శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో భారీగా గంజాయి పట్టివేత
posted on Sep 20, 2025 5:37PM

శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి కనిపించింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి తరలించిన ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయంపై ఇండియాలో కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేరం యొక్క తీవ్రతను బట్టి కోర్టు విచారణ కొనసాగుతోంది.
హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి అవసరం లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పండించే అధిక నాణ్యత గల గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందించడంతో, కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో ఇవి వేగంగా పెరుగుతాయి. సాధారణ గంజాయితో పోలిస్తే ఇందులోని మత్తు పదార్థం టెట్రా హైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.
విదేశాల నుంచి, ముఖ్యంగా థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి ఇది అక్రమంగా భారత్‌కు రవాణా అవుతోంది. కొన్ని దేశాల్లో సాగుపై నిబంధనలు సడలింపులు ఉండటంతో స్మగ్లింగ్ ముఠాలు దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఒక్క కిలో హైడ్రోపోనిక్ గంజాయి ధర రూ.1 కోటి వరకూ చేరుతోంది. తరచుగా మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.53 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.