సినీ, క్రీడా ప్రముఖులతో సీఎం రేవంత్
posted on Jul 8, 2025 10:05AM

రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్. ఈ మధ్య పదే పదే రేవంత్ 140 కోట్ల భారత దేశం నుంచి వచ్చే పతకాల సంఖ్య కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగేంత మాత్రమేనా? అంటున్నారు.
ఈ క్రమంలో చూస్తే.. కపిల్ దేవ్ లాంటి క్రీడా ప్రముఖుల సలహా సూచనలు చాలా చాలా అవసరం. దానికి తోడు ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించమని, ఆపై క్రీడల కోసం వంద కోట్లు ఇవ్వమని ఆయన కేంద్ర మంత్రిని కలిసి మరీ విన్నవించుకున్నారు. ఇక ఒలింపిక్స్- 2036 రెండు ఈవెంట్లు.. తెలంగాణ రాష్ట్రంలో జరపమని కూడా అడిగారు సీఎం రేవంత్.
ఇక అజయ్ దేవ్ గన్ సీఎం భేటీలోని ముఖ్యాంశమేంటని చూస్తే.. హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో కట్టడానికి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా దేవ్ గన్ సీఎం రేవంత్ ని అడిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అజయ్ దేవ్ గన్ కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ఒకటి మాదాపూర్ లో ఉంది. ఇక్కడే ఒక ఫుల్ స్టూడియో సెటప్ ఉంటే బావుండని అజయ్ దేవగన్ భావిస్తున్నారు. ఇందుకోసమే సీఎం రేవంత్ ని అజయ్ దేవగన్ కోరినట్లుగా తెలుస్తోంది.