పాపం పుణ్యం మోడీదేనా..?
posted on Sep 18, 2016 @ 3:27PM
పబ్లిసిటీ.. ఈ నాలుగు అక్షరాల కోసం మనిషి ఎంతదూరమైనా వెళతాడు..ఎంతైనా ఖర్చు పెడతాడు అనడానికి ప్రతిరోజు ఎన్నో ఉదాహరణలు. మామూలు మనుషుల దగ్గరి నుంచి వీవీఐపీల వరకు తాము అందరి దృష్టిలో పడాలని..అందరూ తమ గురించి మాట్లాడుకోవాలనే ఆశ కామన్. అయితే చెప్పింది చేస్తారు కొంతమంది..చేసేదే చెప్తారు మరికొంత మంది. చేసినా చేయకపోయినా చెప్పుకోవడం ముఖ్యమనుకుంటారు చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. కొత్త తరహా రాజకీయ పార్టీగా చెప్పుకొనే సామాన్యుడి పార్టీ అదేనండి మన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ తాను ముక్కే అని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకటనల కోసం ఆప్ సర్కార్ భారీగానే ఖర్చు చేస్తోంది.
తొలి ఏడాది మీడియా ప్రకటనల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయగా, గత ఏడాది అడ్వర్టయిజ్ మెంట్ల కోసం రూ.500 కోట్ల రూపాయలను ఏకంగా స్టేట్ బడ్జెట్‌లోనే కేటాయించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రకటనల్లో మెజారిటీ భాగమంతా ఢిల్లీ వెలుపల ఇచ్చిందే. దీనిపై దేశంలోని రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది. ఢిల్లీలో ఓ వైపు శానిటేషన్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ప్రకటనల కోసం ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోందని ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ అజయ్ మాకెన్ విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఈ ప్రకటనలపై ఆయన ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఆప్ ప్రకటనలపై కమిటీతో విచారణ జరపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీబీ.టాండన్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది కేంద్రం.
ఈ కమిటీ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటనల కోసం పెట్టిన ఖర్చు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన ఖర్చు ఉన్నట్టు తేలితే కేజ్రీవాల్ సర్కార్ ఆ డబ్బును తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై బీజేపీ ప్రభుత్వం కక్ష్య సాధిస్తూనే ఉందని దానిలో భాగంగానే ఈ కమిటీని నియమించిందని ఆప్ ఆరోపిస్తోంది. కేంద్రానికి సహకరించనందునే ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం కమిటిని నియమించింది తప్పితే పనిగట్టుకుని కావాలని చేసింది కాదు.
ఇదంతా చూస్తుంటే అసలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రాజ్యాంగమంటే ఎంటో తెలుసో లేదో అనిపిస్తుంది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో..పాలన ఎలా జరుగుతుందో అసలు తెలియదు..అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఢిల్లీ ప్రజలకు చేసిందేమి లేదు. అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రకటనల వర్షం కురిపిస్తోంది. సరే ఆ పబ్లిసిటీ ఢిల్లీ వరకే ఉండాలి కానీ దేశమంతా ప్రకటనలు ఎందుకు..? అంటే ఏం చేశారని ఈ సారి ఓట్లు పడతాయి..అసలు ఢిల్లీ ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతారు. అందుకే ఇక్కడ మిస్సయినా వేరే చోట బలం పుంజుకోవడానికే నార్త్, సౌత్ అని తేడా లేకుండా కోట్లు తగలేసి యాడ్స్ ఇచ్చారట. పార్టీలు ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు..దానికి పార్టీ నిధులు కాకుండా సర్కారీ నిధులను వాడాల్సిన పనేమొచ్చింది. ఇప్పుడు కేంద్రం నియమించిన కమిటీ ఈ నిజాలన్ని బయటకు తీస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆప్ పరువు యమునా నదిలో కలిసిపోతుంది. అందుకే కేంద్రప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోడీ పైనా విమర్శలు చేస్తోంది. అయిన దానికి కాని దానికి కేంద్రంపై పడి ఎడవటం తప్పితే అసలు ఏ విషయం ఎందుకు జరుగుతుందో ఆప్ అధినాయకత్వం ఆలోచిస్తే మంచిది.