వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం!
posted on Dec 6, 2025 3:30PM

వారసత్వ ఆస్తులు, ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళతరం, సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇకపై ఈ రిజిస్ట్రేషన్లు గ్రామ, వార్డు సెక్రటేరియెట్లలో నే చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.
భూయజమాని మరణం తర్వాత కుటుంబసభ్యులు ఆ ఆస్తులను తమ పేర్లపై బదలాయించుకోవడానికి రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవ్వడమే కాకుండా, డాక్యుమెంట్లు.. ఫ్యామిలీ సర్టిఫికెట్ల సమస్యలతో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఈ కారణంగా భూవివాదాలు పెచ్చరిల్లు తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
ఈ కొత్త విధానంలో డెత్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు, ఆధార్, ఆస్తి డాక్యుమెంట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ సమర్పిస్తే.. డిజిటల్ అసిస్టెంట్ వాటిని వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక మ్యూటేషన్ కూడా ఆటోమేటిగ్గా అయిపోయి, పాస్ బుక్ జారీ అవుతుంది. వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మ్యూటేషన్ ఆటోమేటిక్‌గా జరిగి, ఈ-పాస్‌బుక్ జారీ అవుతుంది. గతంలో అయితే.. వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎమ్మార్వో లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది, అక్కడ ప్లెయిన్ పేపర్‌లో వివరాలు సమర్పించి కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ కొత్త సరళీకరించిన విధానంతో స్థానిక సెక్రటేరియట్లలోనే ఈ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది.