జైల్లో దస్తగిరికి బెదరింపుల కేసు.. అధికారులపై విచారణకు ఆదేశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన  దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి అప్పుడు కడప జైలు అధికారులుగా ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నాటి సూపరింటెండెంట్ ఐఎన్‌హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.జవహర్‌బాబు, డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం (నవంబర్ 21) ఉత్తర్వులు  జారీ చేశారు.  విచారణాధికారిగా కోస్తాంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ   రవికిరణ్‌ను,  రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించారు. విచారణ పూర్తి చేసి మూడు నెలలలోగా  నివేదిక సమర్పించాలని వారిని ఆదేశించారు.

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, మరో కేసులో భాగంగా 2023 అక్టోబరు 31న కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబరు 28న జైలులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ముసుగులో వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించారు. ఈ సమయంలోనే చైతన్యరెడ్డి  దస్తగిరిని బెదిరించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది.  ప్రస్తుతం ఐఎన్‌హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో, జవహర్‌బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డాక్టర్ పుష్పలత కడప జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu