విశాఖకు కాగ్నిజెంట్.. ఊహించిన దానికంటే ముందుగానే!
posted on Nov 22, 2025 8:28AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కృతిని పూర్తిగా వంటబట్టించుకుంది. అయితే ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వాయువేగంతో ముందుకు సాగుతోందని మరోసారి నిర్ద్వంద్వంగా రుజువైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు ఏదైనా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే.. వారి కంపెనీ కార్యకలాపలను వెంటనే ప్రారంభించేందుకు ప్రోత్సాహకాలు, అనుమతులు వంటివి అనూహ్య స్పీడ్ తో అందిస్తామని విస్పష్టంగా చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నారు.
విశాఖలో భారీ పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాగ్నిజెంట్ ఊహించిన దాని కంటే చాలా ముందుగానే రాష్ట్రంలో తన కార్యకలాపాలు ప్రారంభించడం చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ అన్న మాటను చేతల్లో చూపిస్తున్నదని స్పష్టంగా అవగతమౌతుంది
కాగ్నిజెంట్ విశాఖ సమీపంలోని కాపులుప్పాడలోని 21 ఎకరాల భూమిలో మెగా నిర్మాణాన్ని మొదట పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున, కాగ్నిజెంట్ వచ్చే ఏడాది రెండవ త్రైమాసికం అంటే 2026 ఏప్రిల్ తురువాత వైజాగ్ లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా వచ్చే ఏడాది జనవరి నాటితే తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందుకోసం తాత్కాలిక డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వమే స్వయంగా ఇనీషియేటివ్ తీసుకుంటే.. పెట్టుబడిదారులు అంతకు మించి చొరవ, ఉత్సాహం చూపిస్తారు. కాగ్నిజెంట్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.
కాగ్నిజెంట్ శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వేచిచూడకుండా.. ముందుగా తాత్కాలిక భవనాల్లో కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఐటీ హిల్స్ లో భవనాలను అద్దెకు తీసుకోడానికి రెడీ అయ్యింది. ఇందు కోసం తమకు అనువైన భవనాల ఎంపికకు కాగ్నిజెంట్ బృందం విశాఖకు చేరుకుంది కూడా. అంతే కాదు.. జనవరి నుంచి 800 మందితో విశాఖలో ఆపరేషన్స్ కి కాగ్నిజెంట్ సమాయత్తం అవుతోంది. విశాఖలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలంటూ.. ఇప్పటికే తమ సిబ్బందికి సమాచారం ఇచ్చింది కూడా.
విశాఖలో 1,583 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ప్రభుత్వానికి తెలిపింది. దీంతో రాష్ట్రంలో యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడంతోపాటు పరోక్షంగా మరి వేల కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాగ్నిజెంట్ కు భూములు కేటాయించింది. ఆ భూముల్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. అయితే అంతకు ముందే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ ముందుకు రావడం చూస్తుంటే ఇన్వెస్టర్లకు రాష్ట్రప్రభుత్వంపై ఎంత విశ్వాసం ఉందో అర్థమౌతోంది.