తెలంగాణలో మీడియా, సినిమా రంగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా.. సీఎం రేవంత్ తో అజయ్ దేవగన్
posted on Jul 8, 2025 10:40AM

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కూడా అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవగణ్‌కు వివరించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని అజయ్ దేవగణ్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.