గాయాన్ని గుర్తుచేస్తుందా..? చల్లారుస్తుందా..?
posted on Sep 14, 2016 @ 8:32PM
సినిమా..రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల మనుసుల్ని సేదతీర్చే ఒక సమ్మోహనం. ఎన్నో ఒత్తిడిల మధ్య సతమతమయ్యే మనిషికి కాసేపు విశ్రాంతినిచ్చే సాధనం. భారతీయ సినిమా తన ప్రయాణంలో ఎన్నో లక్షల కథలను ఇప్పటికే ప్రేక్షకులకు వండి వర్చింది. చేసేందుకు కొత్తగా ఏమీ లేకపోవడంతో నిజ జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు భారతీయ సినీ ప్రముఖులు. వాటిలో భాగంగానే ఒక మేరీకోమ్, భాగ్ మిల్కా భాగ్ ఈ కోవలో ఎన్నో..మరెన్నో వస్తూనే ఉన్నాయి. కేవలం వ్యక్తుల కథలే కాదు..దేశాన్ని మలుపు తిప్పిన ఉదంతాలు భారతదేశ చరిత్రలో కోకొల్లలు..వాటిని వదల్లేదు మన దర్శకులు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి కోణంగా చెప్పుకునే పంజాబ్‌లోని ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం, ఆపరేషన్ బ్లూస్టార్ గురించి మనలో ఎంతమందికి తెలుసు.
సిక్కులకు ప్రత్యేక దేశమే లక్ష్యంగా జర్నాల్‌సింగ్ బింద్రన్ వాలే లేపిన ఉద్యమమే ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం. ఈ ఉద్యమం శాంతియుత పద్ధతుల్లో కాకుండా హింసాత్మకంగా మారడంతో ప్రతిరోజూ వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని ఆక్రమించిన ఉద్యమకారులు ప్రజలను బంధించారు. దీనిపై ఆగ్రహించిన నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఉగ్రవాదులను ఏరివేరేసేందుకు సైనిక చర్యకు ఆదేశించారు. ఇది ఆపరేషన్ బ్లూస్టార్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో పాటు వేలాది మంది ప్రజలు మరణించగా..అనంతరం జరిగిన అల్లర్లలో మరిన్ని వేల మంది ప్రాణాలు విడిచారు. నాటికి..నేటికి..ఏనాటికి దేశాన్ని నీడలా వెంటాడుతున్న ఈ నెత్తుటి చరిత్ర నేపథ్యంతో తాజాగా విడుదలైన ఒక సినిమా ఆ తరం వారికి ఆ నాటి గుర్తులను, నేటీ తరం వారికి చరిత్రను అందిస్తోంది.
ఆ సినిమా చౌథీ కూత్... రెండే రెండు గంటల నిడివి ఉన్న చిన్న పంజాబీ సినిమా. పేరున్న ఆర్టిస్గులెవ్వరూ లేని సినిమా. ఆ సినిమా తీసిని దర్శకుడు గుర్విందర్ సింగ్‌కు కేవలం రెండో సినిమా. కానీ ఇప్పుడు ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీ రచయిత వర్యమ్‌సింగ్ సంధు రాసిన చౌథీ కూత్, హో మై ఠీక్-ఠాక్ హా కథల ఆధారంగా అల్లుకున్న స్క్రిప్ట్-ఈ సినిమా. ఇటు ఖలిస్తానీ తీవ్రవాదులకూ, అటు భద్రతా దళాలకూ మధ్య పంజాబ్ ప్రజలు చిక్కుకుపోయిన పరిస్ధితుల్ని ఈ చౌథీకూత్ చిత్రం ద్వారా ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చారు. అయితే, సినిమాలో ఎక్కడా తెర మీద ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించదు.
దేహాన్ని ఛిద్రం చేసే బుల్లెట్లు కనిపించవు. ఉపన్యాసాలు, అరుపులు, కేకలుండవు. కానీ పరిస్థితి మొత్తం మనకు అర్థమయ్యేలా చేస్తాడు దర్శకుడు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడిప్పడే దేశప్రజలు ముఖ్యంగా పంజాబ్ ప్రజలు నాటి చీకటి గాయాన్నిమరచిపోతున్న సమయంలో ఈ సినిమా పంజాబ్‌తో తిరిగి ఉద్రేకాలను రేపుతుందేమోనని కాస్త ఆందోళన నెలకొంది. ఎందుకంటే కొన్ని సిక్కు రాడికల్ గ్రూపులు తాజాగా యాక్టివ్ అవుతుండటమే ఆ కాస్త ఆందోళనకు కారణం. మొత్తం మీద ఒక సామాజిక బాధ్యతగా సినిమాలు రూపొందించి మంచి విషయాలు, విలువలు నేటీ యువతకు అందించాలని భావించడం మంచి విషయం.