సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా.. పోలీసులపై చంద్రబాబు ఫైర్
posted on Dec 3, 2025 3:11PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం ప్రజలలో ఉంటారు. ప్రజలకూ తనకూ మధ్య బారికేడ్లు అనవసరమని భావించడమే కాదు.. ఆ దిశగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలని చెబుతుంటారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జనానికి తనకూ మధ్య పరదాలు కట్టించుకుని వారికి కనిపించకుండా ముఖంచాటేసి తిరిగారు. అయితే తాను అందుకు పూర్తిగా భిన్నమని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.
తన పర్యటన సందర్భంగా పరదాలు, బారికేడ్లు వంటికి ఉండటానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. పోలీసులు కూడా ఆయన అభిమతానికి తగినట్లేనడుచుకున్నారు. పించన్ల పంపిణీకి ఆయన గ్రామాలకు వెళ్లిన సందర్భాలలో పోలీసుల ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని చంద్రబాబు ప్రశంసలు కూడా కురిపించారు. అయితే.. పోలీసుల తీరు పూర్తిగా మారలేదని ఆయన తాజాగా గమనించారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఆయన ప్రయాణించే సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిపైకి వాహనాలు రాకుండా అడ్డుకోవడాన్నిఆయన గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపించి అక్కడికక్కడే పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా? లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయానికి వెళ్లే దారిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను వెంటనే తొలగించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత ఆర్టీజీఎస్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ కూడా బారికేడ్ల విషయాన్ని ప్రస్తావించారు. స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తే చాలన్నారు. రోడ్లను మూసేస్తూ బారికేడ్లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు.