పాతబస్తీలో మృతదేహాలు కలకలం
posted on Dec 3, 2025 2:52PM

హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధిలోని ఒక ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఆటోలో రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆటో పార్క్ చేసి ఉండగా, అందులో ఇద్దరు యువకులు ప్రాణం లేకుండా కనిపించడంతో స్థానికులు భయపడుతూ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరీక్షిస్తున్న సమయంలో ఆటోలో మత్తు ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్‌కు సంబంధించిన కొన్ని శాంపిల్స్ కనిపించాయి. పోలీసులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. యువకులు మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తు న్నారు. ఓవర్‌డోస్ కారణంగానే మరణించి ఉండవచ్చన్న ప్రాథమిక అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
అయితే, ఇది హత్యలా? లేక యువకులే మత్తు పదార్థాలు తీసుకుని ప్రాణాలు కోల్పోయారా? అన్న దానిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ యువకులు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరణానికి గల కారణం వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత, భయం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.