వైఎస్ వివేకా హత్య కేసు.. తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశాలిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. వైఎస్ వివేకా కుమార్తె అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. తదుపరి దర్యాప్తునకు బుధవారం (డిసెంబర్ 10) ఆదేశాలిచ్చింది.  

ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందనీ, లేకుంటే  అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. అయితే, దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని, మళ్లీ విచారణకు అవకాశం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై దృష్టి సారించాలనీ, అందుకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu