సెల్ ఫోన్లలో లైవ్ లొకేషన్ ట్రాకింగ్.. కేంద్రం యోచన
posted on Dec 6, 2025 2:01PM

నిరసనలూ, వ్యతిరేకతలను ఇసుమంతైనా పట్టించుకోకుండా అన్ని మొబైల్ ఫోన్లలోనూసైబర్ సెక్యూరిటీ అప్లికేషన్ ‘సంచార్ సాథి’ని అమలు చేయాలన్న భావనకే కేంద్రం కట్టుబడి ఉంది. గతంలో వ్యతిరేకతకు వెరసి దానిని ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం దేశ వ్యాప్తంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఆన్ లైన్ లొకేషన్ ట్రాకింగ్‌ను అమలు చేసే అంశాన్ని కేంద్రం చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది. వాస్తవానికి గోప్యతా సమస్యల కారణంగా దీనికి ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కేసుల దర్యాప్తు కోసం టెలికాం సంస్థలు చట్టపరంగాకోరిన సందర్భాలలో ఖచ్చితమైన లొకేషన్‌లను పొందగలిగేలా స్మార్ట్ ఫోన్ లలో లోకేషన్ ట్రాకింగ్ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే దిశగా అడుగులు వేస్తున్నదని సమాచారం.
ప్రస్తుతం, టెలికాం ఆపరేటర్లు సెల్యులార్ టవర్ డేటా ద్వారా సుమారు లొకేషన్ ను మాత్రమే అందించే అవకాశం ఉంది. ఇలా చేయడం వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే కాకుండా సున్నితమైన రంగాలకు హాని చేకూరే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని మొబైల్ వినియోగదారులు కూడా ఇష్టపడరని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయంపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించతలపెట్టిన సమావేశం వాయిదా పడింది. అయితే ఆన్ లైన్ లైవ్ ట్రాకింగ్ విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.