చైనా పక్కలో భారత్ బల్లెం.. వియత్నాం!
posted on Sep 2, 2016 @ 11:36AM
మన దేశంలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే వుంటాడని విమర్శకులు ఎంతగా వెటకారం చేసినా పట్టించుకోని మోదీ మరోసారి ఫారిన్ టూర్ మొదలెట్టారు. ఈ సారి ఎక్కడికి బయలుదేరారు? చైనా, వియత్నాం దేశాలకు! నిజానికి చైనా, వియత్నాం పాకిస్తాన్, ఇండియా లాంటి దేశాలు! వాటికి ఒకరంటే ఒకరికి పడదు! కాని, ఆ రెండు దేశాలూ ఒకేసారి చుట్టి వచ్చే సంకల్పంతో మన ప్రధాని బయలుదేరారు!
మోదీ చైనా పర్యటన ద్వైపాక్షికం కాదు. జీ 20 సభ్య దేశాల సమావేశానికి ఆయన అటెండ్ అవుతారు. అక్కడ ఇండియాకి సంబంధించిన అనేక అంతర్జాతీయ అంశాల్ని లేవనెత్తే అవకాశం వుంది. కాని, ఈ పర్యటనలో అందరి దృష్టీ ఆకర్షిస్తోంది మాత్రం వియత్నాం పర్యటన. కేవలం ఒక్క రోజు మాత్రమే మోదీ వియత్నాంలో ఆగుతారు. అంతలోనే బిజీ బిజీగా మీటింగ్లు వుంటాయి!
ఇండియన్స్ కి వియత్నాం గురించి నిజంగా పెద్దగా తెలియదనే చెప్పాలి! అంతే కాదు, వాజ్ పేయి సర్కార్ అధికారంలోకి వచ్చే దాకా మన దేశం వియత్నాంని ఏమంత పెద్దగా పట్టించుకున్నది కూడా లేదు. కాని, చైనాతో వియత్నాంకు వున్న శత్రుత్వం కారణంగా మెల్లగా భారత్ ఆ దేశానికి దగ్గరవుతూ వచ్చింది. ఎలాగైతే భారత్ శత్రువైన పాక్ తో చైనా అంటకాగుతుందో... అదే విధంగా చైనాకు చెమటలు పట్టించేందుకు ఇండియా వియత్నాంకు దగ్గరవుతోంది. ఇది డిప్లొమాటిక్ వార్ ల చాలా అవసరం కూడా. అయితే, ఇప్పటికే లేట్ అయిపోయిన ఈ కోణంపై మోదీ సహజంగానే దృష్టి సారించారు...
అంతర్జాతీయ స్తాయిలో భారత్ సత్తాను పెంచే దిశగా కృషి చేస్తున్న మోదీ వియత్నాంను కూడా అందుకే ఎంచుకున్నారు. చైనాను ఢికొట్టే పనిలో ఆయన వియత్నాం పర్యటనకు సిద్ధపడ్డారు. అంతే కాదు, ఇప్పటికే వియత్నాంతో మన విదేశాంగ శాఖ చాలా ఒప్పందాలు చేసుకుంటూ సాగిపోతోంది. వాటిలో రక్షణ పరమైన సామాగ్రి అమ్మకాలు కూడా వున్నాయి. ఇండియా సృష్టించిన బ్రహ్మాస్త్రాం బ్రహ్మోస్ ను కొనేందుకు కూడా వియత్నాం సిద్ధంగా వుంది. అయితే, బ్రహ్మోస్ అమ్మకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. వియత్నాం వద్దకు బ్రహ్మోస్ చేరితే అది చైనాకు తీవ్రమైన ఆందోళనే...
చైనా, వియత్నాం గొడవంతా దక్షిణ చైనా సముద్రం విషయంలోనే వుంది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ తనదంటూ దౌర్జన్యం చేసే చైనా చాలా చిన్న దేశమైన వియత్నాంను కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తోంది. సముద్రంలోని కొన్ని దీవులు వియత్నాంకు చెందినవి అయినప్పటికీ చైనా తన సైనిక స్థావరాలుగా వాడేసుకుంటుంది. ఇలాంటి సరిహద్దు సమస్యలతో సతమతం అవుతోన్న వియత్నాం ఆసియాలో రెండో సూపర్ పవర్ అయిన ఇండియా మద్దతు చాలా తీవ్రంగా ఆశిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమే మోదీ తాజా పర్యటన కూడా!
శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు కాబట్టి... వియత్నాంతో వియ్యం ఆహ్వానించదగ్గ పరిణామమే. చైనా నిలువరించటమే కాకుండా భారత్ ఆర్దిక కోణంలో కూడా వియత్నాంలో పెట్టుబడులు పెట్టి లాభపడితే అది మరింత మేలు చేస్తుంది!