డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం
posted on Sep 29, 2025 7:38PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ సినిమా పరిశ్రమను కాపాడే లక్ష్యంతో విదేశాలలో నిర్మించే అన్ని మూవీలపై100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. హాలీవుడ్ ఇండస్ట్రీ నశించిపోతుందని ఇతర దేశాల ప్రోత్సాహకాల కారణంగా అమెరికాలో షూటింగ్‌లు తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ సుంకం విధింపుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిస్తుంది. చిన్నారుల వద్ద నుంచి క్యాండీని లాక్కున్నట్లు.. అమెరికా చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు చేజిక్కించుకున్నాయని ఆరోపించారు. భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో హాలీవుడ్ సినిమా, టెలివిజన్ నిర్మాణం యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. కారణం – అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్న భారీ పన్ను సబ్సిడీలు. దీంతో ఆ దేశాల్లో షూటింగ్ ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు ఇతర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుండగా, ఈ పరిణామాల నడుమ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాకు సినిమా రంగం విస్తరిస్తున్న వేళ, అమెరికాలో కూడా భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాలు, పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగు సినీ పరిశ్రమపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇప్పటికే భారత ఎగుమతులపై 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.