గుడిలో దండల పెళ్లి.. యువ ఐఏఎస్ జంట ఆదర్శ వివాహం

కోట్లాది రూపాయల ఖర్చుతో ఆడంబరంగా, ఆర్భాటంగా వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో వాటన్నిటికీ దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు అత్యంత నిరాడంబరంగా వివాహబంధంతో ఒక్కటై ఆదర్శంగా నిలిచారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి.శ్రీ పూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్యవర్మల వివాహం శుక్రవారం (నవంబర్ 21) విశాఖలో జరిగింది. విశాఖ కైలాసగిరిపై  ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.  

ఈ వివాహ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత వీరు నేరుగా విశాఖ వన్ టౌన్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలంలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.  విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ  ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu