులు Publish Date: Jul 8, 2025 2:50PM

కోవూరు కొలిమి.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలతో కాక

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే.. నోటి దురుసు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురవుతోంది. స్థానిక ఎమ్మెల్యే తనకు సోదరి వరుస కూడా అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పార్టీలోని కొందరు అంటుంటే.. వాటిని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడ్డమేంటన్న చర్చకు తెరలేచింది. నల్లపరెడ్ల పరువు మొత్తం తీస్తున్నావుగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  ప్రసన్న ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర  పదజాలంతో కామెంట్ చేశారు. అంతే కాదు.. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం అనరాని మాటలు అన్నారు. వీపీఆర్ గా పేరున్న ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని.. ఆయన్ను హతమార్చడం కోసం కొన్ని టీములు సుపారీ సిట్టింగులు వేసినట్టుగా తనకు సమాచారముందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. పోయి పోయి పలు చోట్ల తిరిగి పీహెచ్డీలు చేసొచ్చిన.. ప్రశాంతిరెడ్డిని పెళ్లాడే బదులు తనకు చెప్పి ఉంటే.. ఒక మంచి కన్నెపిల్లను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడ్నని అనడంతో ఇప్పుడు కోవూరు మొత్తం కొలిమిలా తయారైంది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరు మొత్తం అట్టుడుకుతోంది. తెలుగుదేశం- వైసీపీ మధ్య పొలిటికల్ వార్ షురూ అయ్యింది. అదలా ఉంటే తనపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు.  ఒక్క మహిళా ఎమ్మెల్యేగా తాను ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే..సభ్య సమాజం చెవులు మూసుకునే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత భాషా ప్రయోగం చేశారని విమర్శించారు.  అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడి మా నోరు మూయిద్దామనుకుంటున్నావా? అని నిలదీశారు. ఒక మాజీ మంత్రి అయి ఉండీ మహిళల పట్ల ఇంత నీచంగా, అసభ్యంగా మాట్లాడడాన్ని బట్టే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తోందన్నారు.   ఇక ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.  ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చెప్పుకోలేని బాధలు అనుభవించిన చాలా మందిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండవచ్చన్నారు. అయినా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఒక సూటి ప్రశ్న అన్న ఆమె..  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇళ్లల్లోని మహిళలకు వినిపించగలరా అని నిలదీశారు.   ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
కోవూరు కొలిమి.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలతో కాక Publish Date: Jul 8, 2025 2:21PM

సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు

పాతబస్తీలోని సిటీ సివిల్  కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వ్యాజ్యాల కోసం వచ్చిన ప్రజలను, న్యాయవాదులను, న్యాయమూర్తులను కోర్టు నుంచి బయటకు పంపేశారు.   కోర్టు మొత్తాన్నీ ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, బాంబు డిఫ్యూసింగ్ స్కాడ్‌తో కోర్టు మొత్తాన్ని జల్లెడ పట్టారు. చివరకు బెదరింపు కాల్ ఫేక్ అని తేల్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో ఈ బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్నది తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు Publish Date: Jul 8, 2025 12:39PM

జ‌గ‌న్, ప‌వ‌న్.. స్క్రిప్ట్ రైట‌ర్లే తేడా?

ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో  వ్యక్తం అవుతుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్స‌లు పొంత‌న లేకుండా ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ఏది ప‌డితే అది మాట్లాడేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో హోరు మంటున్నాయ్. కార‌ణం అందులో మొద‌టిది ప్రాంతీయ‌త‌. ఆయ‌న ఎక్క‌డ పుట్టారో ఎక్క‌డ పెరిగారో ఎక్క‌డ ఎదిగారో అనే దాని మీద ఒక స్థిర‌మైన స‌మాచారం చాలా మందికి తెలీదు. అది అందుబాటులో ఉండ‌దు కూడా. ప‌వ‌న్ కుటుంబానిది పాల‌కొల్లుకు ద‌గ్గ‌ర్లోని మొగ‌ల్తూరు. ఈ ప్రాంతంలో వారికో ఇల్లు కూడా ఉంది. ఇక తండ్రి వెంక‌ట్రావు కొణిదెల ఎక్సైజ్ శాఖ అధికారిగా ప‌లు ప్రాంతాల్లో పని చేశారు.  దీన్ని ఆస‌రాగా తీసుకున్న ప‌వ‌న్.. ప‌లు ప్రాంతాల్లో త‌న రిఫెరెన్సులు జార విడుస్తుంటారు. చీరాల, బాప‌ట్ల‌, ఒంగోలు ఇలా ప‌లు ప్రాంతాల్లో తాను పుట్టాన‌నీ పెరిగాన‌నీ త‌ర్వాత ఆడుకున్నాన‌నీ.. ఇలా  ర‌క‌ర‌కాలుగా చెబుతుంటారాయ‌న‌. ఆపై నెల్లూరులో ఆయ‌న య‌వ్వ‌నం  సాగిన‌ట్టుగా ప‌దే ప‌దే చెబుతుంటారు. ఇక్క‌డ ఒక కాలేజీలో తాను చ‌దువుకున్న‌ట్టు చెబుతుంటారు. ఆపై తాను ఇంట‌ర్ క‌న్నా మించి చ‌ద‌వ‌క పోవ‌డానికి గ‌ల కార‌ణం పుస్త‌కాల్లో తాను చ‌దువుకోవ‌ల్సినంత చ‌దువు లేద‌ని అంటారు. నిజానికి   ఇంట‌ర్ క‌న్నా మించి చ‌దవక పోవడాన్ని త‌న‌కు తానే ఒక అవ‌మానంగా భావించి అక్క‌డ‌క్క‌డా ఇలాంటి డ్రాపింగులు చేస్తుంటారు.  ఇక త‌న‌కు పాల‌నా అనుభ‌వం లేద‌ని ఒక సారి..  తాను త‌లుచుకుంటే బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌లై పోతుంద‌ని ఒక సారి.. తాను- స‌ముద్రం- శిఖ‌రం ఒక‌టేన‌నీ.. ఎవ‌రి కాళ్ల ద‌గ్గ‌ర ప‌డి బ‌తికేది లేద‌ని ఒక సారి.. ఆపై త‌న‌క‌న్నా మించిన వారు ఎంద‌రో ఉన్నార‌నీ ఇలా  ర‌క‌ర‌కాలుగా   పొంత‌న లేని మాట‌లు మాట్లాడే స్తుంటారు. ఇదంతా ఆయ‌న‌కు స్క్రిప్ట్ రాసిచ్చే వారి  ప్ర‌భావ‌మా..  లేక త‌నే స్వ‌యంగా ఇలాంటి కామెం ట్లు చేస్తుంటారా? ఒక‌ప్పుడు హిందువుల‌కు వ్య‌తిరేకంగా ఎన్నో కామెంట్లు చేసిన  పవన్ కల్యాణ్..  తాను మురుగ‌న్ దారిలో న‌డిచానని.. చెప్పేసి బుక్ అయిపోతుంటారు. దీంతో ఆయ‌న క్ర‌మంగా త‌న  క్రెడిబిలిటీ కోల్పోతుంటారు. అభిమానులంటే ఎలాగోలా ఆయ‌న జార‌విడిచే ప్ర‌తిదీ అమృత ప్రాయంగా తీసుకుంటారు. కాద‌న‌డం లేదు. కానీ అందరూ అలా ఉండ‌రు క‌దా? ఈ  విష‌యంలో ప‌వ‌న్ ఎందుకో వెన‌క‌బ‌డ్డార‌నే చెప్పాలి. అదే చంద్ర‌బాబు త‌న‌కు తాను ఇంత బిజీగా ఉండ‌గా  కూడా ఒక స్ట‌డీ  చేసి త‌ర్వాతే ఏదైనా మాట్లాడ తారు. మొన్న‌టికి మొన్న మ‌హిళా దినోత్స‌వం  రోజు.. రాజ‌కీయేత‌ర ప్ర‌సంగం ఒక‌టి చేశారాయ‌న‌. త‌న ఆహార‌పు అల‌వాట్లు.. ఇత‌ర‌త్రా చ‌ర్చించారు. ఈ క్రమంలో ఆయ‌న మాట‌ల్లో ఒక మెచ్యూరిటీ క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు.. ఎంతో స్ట‌డీ చేసిన ఇన్ఫో క‌నిపిస్తుంది. ఇంత బిజీగా ఉండే చంద్రబాబుకు అంత ప‌రిశీల‌న  ఎలా సాధ్యం అని  ఆయ‌నంటే గిట్ట‌ని వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.  ఇలాంటి దేదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోగానీ జ‌గ‌న్ లోగానీ ఉన్న‌ట్టు క‌నిపించ‌దు. జ‌గ‌న్ ఎంత‌టి ఇమ్మెచ్యూర్ అంటే.. ఆయ‌న‌కు పాబ్లో ఎస్కో బార్ అంటే ఎవ‌రో తెలీదు. ప్ర‌త్య‌ర్ధులు త‌న‌ను అత‌డితో పోలిస్తే.. ఎవ‌ర‌ని ఒక అమాయ‌క మొహం పెట్టారు. స‌రే అంద‌రికీ అన్నీ తెలియాల్సిన  ప‌న్లేదు. కానీ కొంతైనా సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక- ప‌రిజ్ఞానం ఉండాలి క‌దా? ఇదే జ‌గ‌న్ లాంటి వారిచ్చిన‌ట్టు కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు,  డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ వంటి పథకాల  గురించి స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివిన లోకేష్ ఎప్పుడో క‌నుగొన్నారు. కానీ బై బ్యాడ్ ల‌క్.. వాటినే జ‌గ‌న్ కాపీ కొట్టి.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌గా, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ గా మార్చిన‌ట్టు చెబుతారు కొంద‌రు. అదే బాబు అలా క్కాదు.. ప్ర‌స్తుతం పీ4 ఎంత‌టి మ‌హ‌త్త‌ర‌మైన ప‌థ‌క‌మంటే.. అది   పేద‌రికాన్ని పార‌దోలే ఒక  సంజీవ‌నే. అలాంటిదేదీ జ‌గ‌న్ నుంచి ఆశించ‌లేం. ఆయ‌న ఏదైనా స‌రే ఒక పెట్టుబ‌డి  కింద కాకుండా ఖ‌ర్చుగా మార్చుతుంటారు. దీంతో.. రాష్ట్రాన్ని దివాలా తీయించే ధోర‌ణి అవ‌లంబిస్తుంటారు. బేసిగ్గా  జ‌గ‌న్ చుట్టూ పెద్ద గొప్ప మేథావులెవ‌రూ లేరు. ఒక వేళ ఉన్నా వారెవ‌రూ ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌లో ఉండ‌రు. దానికి తోడు ఆయ‌న‌కు స్క్రిప్ట్ అందించే వారు కూడా ఎంతో అతిశ‌యంగా ఇస్తుంటారు. ఇవ‌న్నీ రివ‌ర్స్ లో విక‌టించిన‌వే త‌ప్ప  ఆయ‌న్ను కాపాడ‌లేక పోయాయి. ప‌వ‌న్ కూడా అంతే ఇద్ద‌రూ ఇద్ద‌రే. వారికెవ‌రు స్క్రిప్ట్ ఇస్తారోగానీ.. వాటిలో ఎంత మాత్రం ఇన్ఫో లేక పోగా.. అతిశ‌యంగా అనిపిస్తాయి. ఇదే ఈ ఇద్ద‌రికీ పెద్ద మైనస్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
జ‌గ‌న్, ప‌వ‌న్.. స్క్రిప్ట్ రైట‌ర్లే తేడా? Publish Date: Jul 8, 2025 12:05PM

ఇక టీటీడీ పుస్తక ప్రసాదం!

దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని  అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి మహాత్మ్యం, వైభవం అతి సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా చిన్న సైజులో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది.  మతమార్పిడులను అరికట్టడం, హిందూ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా ఇందుకు సంకల్పించింది.   శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల్లో ఉచితంగా  పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక  పుస్తకాలను చిన్న సైజులో   భక్తులు చేతిలో ఇమిడే విధంగా  ముద్రించి  దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు తిరుమల తిరుపతిలలో కూడా భక్తులకు వీటిని  శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని నిర్ణయించినట్లు బీఆర్నాయుడు తెలిపారు. అలాగే తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు వీటిని అందజేస్తామన్నారు.   
ఇక టీటీడీ పుస్తక ప్రసాదం! Publish Date: Jul 8, 2025 11:12AM

తెలంగాణ క్రీడాభివృద్ధిలో భాగస్వామిగా ఉంటా.. రేవంత్ తో కపిల్ దేవ్

 క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కపిల్ దేవ్ అభినందించారు. రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కపిల్‌దేవ్‌కు సీఎం రేవంత్‌ వివరించారు. దీంతో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతోపాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తాను భాగస్వామిగా ఉంటానని కపిల్ దేవ్ ముందుకు వచ్చారు.
తెలంగాణ క్రీడాభివృద్ధిలో భాగస్వామిగా ఉంటా.. రేవంత్ తో కపిల్ దేవ్ Publish Date: Jul 8, 2025 10:48AM

తెలంగాణలో మీడియా, సినిమా రంగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా.. సీఎం రేవంత్ తో అజయ్ దేవగన్

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం (జులై7) క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌,  వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్జాతీయ స్థాయి  స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కూడా అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవ‌గ‌ణ్‌కు వివ‌రించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 
తెలంగాణలో మీడియా, సినిమా రంగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా.. సీఎం రేవంత్ తో అజయ్ దేవగన్ Publish Date: Jul 8, 2025 10:40AM

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు. పలువురు విద్యార్థలు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కడలూరు చెమ్మన్ గుప్పం రైల్వే గేటు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రైలు వచ్చే సమయం అయినా కూడా రైల్వే గేటు వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.  పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో.. ఆ ధాటికి స్కూలు బస్సు దాదాపు 50 మీటర్ల దూరానికి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘట స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు.  
స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి Publish Date: Jul 8, 2025 10:24AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ సమీపంలో సుజాతమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగుదశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఇలా ఉండగా వేమిరెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి Publish Date: Jul 8, 2025 10:17AM

సినీ, క్రీడా ప్ర‌ముఖుల‌తో సీఎం రేవంత్

రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్ద‌రు సినీ క్రీడా సెల‌బ్రిటీల‌ను క‌లిశారు. వారిలో ఒక‌రు 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత లెజండరీ క్రికెటర్ క‌పిల్ దేవ్ కాగా. మ‌రొక‌రు న‌టుడు, నిర్మాత  అజ‌య్ దేవ్ గ‌న్.  ఈ మ‌ధ్య ప‌దే ప‌దే రేవంత్   140 కోట్ల భార‌త దేశం నుంచి వ‌చ్చే ప‌త‌కాల సంఖ్య కేవ‌లం వేళ్ల మీద లెక్క‌బెట్ట‌గ‌లిగేంత మాత్ర‌మేనా? అంటున్నారు.   ఈ క్ర‌మంలో చూస్తే.. క‌పిల్ దేవ్ లాంటి క్రీడా ప్ర‌ముఖుల  స‌ల‌హా  సూచ‌న‌లు చాలా చాలా అవ‌స‌రం. దానికి తోడు ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించ‌మ‌ని, ఆపై క్రీడ‌ల‌ కోసం  వంద కోట్లు ఇవ్వ‌మ‌ని ఆయ‌న కేంద్ర మంత్రిని క‌లిసి మ‌రీ విన్న‌వించుకున్నారు. ఇక ఒలింపిక్స్- 2036 రెండు ఈవెంట్లు.. తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌ప‌మ‌ని కూడా అడిగారు సీఎం రేవంత్.  ఇక అజ‌య్ దేవ్ గ‌న్ సీఎం భేటీలోని ముఖ్యాంశ‌మేంట‌ని చూస్తే.. హైద‌రాబాద్ లో ఫిల్మ్ స్టూడియో క‌ట్ట‌డానికి త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల్సిందిగా దేవ్ గ‌న్ సీఎం రేవంత్ ని అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అజ‌య్ దేవ్ గ‌న్ కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ఒకటి మాదాపూర్ లో   ఉంది. ఇక్క‌డే ఒక ఫుల్ స్టూడియో సెట‌ప్ ఉంటే బావుండ‌ని అజ‌య్ దేవ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందుకోసమే  సీఎం రేవంత్ ని అజ‌య్ దేవగన్ కోరినట్లుగా తెలుస్తోంది.  
సినీ, క్రీడా ప్ర‌ముఖుల‌తో సీఎం రేవంత్ Publish Date: Jul 8, 2025 10:05AM

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. సై, ఛత్రపతి, బాహుబలి, రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలకు శివశక్తి దత్తా పాటలు రాశారు. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. అలాగే జానకిరాముడు చిత్రానికి శివశక్తి దత్తా రచయతగా పని చేశారు. ఇక చంద్రహాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా స్వయానా సోదరులు.  శివశక్తి దత్తా మృతితో కీరవాణి, రాజమౌలి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. శివశక్తిదత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం Publish Date: Jul 8, 2025 9:46AM

బిపి అదుపులో ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలంటే..?

  బిపి ని సాధారణంగా  రక్తపోటు అని కూడా పిలుస్తారు.  హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు  గుండెపోటు,  స్ట్రోక్‌లకు కారణమవుతుంది.   వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు,  దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు.  అందుకే దీనిని  సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి.  వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం  గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్,  మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు,  క్రమం తప్పకుండా వ్యాయామం,  వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో  అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం.  ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే  ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు,  మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల  కలయిక ఉండాలి. ఇది  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో  అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది.   క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది.  బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది.  ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
బిపి అదుపులో ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలంటే..? Publish Date: Jul 8, 2025 9:30AM

వర్షాకాలంలో పెరుగు సరిగా తోడు కావడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

  వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని,  విశ్రాంతిని కలిగిస్తుంది. అందుకే చాలామందికి వర్షాకాలం అంటే బాగా ఇష్టం ఉంటుంది.  కానీ దీని కారణంగా చాలా సమస్యలు కూడా ఉన్నాయి.  వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగా తోడు కాకపోవడం. చలికాలంలో జరిగేది ఏంటంటే.. పెరుగు తొందరగా తోడు కాకపోవడం ఒకటైతే.. పెరుగు బాగా క్రీమ్ లాగా కాకపోవడం మరొకటి.    కాలాన్ని బట్టి అన్ని మారుతున్నట్టే ఈ ప్రక్రియలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది.  అయితే ఈ చలికాలంలో పెరుగు బాగా తోడు కావాలన్నా, క్రీమ్ గా గడ్డ పెరుగు రావాలన్నా ఈ కింది చిట్కాలు గమనించి వాటిని ఫాలో అవ్వాలి. ఉష్ణోగ్రత.. పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా ముఖ్యం.  కొంతమంది పాలను వేడి చేసి అలా వదిలేసి ఉష్టోగ్రత చెక్ చేయకుండా తోడు పెడుతుంటారు. వాతావరణం కారణంగా పాలు తొందరగా చల్లగా అవుతాయి. అందుకే పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పాత్ర.. పెరుగు తోడు పెట్టాలి అనుకునే పాత్ర శుభ్రంగా ఉండాలి.  కొందరు ఏం చేస్తారంటే.. పాలు కాచిన గిన్నెలో అట్లాగే కాసింత పెరుగు వేసేస్తుంటారు. ఇది పెరుగు అదొక రకమైన వాసన,  పెరుగు రుచి మారడానికి కారణం అవుతుంది.  శుభ్రంగా, పొడిగా ఉన్న గిన్నెలో పాలు వేసి అందులో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది. పెరుగు కంటెంటే.. పాలు తోడు పెట్టడానికి పెరుగును జోడించడం మామూలే. అయితే  చలికాలంలో వాతావరణం కారణంగా కేవలం కొద్దిగా పెరుగు వేస్తే అది తోడు కావడం చాలా ఆలస్యం అవుతుంది.  పుల్లగా లేకుండా ఫ్రెష్ గా ఉన్న పెరుగును వినియోగించాలి.  ఒక లీటరు పాలకు ఒకటి నుండి రెండు స్పూన్ల తాజా పెరుగుతో తోడు పెడితే పెరుగు చాలా బాగా తోడవుతుంది. ఒక చిట్కా.. పెరుగును పాలలో ఒక చెంచా మొత్తంలో వేసి అలా మూత పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేస్తే పెరుగు తోడు కావడం లేటవుతుంది. అలా కాకుండా పెరుగును పాలలో వేయగానే పాలు మొత్తం బాగా కలపాలి.  ఇలా చేస్తే పెరుగు చక్కగా సమంగా తయారవుతుంది. ప్రదేశం.. పెరుగు బాగా తోడు కావాలి అంటే ఇంట్లో స్థిరమైన, కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో పాల గిన్నెను ఉంచాలి. దీని వల్ల పెరుగు బాగా తోడవుతుంది. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తొందరగా తోడు కాదు.                                     *రూపశ్రీ.  
వర్షాకాలంలో పెరుగు సరిగా తోడు కావడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి..! Publish Date: Jul 8, 2025 9:30AM

పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం డ్యామ్

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇలా ఉండగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీటి వరద కొనసాగుతోంది. సుంకేసుల, జారాల నుంచి లక్షా 72 వేల 705 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. కాగా శ్రీశైలం జలశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటను రానున్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలకు ముందు  చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. అంతకు ముందంు ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.  ఇలా ఉండగా జులై నెలలోనే శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం పాతికేళ్లలో ఇదే తొలి5 సారి. ఇక పోతే చంద్రబాబు శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అనంతరం  నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు.  
పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం డ్యామ్ Publish Date: Jul 8, 2025 9:30AM

రొట్టెల పండుగలో మంత్రి నారాలోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నట్లు నారా లోకేష్ చెప్పారు.  ముఖ్యమంత్రి  ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.  ప్రజల శ్రేయస్సే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మతసామరస్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందిన బారాషాహీద్ మసీదులో జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఈ రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివస్తారు. స్వర్ణాల చెరువులో తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకుంటారు. 
రొట్టెల పండుగలో మంత్రి నారాలోకేష్ Publish Date: Jul 7, 2025 11:16PM

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవదహనం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు.   హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తమ పిల్లలతో పాటు ఇటీవల వెకేషన్‌ కోసం అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి సరదాగా అంట్లాంటా వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి తిరిగి డల్లాస్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు గ్రీన్ కౌంటీ ప్రాంతానికి చేరుకున్నది. అక్కడ రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ట్రక్ వారు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొనడంతో   కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకట్, తేజస్విని, వారి ఇద్దరు పిల్లలూ సజీవదహనమయ్యారు. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వాళ్ల కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తహా తమ ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు.  
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవదహనం Publish Date: Jul 7, 2025 10:57PM