కుప్పంలో నారా భువనేశ్వరి ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సాధారణ ప్రయాణీకు రాలిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అందులోనూ రాష్ట్రంలో మహిళలకు ఉచిత  ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తిపేర ప్రవేశ పెట్టిన పథకం కింద ఆమె ఆర్టీసీ బస్సులో తన ఆధార్ కార్డు చూపి ఉచితంగా ప్రయాణించారు. కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి  శాంతిపురం  నుంచి తుమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు శుక్రవారం (నవంబర్ 21) ఆర్టీసీ బస్సు ఎక్కి మిగిలిన మహిళలతో పాటుగా తన ఆధార్ కార్డును  కండక్టర్ కు చూపి ఉచిత టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె  సహచర ప్రయాణీకులతో ముచ్చటించారు.  ఉచిత బస్సు పథకం ఎలా ఉందని ఆరా తీశారు.  ఈ పథకం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే అదే సమయంలో వారు చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా ఆలకించారు.  జలహారతిలో  పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భువనేశ్వరి అభివర్ణించారు.  కుప్పం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎంతో శ్రమించి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చారన్నారు.  

కేవలం నీటిపారుదలకే పరిమితం కాకుండా కుప్పం పారిశ్రామిక ప్రగతికి కూడా చంద్రబాబు బాటలు వేశారన్న భువనేశ్వరి,  ఈ ప్రాంతానికి  23,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను తీసుకోచ్చారని వివరించారు.  పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుకు కుప్పం ప్రజల ఆశీస్సులు   ఎల్లప్పుడూ ఉండాలని   ఆకాంక్షించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu