గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి!

పోలవరం పనులు ఇక రాకెట్ వేగంతో సాగనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు నిర్దుష్ట గడువు నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు శుక్రవారం (అక్టోబర్ 3) అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి కావాలనీ, అందుకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా అధికారులు పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. అవసరమైన అనుమతులను  కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి   తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు.  డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్  మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు.

బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74శాతం మేర పూర్తయినట్లు సీఎంకు తెలియ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈఏడాది డిసెంబరు  నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచి  ప్రారంభించాలని.. 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చంద్రబాబు అధికారులకు డెడ్ లైన్ విధించారు. అలాగే.. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి వన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. 

దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటి కప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్ కు అనుసంధానించాలని సూచించారు 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu