కోమాలో క్రికెటర్ జెస్సీ రైడర్
posted on Mar 28, 2013 2:03PM

న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లాడు. న్యూజిలాండ్ లోని క్రిస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఓ బార్ వద్ద జరిగిన గొడవలో రైడర్ ను కొందరు తీవ్రంగా కొట్టడంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రైడర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రైడర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాలతో ముడిపడిందే. మద్యానికి బానిసైన రైడర్ పలుమార్లు తప్పతాగి వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు నుంచి అనేకసార్లు అతణ్ని తప్పించారు. మరో ఆరు రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ ఆరో సీజన్లో రైడర్ పుణె వారియర్స్ తరఫున ఆడాల్సి ఉంది. గత ఏడాది ఆ జట్టు తరఫున రైడర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా రైడర్ పై దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. గతంలో రైడర్ తో గొడవపడిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చి అతనిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.