ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్
posted on Dec 6, 2025 3:02PM

ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. రద్దు చేసిన విమాన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని సూచించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ నియంత్రణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఫ్లైట్స్ రద్దు కారణంగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 405 డొమెస్టిక్ విమానాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం, రద్దయిన విమానాల ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.
అంతేకాకుండా, ప్రయాణికులకు దూరమైన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి, వారి నివాసానికి లేదా వారు కోరుకున్న చిరునామాకు చేర్చాలని ఆదేశించింది. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి, రిఫండ్‌ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కేంద్రాలు బాధితులైన ప్రయాణికులను స్వయంగా సంప్రదించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా రిఫండ్‌లు అందేలా చూడాలని తెలిపింది.
మరోవైపు ఇండిగో సంక్షోభాన్ని కొన్ని విమాన సంస్థలు సోమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. ఇంటర్‌నేషనల్ సర్వీసుల కంటే నేషనల్ సర్వీసుల ధరలు రెట్టింపు అయ్యాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విమాన సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచడాన్ని కేంద్రం తప్పుబట్టింది. విమాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.