తెలుగుపై "చంద్ర" దృష్టి
posted on Sep 15, 2016 @ 4:49PM
కుటుంబంతోనో..స్నేహితులతోనో ఏ బేగంబజారుకో, ఏ బీసెంట్‌రోడ్డుకో షాపింగ్‌కు వెళ్లినపుడు షాపుల వైపో..మాల్స్ వైపో ఓ లుక్కేస్తే వాటి పేర్లు ఇంగ్లీష్‌లోనే కనిపిస్తాయి. తెలుగునేలపై ..తెలుగు ఖాతాదారులతో..తెలుగులోనే మాట్లాడుతూ ఇలా దుకాణాల పేర్లు మాత్రం ఇంగ్లీష్‌లో పెట్టడమేంటిరా బాబూ అని అనుకోని తెలుగువాడు ఉండడు. కానీ ఏం చేస్తాం..మన ప్రభుత్వాలు పట్టించుకోవు, మన నేతాశ్రీలకు అసలు అవసరమే లేదు. అందుకే అమ్మభాషకు ఇంతటి దుర్గతి. కానీ ఇకపై ఈ ఆటలు ఏపీలో కుదరవు. తెలుగుభాషను బతికించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో ఏర్పాటు చేసే శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులో మాత్రమే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు..దుకాణాల పేర్లు కూడా తెలుగులోనే ఉండాలని, వీటి విషయంలో యజమానులు శ్రద్ద తీసుకోవాలని ఏపీ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం 1988 ప్రకారం దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థల బోర్డులు, నామఫలకాలు తెలుగులోనే ఉండాలి. దీనిని అతిక్రమించిన వారిపై జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. అప్పట్లో కొన్నాళ్లు ఈ చట్టం కఠినంగా అమలు జరిగినా ఆ తర్వాత దీనిని ప్రజలు పట్టించుకోలేదు..ప్రభుత్వం అంతకన్నా.? జనం సంగతి పక్కన బెడితే అధికారులు తీరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జనమంతా తెలుగులోనే మాట్లాడాలంటారు. తెలుగులోనే రాయాలంటారు. తెలుగుకు మించిన భాషే లేదంటారు. కాని - వారు మాత్రం తెలుగులో రాయరు. తెలుగులో మాట్లాడరు. అసలు సర్కార్ ఉత్తర్వులనే పట్టించుకోరు. అధికార భాష అమలు బాధ్యతంతా జనంపైనే పెట్టిన అధికారులు తమ భాషను మాత్రం మార్చుకోలేకపోతున్నారు.
అధికారభాష అయిన తెలుగుకి ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. రాష్ట్ర అధికార భాషాసంఘం అంటే ఉత్తర ప్రత్యుత్తరా లు, సర్క్యూలర్‌లు, జి.ఓ.లు సైతం తెలుగులోకే వెలురించాలని అన్ని ప్రభుత్వశాఖలకి విజ్ఞప్తి చేస్తున్నాగాని అమలు సక్రమంగా జరగటం లేదు. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వశాఖలన్నింటికి కంప్యూటర్లు సరఫరా చేశారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించలేదు. అనేక కార్యాలయాలలో కంప్యూటర్లు ఉన్నాగాని తెలుగు సాప్ట్‌వేర్ లేదు. మనతో పోలిస్తే తమిళులు, కన్నడిగులకు వారి భాష ప్రాణప్రదం. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఆయా భాషల్లోనే పేర్లు ఉంటాయి. వారిలో వారికి పరస్పర అభిప్రాయ భేదాలున్నా భాషా సంస్కృతుల విషయంలో వారంతా ఏకమై ఇతరులపై తిరగబడతారు.
తెలుగుతో సహా కన్నడ, మళయాళ, ఒరియా భాషలకు ప్రాచీన భాష హోదా ఇవ్వడంపై తమిళనాడులోని కొందరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుధీర్ఘ విచారణ అనంతరం మద్రాస్ హైకోర్టు తుదితీర్పును ఇచ్చింది. తెలుగు, కన్నడ, మళయాళ, ఒరియా భాషలకు వాటి అర్హతల ఆధారంగానే ఆ హోదా లభించిందని పిటిషన్ కొట్టివేసింది. ఈ తీర్పుపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేసినా మాతృభాషకు జరిగిన అవమానాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు..దీనిపై వారు తీవ్ర అగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయటం స్పష్టంగా కనిపించింది. తాజాగా అలాంటి విమర్శలకు, నిరసనలకు తాను మినహాయంపు ఇవ్వాలని భావించిన సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన నిర్ణయం ఫలితంగా తెలుగు భాష అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్ని జీవోలు జారీ చేసినా మరేంతగా ఒత్తిడి తెచ్చినా..కేవలం ప్రభుత్వం సహకారం వల్లే భాషాసాహిత్యం ప్రోత్సహించడం సాధ్యం కాదు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉంది.