హైదరాబాద్ నీళ్లపాలు
posted on Sep 17, 2016 @ 10:17AM
ఎక్కడైనా వరదలొస్తేనో, తుపానులు చెలరేగితేనో బీభత్సం చెలరేగుతుంది. కానీ అదేం విచిత్రమో కానీ హైదరాబాదులో మాత్రం ఓ అయిదు సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు జీవితం తల్లికిందులైపోతుంది. ఆ మూల కూకట్‌పల్లి నుంచి ఈ మూల ఉన్న హయత్‌నగర్ వరకూ ఊరు ఊరంతా సముద్రంగా మారిపోతుంది. ఒక్క కిలోమీటరు దూరం కదలడానికి గంట పడుతుంది. ఈ దారుణం ప్రతిసారీ ఉండేదే... కానీ కారణాలకు నివారణ మాత్రమే కనిపించడం లేదు!
అస్తవ్యస్తమైన రోడ్ల నిర్వహణ
మన కేటీఆర్‌గారు అర్ధరాత్రులు అధికారులను ఊళ్లో తిప్పి, గుంతలన్నీ చూపించి ఎన్ని క్లాసులు పీకినా... రోడ్ల పరిస్థితి నానాటికీ తీసిబొట్టుగానే మిగిలిపోతోందనేది వాస్తవం. పాత సినిమాల్లోని రాక్షసుడిలాగా ఒకచోట మాయమైతే పదిచోట్ల కనిపిస్తూ ఉంటాయి ఈ గుంతలు. నిరంతరం లక్షల మంది తిరిగే రోడ్లని ఇంత లక్షణంగా ఎందుకు నిర్మిస్తున్నారన్నది అసలైన ప్రశ్న. కాబట్టి అసలు సమస్య నిర్మాణంలోనే ఉంది. అలా నిర్మించిన రోడ్లకి ఎన్ని బ్యాండెయిడ్లు వేసినా ఉపయోగం లేకుండా పోతోంది. దశాబ్దాల గడుస్తున్నా కూడా ఇంకా విద్యుత్, డ్రైనేజి, టెలిఫోన్ వంటి శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో తలా ఓ పలుగూ పారా తీసుకుని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఫలితం మనుషులు రోడ్ల మీద కాకుండా గుంతలగుండా ప్రయాణించాల్సి వస్తోంది.
అదిగో మెట్రో
వేల కోట్లతో, వందల కిలోమీటర్ల చుట్టుకొలతతో... లక్షలాదిమంది ప్రయాణికులకు సేవలందిస్తమంటూ ఊరించింది హైదరాబాదు మెట్రో సంస్థ. అసలే అస్తవ్యస్తంగా ఉండే నగరాన్ని పొడిపొడి చేసిపారేసింది. ఇంకేముంది ఓ రెండేళ్లు ఓపికపడితే చాలు, జీవితాంతం సుఖపడిపోదామనుకున్నారు నగరవాసులు. కానీ మరో రెండేళ్లు గడిచినా కూడా ఈ నిర్మాణాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. స్థల సమీకరణ, రాజకీయ జోక్యం వంటి కారణాలతో సుల్తాన్‌బజారు వంటి కొన్న ప్రాంతాలలో అయితే ఇంకా మెట్రో అడుగే ముందుకు పడటం లేదు. కానీ మెట్రో నిర్మాణం వల్ల నగర ప్రజలు పడుతున్న ఇబ్బందలు అన్నీఇన్నీ కావు. ఎడాపెడా తవ్విపారేసిన రోడ్లలో నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లోని డ్రైనేజీ తీరు అస్తవ్యస్తంగా మారిపోయింది. మధ్యలోంచి మెట్రో సాగడంతో చిక్కిసగమైపోయిన రోడ్ల మీద ట్రాఫిక్ నరకప్రాయంగా సాగుతోంది. వెరసి మెట్రో కూత సంగతేమో కానీ, మన బతుకు మాత్రం మోతెక్కిపోయింది.
అడ్డదిడ్డమైన విస్తరణ
హైదరాబాద్ ఒకప్పుడు ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం. నాలుగువందల సంవత్సరాల ఘన చరిత్ర దీని సొంతం. కానీ అభివృద్ధితో పాటే అడ్డగోలుతనమూ పెరిగిపోయింది. చెరువులు మొదలుకొని రహదారుల వరకూ ప్రతి ఉమ్మడి సొత్తునీ కబ్జా చేసిపారేశారు. ఇక నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా ఏర్పడిన కట్టడాల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం వీటన్నింటినీ చట్టబద్ధం చేయడం మరో విచిత్రం. వెరసి నగరంలో పడ్డ నీటి చుక్క బయటకు పోయే పరిస్థితి లేదు. ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ వంటి పథకాలు హైదరాబాదుకు తప్ప తెలంగాణ మొత్తానికీ వర్తిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక నగర శివార్లలో ఇప్పటికీ డ్రైనేజీ సదుపాయాలు లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఆటవికుడికైనా ఆధునికజీవికైనా నీరే జీవనాధారం. ఈ నీటిని వీలైనంతగా ఒడిసిపోట్టుకోవాల్సింది పోయి, అదే నీటిలో ఈతకొట్టాల్సిన పరిస్థితి రావడం ఎంత బాధాకరం. ఈ మాత్రం సాధించలేని నగరం ‘స్మార్ట్ సిటీ’ అన్న పేరు ఎలా నిలుపుకోగలుగుతుంది. ఇలాంటప్పుడు కేటీఆర్ ఏమన్నా మాట్లాడితే సంతోషం! ఏదన్నా ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటిస్తే మరీ సంతోషం!