కాంగ్రెస్ చేసిందంటే..మీరు చేసినట్లు కాదా..?
posted on Sep 16, 2016 @ 4:56PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే..కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్‌లో ఉంటే తమ గతి అధోగతి అని భావించిన ఏపీ కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు అంతా మూకుమ్మడిగా తలో ఒక పార్టీలో చేరిపోయారు. చాలా మంది టీడీపీ అధికారంలోకి రాగానే దానిలోకి జంప్ అయ్యారు. తెలుగుదేశంలో బెర్త్ దొరకని వారు బీజేపీలో చేరిపోయారు. అలా చేరిన వారిలో పురందేశ్వరి, కావూరి ఉన్నారు. వీరు బీజేపీలోకి వెళ్లారు గానీ అక్కడ వీరిని పట్టించుకునే వారే లేరు. అయినా కమలంలోనే కొనసాగుతూ తమ వంతు వచ్చినపుడు మీడియాలో మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. పురేందేశ్వరి ప్రత్యేకహోదాపై ఆడపాదడపా మాట్లాడుతున్నారు, కానీ పాపం కావూరికి ఏ ఛాన్స్ రావడం లేదు. పార్టీలో చేరి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా..తగిన ప్రాధాన్యం లేదని బాధపడుతున్న కావూరికి ఈ మధ్య బీజేపీ ఫుల్ ప్రయారిటీ ఇస్తోంది.
ఆయన తరచూ మీడియా ముందుకు వస్తూ కాంగ్రెస్ పార్టీని ఏకీపారేస్తున్నారు. విభజన పాపం కాంగ్రెస్‌దే..జరగుతున్న అనర్థాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీలో చేరిన కొత్తల్లో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో మండిపడిన కావూరికి సడెన్‌గా కాంగ్రెస్ ఎందుకు గుర్తుకొచ్చింది. విభజన పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగం ఉందో..బీజేపీకి అంతే భాగముంది..ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ వైఖరి ఏపీ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి, విభజన పాపం కాంగ్రెస్‌దేనని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా హోదా అంశాన్ని అటకెక్కించాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. అందుకే వేరే ఎవరితోనో కాంగ్రెస్‌పై విమర్శలు చేయిస్తే బాగుండదని విభజన సమయంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన కావూరిని అందుకు ఎంపిక చేసినట్లున్నారు. కావూరి కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా కాంగ్రెస్‌పై బాగానే విమర్శలు చేస్తున్నారు.
కావూరి కానీ పురంధేశ్వరి కానీ మరొ కాంగ్రెస్ నేతకానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టడానికి సోనియా ప్రయత్నాలు చేస్తున్నపుడు నోరు మెదపని వీరు ఇవాళ కాంగ్రెస్‌ని తెగ తిట్టేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌నూ, ఏపీలో జగన్ సపోర్ట్‌తోనూ తన కొడుకుని ప్రధానిగా చేయ్యడానికి సోనియా తెరలేపిన రాజకీయ క్రీడలో వీరంతా పాత్రలు పోషించారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడ్డుకున్న పాపాన పోలేదు. రాహుల్ కోసం విభజన చేశారని ఇప్పడు కావూరి గొంతు చించుకుంటున్నాడు. మరి ఈయన గారు కాంగ్రెస్ అధికారంలో ఉండగా కేంద్రమంత్రి పదవిని కూడా వెలగబెట్టాడు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కేంద్రంలో పదవులు అనుభవిస్తూ సోనియా ఏం చెబితే దానికి తలలూపి ఇప్పుడేమో అంతా సోనియా చేసింది అంటున్నారు. మరి ఇంత తెలిసిన వారు అప్పుడే విభజనకు అడ్డుపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అడ్డు చెబితే ఎక్కడ పదవులు ఊస్టింగ్ అవుతాయోనని మేడం ముందు తలలాడించారు. నేతలారా..మీరు ఇక్కడో లాజిక్ మిస్సాయ్యారు..కాంగ్రెస్ విభజించింది అంటే మీరు విభజించినట్లే..మీరు పార్టీ మరినంత మాత్రాన చేసిన పాపం ఉరికే పోదు. ఎవరు మరచిపోయినా...మర్చిపోకపోయినా ప్రజలకు అంతా గుర్తే. అప్పుడు చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి బీజేపీపై ఒత్తిడి తెచ్చి ఏపీ పరిస్థితిని చక్కదిద్దితే అదే చాలు.