అరకు కాఫీకి బిజినెస్ లైన్ అవార్డు.. అభినందించిన చంద్రబాబు

చంద్రబాబు అరకు కాఫీకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అరకు ప్రాంతంలో  సాగయ్యే ఈ కాఫీ రుచిలో మేటి అని గుర్తించిన చంద్రబాబు ఈ కాఫీకి అంతర్జాతీయంగా మంచి  బ్రాండ్ గా గుర్తింపు పొందేలా ప్రోత్సాహం అందించారు. ఒక దశలో ఆయనే స్వయంగా అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దాదాపు ప్రతి వేదికపైగా ఈ కాఫీ విశిష్ఠతను వివరించారు.

తన సతీమణి  నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలో భాగంగా అరకు వెళ్లినప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా ఆమెకు ఫోన్ చేసి మరీ అరకు కాఫీ తాగాలని సూచించారు. అప్పట్లో ఈ విషయాన్ని భువనేశ్వరి స్వయంగా మీడియాకు చెప్పి.. తాను అరకు కాఫీ తాగుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేనా అరకు కాఫీ విశిష్ఠతను చంద్రబాబు మోడీకి వివరించి, ఆ కాఫీ రుచి చూపించారు. దీంతో మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ కాఫీ గురించి ప్రస్తావించారు. ఈ కాఫీ సాగుద్వారా అరకు గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగిన విషయాన్ని వివరించారు. ఆ విధంగా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు అరకు కాఫీని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆ అరకు కాఫీకి  ప్రతిష్ఠాత్మక బిజినెస్ లైన్ పురస్కారం దక్కింది. ఈ నేపథ్యంలో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పన కుమారి, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సుధారాణి శనివారం (అక్టోబర్ 4) ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక  బిజినెస్ లైన్ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ ఫర్మేషన్ విభాగంలో పురస్కారం దక్కడంపై వారిని చంద్రబాబు అభినందించారు.  అవార్డును, ప్రశంసా పత్రాన్ని   పరిశీలించారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా మారిందని చంద్రబాబు చెప్పారు. గిరిజన ప్రాంతంలో  సేంద్రియ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువాసనలతో పాటు ప్రత్యేక రుచి కూడా కలిగి ఉంటుందన్నారు. ఆ కారణంగానే అరకు కాఫీకి మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందన్న సీఎం.. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu