మరోసారి కదనరంగంలోకి కేసీఆర్..

ఉద్యమ నాయకుడిగా వ్యూహ, ప్రతివ్యూహలతో, రాజీనామాస్త్రాలతో, దీక్షలతో ఎన్నటికి రాదు అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. మలిదశ తెలంగాణ ఉద్యమంతో రక్తపు బొట్టు చిందకుండా పోరాటాన్ని నడిపి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. అన్ని పార్టీలకు తెలంగాణ తప్ప వేరే ఎజెండా లేకుండా చేసి..ఆ హీట్‌ను ఢీల్లీకి తాకించారు కేసీఆర్. తన చిరకాల వాంఛ నెరవేరడంతో తనలోని ఉద్యమ నాయకుడికి రెస్ట్ ఇచ్చారు కేసీఆర్ .  నేడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఉద్యమ నాయకుడి అవతారాన్ని త్యజించి రాష్ట్రానికి అధినేతగా జనరంజక పాలన అందిస్తున్నారు.   ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరోసారి తనలోని ఉద్యమ నాయకుడిని నిద్రలేపాలనుకుంటున్నారు . జడ్జీల ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన మొదలుకొని జడ్జీల నియామకం వరకు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా..ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని భావిస్తున్న కేసీఆర్ దీనిపై పోరాటం చేయాలని అందుకోసం స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.   ఉభయ రాష్ట్రాలకు న్యాయాధికారులను కేటాయిస్తూ రూపొందించిన జాబితాను వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఆదివారం ఆందోళనకు దిగింది. గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు న్యాయాధికారులు పాదయాత్రగా వెళ్లడం, కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ అదనపు జిల్లా జడ్జీ హోదాలో ఉన్న ఇద్దరు న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటే వేసింది. మరోకరి డిప్యుటేషన్ రద్దు చేసింది. దీనిపై తెలంగాణ భగ్గుమంది..అన్ని క్యాడర్‌లలోని న్యాయాధికారులు ఇవాళ్టీ నుంచి మూకుమ్మడిగా సెలవులు పెట్టాలని నిర్ణయించారు.   సిటీ కోర్టు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తోటివారు అడ్డుకున్నారు.  అటు బదిలీపై వెళ్లనున్న తాత్కాలిక సీజేకు నిర్వహించే వీడ్కోలు కార్యక్రమానికి సైతం హాజరుకాకూడదని నిర్ణయించారు. వీరికి మద్థతుగా తెలంగాణ జ్యూడిషియల్ సిబ్బంది జూలై 1వ తేదిన సమ్మె చేపట్టాలని అందుకు ఇవాళ్టీ నుంచే పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు, మంత్రులతో మంతనాలు జరిపారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు, తెలంగాణ న్యాయాధికారులకు, ప్రజలకు న్యాయం జరిగేందుకు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తారు. చాలా రోజుల తర్వాత బయటకొస్తున్న ఈ ఉద్యమ నాయకుడు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో..?

న్యాయం రోడ్డెక్కింది..

ఏ సమస్య వచ్చినా న్యాయం కోసం తలుపు తట్టేది న్యాయస్థానాలనే..న్యాయ చెప్పమనేది న్యాయమూర్తులనే..మరి అలాంటి న్యాయమూర్తులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కితే. స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా తమ సమస్య పరిష్కారం కోరుతూ న్యాయమూర్తులు రోడ్డెక్కారు. గత నెల 3వ తేదిన ఉమ్మడి హైకోర్టు పూర్తి చేసింది. రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న న్యాయాధికారులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా జాబితాను రూపొందించింది. ఎటువంటి ఆప్షన్లు ఇవ్వని అధికారులకు సంబంధించి వారు విధుల్లో చేరినపుడు ఇచ్చిన ప్రాంతం ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది.   ఆ జాబితా వెలువడిన వెంటనే తెలంగాణ న్యాయాధికారులు దీనిని ఆక్షేపించారు. తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారుల సర్వీసు రికార్డులో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా కేటాయింపులు చేయాలని.. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రాథమిక జాబితా రూపొందిందని విమర్శించారు. గత నెలలోనే దీనిని ఉపసంహరించుకోవాలని హైకోర్టుకు నోటీసులు అందజేశారు. ఎన్నిసార్లు కోరినా హైకోర్టు తమ ఆవేదనను అర్థం చేసుకోకపోవడంతో తెలంగాణ న్యాయాధికారులు రాజీనామాస్త్రాలను సంధించారు. నిన్న 120 మంది న్యాయాధికారులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసి గన్‌పార్క్ నుంచి ర్యాలీగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు న్యాయాధికారులను అడ్డుకున్నారు.   చివరికి న్యాయాధికారుల ప్రతినిధులను గవర్నర్ వద్దకు పంపడంతో వారు శాంతించారు. తమ సమస్యలు..హైకోర్టు వైఖరి తదితర వివరాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రతినిధులు గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. న్యాయాధికారుల విభజనకు హైకోర్టు శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయంగా భావించి ఇన్నాళ్లకు దయ చూపినందుకు ఆనందపడ్డాం కానీ ప్రాధమిక జాబితా చూసిన తర్వాత హైకోర్టు మాపై సవతి తల్లి ప్రేమ చూపినట్టు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కేడర్లలో పోస్టులను ఖాళీగా ఉంచి, తెలంగాణలో మాత్రం ఖాళీలు లేకుండా చేశారు. ఏపీకి చెందిన యువ న్యాయాధికారులను ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణకు కేటాయించారు. తద్వారా ఎప్పటి నుంచో పదోన్నతి కోసం వేచి చూస్తున్న తెలంగాణ న్యాయాధికారుల అవకాశాలను ఘోరంగా దెబ్బతీశారు.   .రాజకీయంగా, పాలనాపరంగా తెలంగాణను సాధించుకున్నా..ఇప్పటికీ మేం ఏపీ హైకోర్టు కింద పనిచేస్తున్నామనే భావన కలుగుతుందే తప్ప..ఉమ్మడి హైకోర్టు కింద పనిచేస్తున్నామనిపించడం లేదనిపిస్తోంది. ఆంధ్రా పాలకుల కింద ఏ మాత్రం పనిచేయలేం. న్యాయాధికారులం కావడంతో మా మనస్సాక్షికి విరుద్థంగా మౌనంగా ఉంటూ వస్తున్నాం. ఇక మౌనంగా ఉండటం మా వల్ల కాదు. మా రాజీనామాలు పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలిగించకుంటే..హైకోర్టు ప్రాంగణంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు వదిలేందుకు కూడా సిద్ధం. అంటూ వారి అధ్యక్షుడికి లేఖ రాశారు. 

బాదుడే బాదుడు!

  ఈ వేసవిలో ఎంతమందికి వడదెబ్బ తగిలిందో కానీ... వేసవి ముగిసిన తరువాత ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలతో దిమ్మ తిరిగిపోతోంది. బంగారు తెలంగాణలో ఈ బాదుడు పర్వమేమిటా అంటూ మనసు చిన్నబోతోంది. మొన్నటికి మొన్న ‘ఆర్టీసీ లాభాల బాటను పట్టకపోతే మూసేస్తాం’ అంటూ ముఖ్యమంత్రి చేసిన బెదిరింపు వల్లనో ఏమో... ఆర్టీసీ ఛార్జీలను పెంచిపారేశారు. ఈ విధానం కనుక అమలులోకి వస్తే సిటీ బస్సులలో ప్రయాణించేవారు సైతం ఓ పది శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బతుకు తెరువు కొంత బస్టాండులోనే వదిలిపోనుంది.   ఇక విద్యుత్తుశాఖ కూడా, బిల్లు చూడగానే షాక్‌ కొట్టే ఓ కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. వంద యూనిట్ల దాటిన వారి జేబులు చిల్లులు పడిపోవాల్సిందే. ఇక మీదట ఎండాకాలంలో ఏసీనో, చలికాలంలో గీజరో వేసుకుని సుఖపడదామనుకుంటే లాభం లేదు. పొరపాటున రెండు వందల యూనిట్లకి మించి ఓ పది యూనిట్లు దాటినా దాదాపు 200 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొన్నటివరకూ ఉన్న శ్లాబుల విధానాన్ని కూడా ఎడాపెడా మార్చేయనుంది విద్యుత్‌ శాఖ.   అటు రోడ్డు మీదకి వెళ్తే ఆర్టీసీ, ఇటు ఇంటిపట్టున ఉంటే విద్యుత్‌ శాఖ... మధ్యతరగతి నడ్డివిరిచేందుకు సిద్ధపడిపోయాయి. దీని గురించి జనం ఏమనుకుంటున్నారన్నది ఎలాగూ ఎవరికీ పట్టదు. జనం తరఫున పోరాడాల్సిన ప్రతిపక్షాల జాడేమో కనిపించడం లేదు. కాబట్టి కొంచెం అటూఇటూగా ఈ వడ్డనకి సిద్ధపడక తప్పదు. ఏమొచ్చినా మధ్యతరగతి ప్రజలకే కదా అని తిట్టుకోకా తప్పదు. కానీ, అసలు చార్జీలు పెంచాల్సిన అగత్యం ఏమొచ్చిందన్నదే ప్రతి పౌరుడిలో మెదులుతున్న ప్రశ్న! ప్రతిసారీ నష్టాల గురించీ, వాటిని పూడ్చుకునేందుకు చార్జీలు పెంచాల్సిన అవసరం గురించి చెప్పుకు వచ్చే ప్రభుత్వ శాఖలు... ఆ నష్టాలను నివారించే ఇతర చర్యల వైపు ఎందుకు దృష్టి సారించవు! అన్నదే సందేహం.   ఆర్టీసీ ప్రత్యామ్నాయ వనరుల మీద ఎంతవరకు దృష్టి పెట్టింది? పరిస్థితులకు, అవసరాలకి అనుగుణంగా బస్సులను నడపడంలో ఎంతవరకూ సమర్థవంతంగా పనిచేస్తోంది?... లాంటి సవాలక్ష ప్రశ్నలు సామాన్యుడిలో సైతం ఉదయించక మానవు. మరోవైపు ప్రత్యామ్నాయ విద్యుత్తుని ప్రోత్సహించడంలో విద్యుత్‌ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సౌర విద్యుత్ సొగసులు, ఎల్ఈడీ కాంతుల ధగధగలు లాంటి శీర్షికలు పేపర్లలో కనిపిస్తున్నాయే కానీ మన జీవితాలకు దూరంగానే ఉన్నాయి. సముద్రమట్టానికి పై ఎత్తున ఉండే హైదరాబాద్ వంటి ప్రాంతాలు పవన విద్యుత్తుకు అనుకూలం అని తెలిసినా, ఆ దిశగా తడబడే అడుగులు కూడా పడటం లేదు.   ప్రభుత్వ సంస్థలు ప్రత్యామ్నాయ వనరుల మీద దృష్టి పెట్టడం లేదు సరే! కనీసం నాణ్యమైన సేవలనన్నా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. వచ్చేపోయే విద్యుత్తుతో హైదరాబాదు శివారు ప్రాంతాలే అంధకారంలో ఉంటున్నాయి. వస్తుందో రాదో తెలియని బస్సు కోసం నగరం నడిబొడ్డున జనం ఎదురుచూపులతో కనిపిస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్యం, రవాణా రంగాలలో ప్రభుత్వ సేవల కంటే ప్రైవేటు సేవల పట్లే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడ విద్యుత్‌ రంగం పట్ల కూడా మనసు విరిగిపోతే... అది ప్రజాస్వామ్యానికే ఒక మచ్చగా మిగిలిపోతుంది.   రవాణా, విద్యుత్‌ చార్జీలను పెంచుతూ ప్రకటనలను వెలువడినప్పటికీ.... ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దమనసు చేసుకుని వాటిని ఉపసంహరించేందుకు తగిన ఆదేశాలను జారీ చేయవచ్చు. వినియోగదారుల మీద భారం మోపకుండానే లాభాలబాటని పట్టమంటూ సదరు శాఖలకు సూచించవచ్చు. సంబంధిత శాఖలు లాభాల బాట పట్టేవరకూ అయ్యే ఖర్చుని భరించడం ప్రభుత్వానికి అంత భారం కాబోదు. సంక్షేమం కోసం కోటానుకోట్లను ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి రవాణా, విద్యుత్‌ వంటి సేవలు కూడా సంక్షేమమే అని తెలియకుండా పోదు! ఒకవేళ అలా తెలియకుండా పోతే ఇక చేసేదేమీ లేదు....

సమీక్షలు..ఫిరాయింపులను అడ్డుకుంటాయా..?

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ ఫిరాయింపులు ఇలాగే కొనసాగితే మంచిది కాదని, వీటిని అడ్డుకునేందుకు త్వరలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తామని చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆయా పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపులు మరీ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తమకు ఎదురు లేకుండా చేసుకోవడానికి ఉభయ రాష్ట్రాల్లోని అధికార పక్షాలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ దెబ్బకి టీడీపీ, వైసీపీలకు కోలుకొలేని దెబ్బ తగిలింది. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ ప్రస్తుతం కేవలం మూడుకు పడిపోయింది. అదే విధంగా నలుగురు ఎంఎల్‌ఏలు, ఒక ఎంపీని గెలుచుకున్న వైసీపీకి ఆ సంతోషం లేకుండా చేశారు కేసీఆర్. మొత్తం వైసీపీ తరపున గెలిచిన వారందరిని విడతల వారీగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తమ పట్ల వ్యవహరించిన విధంగానే ఏపీలో వైసీపీ పట్ల టీడీపీ వ్యవహరిస్తోంది. ఏపీలో తమకు ప్రతిపక్షం లేకుండా చేయాలని టీడీపీ పావులు కదుపుతోంది.     రెండు రాష్ట్రాల్లోనూ అధికార పక్షాల తీరుపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఇదివరకటి రోజుల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారాలనుకుంటే వారు ఆయా పార్టీలకు, తమ పదవులకు సైతం రాజీనామా సమర్పించిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం తాము ఏ పార్టీ గుర్తుపై గెలిచామో? ఆ పార్టీ సభ్యత్వానికి, తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోగా..టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధినేతను విమర్శిస్తూ..దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీ గుర్తుపై గెలవాలని సవాళ్లు విసురుతుండటంతో ప్రజలు నివ్వెర పోతున్నారు. నాయకత్వ లోపముందనో...నియోజకవర్గ అభివృద్ధి పేరుతోనో పక్కా ప్రణాళికతో పార్టీ మారడం తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతు . అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఈ నేతల వ్యాఖ్యలతో ఏకీభవిస్తే..అసలు ప్రతిపక్షాల అవసరమే లేదు కదా..? స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా..ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఎక్కడా కనిపించలేదు. మరి ఆనాటి నుంచి ప్రతిపక్షాలు లేకుండానే పాలన సాగిందా.? ఇక్కడ మోసం చేస్తోంది..చేసుకుంటోంది తమను కాదు..ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని.   ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలోకి మారడమంటే ప్రజా విశ్వాసాన్ని అవహేళన చేసినట్లే. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మారుతోన్న నేతలు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. పార్టీ ఫిరాయింపులు చేసిన వారికి శిక్షలు అంతంత మాత్రమే. చట్టంలోని లోసుగుల్ని అడ్డం పెట్టుకుని స్పీకర్ అండదండలతో అధికార పార్టీలు వీరిపై అనర్హత వేటు పడకుండా రక్షిస్తున్నాయి. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిని నేరగాళ్లుగా నిర్థారించేదాకా వేచి చూడకుండా ఉండవలసిన అవసరం లేకుండానే, సభా వ్యవహారాలకు అనర్హుడిని చేసే ఒక కఠిన చట్టాన్ని రూపొందించాలని సుప్రీం తాజాగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన పార్టీలను ఆలోచనలో పడేసింది

ఆర్ధిక స్వాతంత్ర్యానికి పాతికేళ్లు..

ఆర్ధిక సంస్కరణలు.. దేశ గతిని మార్చి..ప్రపంచంలోనే ప్రబల ఆర్ధిక శక్తిగా భారత్‌ ఎదగడానికి కారణమైన సాహసోపేత నిర్ణయాలు. అలా దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు. పాముల్ని ఆడించుకునే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన భారతదేశాన్ని తిరుగులేని ఆర్థికశక్తిగా తీర్చిదిద్ది..ప్రపంచం ముందు నిలబడేలా చేసిన ఘనత తెలుగుబిడ్డ పీవీ నరసింహరావుదే. 1991 జూన్ 21 అప్పటికి రాజీవ్ హత్య జరిగి సరిగ్గా నెల రోజులైంది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు మందిర్-మండల్ ఉద్యమాలు. దేశంలో పూర్తిగా అస్థిరత నెలకొన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు. ఓ పక్క ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది..విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పెను సవాళ్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న పీవీ స్వాతంత్ర్య భారతావనిలో అత్యంత కఠోర పరీక్షకు సిద్ధమవ్వాలని గుర్తించారు.   సంస్కరణలు తీసుకురాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించిన పీవీ పెద్ద సాహసం చేశారు. ఆర్ధిక మంత్రుల్ని కాదని..అప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ని ఆర్థిక మంత్రిగా చేశారు. కాని మన్మోహన్‌కు ఆర్థిక మంత్రి పదవి ఇవ్వడంపై సొంతపార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటికే ప్రధాని పీఠంపై కన్నేసిన శరద్‌పవార్, అర్జున్ సింగ్, ఎన్డీ తివారీ లాంటి వారు పీవీ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించారు. వీటిని ఏ మాత్రం లెక్కచేయని నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌కు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అటు ప్రధాని తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని మన్మోహన్ వమ్ము చేయలేదు. సరళీకరణ విధానాలకు బాటలు పరిచారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశ ముఖచిత్రాన్నే మార్చివేశారు. ఈ విధానాల వల్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట సాగించే కమ్యూనిస్టులు, తదితర వర్గాలను దానికి అనుకూలంగా ఒప్పించగలిగారు పీవీ. సంస్కరణల ఫలితంగా ఐటీ అన్నది భారతదేశంలో కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక వ్యవస్థను ఇండియాలోకి విస్తరింపచేశాయి.   పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. అలా కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు నిలబడింది. ఈ విధంగా దేశానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు పీవీ. ఇంత కష్టపడిన మనిషిని దేశం సరిగా గుర్తించలేదు. ఢిల్లీలో దివంగత ప్రధానుల కోసం స్మారక ఘాట్‌లు కట్టించడం ఆనవాయితీ. కానీ పీవీకి ఇది వర్తించదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ఇప్పించిన ధీశాలికి ఇంతవరకు భారతరత్న రాలేదు. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు మృతదేహన్ని కూడా సరిగా కాల్చకుండా వదిలివేసిన ఘనత ఆనాటి నేతలకే చెల్లింది. ఏదేమైనా పీవీ నాటిన సంస్కరణలు అనే మొక్క మహావృక్షమై ఇప్పుడు దేశానికే నీడనిస్తోంది. ఎవరు గుర్తించినా గుర్తించకున్నా నవ భారత నిర్మాతగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు.

జగమంత యోగం

యోగా..ప్రపంచానికి భారతదేశం అందించిన వరం. మహర్షి పతంజలి అందించిన యోగ సూత్రాలు మానవజాతికి వరాలు. మహారణ్యాల్లోనో..హిమాలయాల్లోనో తపస్సు చేసుకుంటున్న రుషులు శరీర దారుడ్యం కోసం అనేక ఆసనాల్ని రూపొందించుకున్నారు. వాటిని సేకరించి..యోగాను పుస్తకరూపంలో అందించిన మహనీయుడు పతంజలి. ఆయన దృష్టిలో యోగా వ్యాయామం కాదు..ఆధ్యాత్మిక జీవనశైలిలో భాగం. పతంజలి అష్టాంగయోగంలోని..ఎనిమిది మెట్లూ మనోశక్తికి ఎనిమిది మార్గాలు. అలా అనాదిగా భారతీయుల జీవన విజ్ఞానంలో యోగా భాగమైంది.   అలాంటి యోగా ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. జలుబు నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగాతో చెక్‌ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అలాంటి యోగాకు మనదగ్గర ఆదరణ తగ్గుతుంది. కానీ యోగాలో మనకన్నా పాశ్చాత్యులు ముందున్నారు. హాట్ యోగా, కోల్డ్ యోగా, యోగా ప్లస్, యోగా లైట్..అలా యోగా వ్యాపారంగా మారిపోయింది. యోగాని ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియానే అంటే నమ్మని పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఉండేది. కానీ నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాకా యోగాకు గుర్తింపు తీసుకువచ్చారు.   ఆయన కృషి ఫలితంగా ప్రతి ఏడాది జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ రోజున ప్రపంచంలోని 192 దేశాలు భారత్‌కు యోగాభివాదం చేస్తాయి. ఇవాళ జూన్ 21 ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్లామిక్ దేశాలు సైతం ప్రపంచ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుండటం విశేషం. భారత్‌లో ఈ పర్వదినానికి రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వం వహించనున్నారు. దేశవ్యాప్తంగా 57 పట్టణాల్లో కేంద్రమంత్రులు యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. రాష్ట్రపతి భవన్‌లో మొరార్జీ దేశాయ్‌ జాతీయ యోగా సంస్థ సహకారంతో నిర్వహించే సామూహిక యోగా ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.   ఇక ఛండీగఢ్ వేదికగా ప్రధాని మోడీ యోగాసనాలు వేయనున్నారు. నగరంలోని క్యాపిటల్ కాంప్లెక్స్‌లో 30 వేల మందితో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. యోగాను మరింత ప్రోత్సహించేందుకు గానూ యోగాసనాల్లో ప్రతిభ చూపినవారికి బహుమతులు ఇవ్వాలని కేంద్రపాలిత ప్రాంత అధికార యంత్రాంగం నిర్ణయించింది. వారు యోగాసనాలు వేస్తున్న వీడియోను ఐవైడీసీహెచ్‌డీ 2016కు ఫేస్‌బుక్ గానీ ట్వీట్టర్ ద్వారా గానీ తమకు పంపాలని సూచించింది. అటు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి వినూత్నంగా స్వాగతం పలికింది. న్యూయార్క్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం గోడలపై వివిధ రకాల యోగాసనాలు వేస్తున్న మహిళ బొమ్మతో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే అక్షరాలను రంగురంగుల అక్షరాలతో ప్రదర్శించింది. సో ఇంకేందుకు ఆలస్యం బంచిక్ బంచిక్ చెయ్యి బాగా..ఒంటికి యోగా మంచిదేగా..అంటూ యోగా డే వేడుకల్లో మునిగిపోండి.

ఐరోపాలో రాజకీయ కల్లోలం "బ్రెగ్జిట్"

యూరోపియన్ యూనియన్‌తో గత 43 ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధాన్ని..బ్రిటన్ తెంచుకోబోతోందన్న వార్తలతో ఐరోపా సమాజం కలవరపాటుకు గురైంది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపించనుందని వీశ్లేషకులు భావిస్తున్నారు. అసలు బ్రిటన్ ఈయూ నుంచి ఎందుకు వైదొలగాలనుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలోని ప్రధాన ఆర్ధిక శక్తులన్నీ యుద్దాల బాట పట్టకుండా రాజకీయంగా, ఆర్ధికంగా పరస్పరం సహకరించుకునేందుకు యూరోపియన్ యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. తొలినాళ్లలో దీనిలో చేరేందుకు బ్రిటన్ సుముఖత చూపలేదు. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలను బేరిజు వేసుకున్న యూకే మనసు మార్చుకుని 1973లో ఈయూలో చేరింది. దీనిని వ్యతిరేకించిన లేబర్‌పార్టీ అధికారంలోకి రాగానే 1975లో రిఫరెండం నిర్వహించింది. అప్పట్లో బ్రిటన్ ప్రజలంతా దీనికి ఆమోదం తెలిపారు.   మళ్లీ ఇన్నాళ్టీకి ఈయూ సభ్యత్వంపై బ్రిటన్‌లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈయూ ఒప్పందాల వల్ల సభ్య దేశాల ప్రజలు ఐరోపా ఖండంలో ఏ దేశం వారైనా వేరే దేశంలో ఉపాధి నిమిత్తం వలస వెళ్లొచ్చు.  బలమైన ఆర్ధిక వ్యవస్థ కావడం, ఉపాధి అవకాశాలకు కొదవలేకపోవడంతో ఐరోపా ఖండంలోని చాలా దేశాల ప్రజలు బ్రిటన్‌కు వలస వస్తున్నారు. ఒక్క పోలండ్ నుంచే దాదాపు 10 లక్షల మంది బ్రిటన్‌లోకి వచ్చి ఉంటారని అంచనా. ఈ జనాలు బ్రిటన్ జనాలతో పోలిస్తే నైపుణ్యంలో ఎక్కడో ఉంటారు. ఇలాంటి వారంతా యూకేలోకి రావడంతో వేతనాలు పడిపోతున్నాయి. ఈ పరిణామం సగటు పౌరుడిలో అసహనాన్ని కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే సిరియా, ఇరాన్‌లో అంతర్యుద్ధం కారణంగా లక్షలాది మంది శరణార్థులు ఐరోపా బాట పడుతున్నారు. అందులోనూ బ్రిటన్‌వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.   వీరి నియంత్రణను ఈయూ పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఎక్కడో బ్రస్సెల్స్‌లో ఉండే ఈయూ కోర్టు తీర్పులు, నిర్ణయాలకు తలొగ్గాల్సి వస్తుండటం బ్రిటన్‌కు పెను భారంగా తయారవుతోంది. ఈ పరిణామాలను ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రిటన్ పౌరులు తమ దేశం వేరేవాళ్ల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయిందని, దీని వల్ల తమకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొందని, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు తీవ్రవాద దాడులు ఎక్కువవుతున్నాయని..పారిశ్రామిక రంగంలో కూడా తీవ్ర నిరాశాపూరిత వాతావరణం నెలకొందని..ఇలా పలు రకాలుగా ఆందోళనలో కూరుకుపోయారు. ఇదిలా ఉండగా ఈ పరిణామం క్రమంగా రాజకీయరంగు పులుముకుంది. 2010లో కంజర్వేటివ్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు యూకే స్వతంత్ర పార్టీతో చేయి కలిపింది. ఈ సమయంలో ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మద్ధతు పలికితేనే తాము సంకీర్ణంలో చేరతామని యూకేఐపీ షరతు పెట్టింది.   రాజకీయ అవసరాల కోసం డేవిడ్ కామెరూన్ దానికి అంగీకరించారు. అయితే బ్రిటన్‌ను బయటకు తీసుకురాకుండా కొన్ని ప్రత్యేక మినహాయింపుల కోసం కామెరూన్ మధ్యేమార్గంగా ఐరోపా యూనియన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈయూ దేశాల నుంచి వలస వచ్చే వారి నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలన్నది కీలక డిమాండ్. దీనిని తూర్పు ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా కామెరూన్ సొంతపార్టీ నేతలు కూడా విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు.  సరిగ్గా గతేడాది 309 ఏళ్లుగా బ్రిటన్‌లో భాగంగా కొనసాగుతున్న స్కాట్లాండ్..వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమైంది. బ్రిటన్ నుంచి తమకు స్వతంత్రం కావాలంటూ...స్కాటిష్ నేషనల్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. విడిపోతే చేడిపోతామంటూ ప్రధాని కామెరూన్ వేర్పాటువాదుల్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి తీవ్ర ఉత్కంఠ నడుమ నిర్వహించిన రిఫరెండంలో స్కాట్లాండ్‌ పౌరులు బ్రిటన్‌తో కలిసి ఉండేందుకే మొగ్గు చూపడంతో యూకే ముక్కలు కాలేదు.   అచ్చం ఇప్పుడు అలాంటి పరిస్ధితిలోనే ఉన్న ప్రధాని కామెరూన్..ఈయూ నుంచి విడిపోతే దేశం బలహీనపడి అస్థిరతకు దారి తీస్తుందని, తిరిగి కొలుకొనేందుకు చాలా కాలం పడుతుందని..ధరలు పెరిగి..ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి..శాశ్వాత పేద దేశంగా మిగిలిపోతాం. ఇవన్నీ తెలిసి కూడా ఈయూ నుంచి వైదొలగాలని ఎందుకు ఓటు వేస్తాం అంటూ ఆయన దేశప్రజలనుద్దేశిస్తూ టెలిగ్రాఫ్ పత్రికలో వ్యాసం రాశారు. ఈయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్ ఏమిటో తెలియకుండా విడిపోవడం మంచిది కాదని, దీని వల్ల ప్రపంచ వాణిజ్య, వ్యాపార రంగాలన్నీ సంక్షోభంలో పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఈయూ సభ్య దేశాలు కూడా బ్రిటన్ విడిపోవటాన్ని ఒప్పుకోవడం లేదు. ఈయూలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థతో పాటు అతిపెద్ద సైనిక శక్తి కూడా కావడంతో ఇది ఏమాత్రం మంచిది కాదని ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలన్నీ వారిస్తున్నాయి. మొత్తానికి ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ కొనసాగుతుందా..? వైదొలగుతుందా అన్నది 23న నిర్వహించనున్న రిఫరెండంలో తేలిపోనుంది.

నవ్యాంధ్రలో కొలువుల నగారా..!

నవ్యాంధ్రలో ప్రభుత్వోద్యోగాల ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 10 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ, ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్దులకు అనుమతినిస్తూ ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాల్లో పోలీసులకు పెద్దపీట వేస్తూ..మొత్తం పోస్టుల్లో సగానికి పైగా ఈ శాఖ నుంచే భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఎలాంటి నోటీఫికేషన్ వెలువడలేదు..ఈ ఏడాదైనా ఉద్యోగాల భర్తీ ఉంటుందో లేదో అని కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తెరతీయడం నిరుద్యోగులను ఆనందంలో ముంచెత్తింది.   రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కమల్‌నాథన్ కమిటీ గుర్తించింది. 2014 జూన్ 2 తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లకు పెంచడంతో ఆ గడువు తీరిన వారు ఈ జూన్‌లో దాదాపు 30 వేల మంది రిటైర్ కానున్నారు. ప్రభుత్వ కార్యాకలాపాలను అమరావతి నుంచే సాగించాలనుకుంటున్న సీఎంకు ఉద్యోగుల కొరత సమస్యగా తయారవుతుంది. మరో వైపు సోదర తెలుగు రాష్ట్రం తెలంగాణలో నోటిఫికేషన్లు వరుసగా వస్తుంటే..ఏపీలో విభజన తర్వాత ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదంటూ నిరుద్యోగుల్లో నిరాశ పెరిగిపోతోంది..పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వారిలో అసహనం శృతిమించుతోంది.   ఇంకోవైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం అనుమతుల కోసం ఏపీపీఎస్సీ నిరీక్షిస్తోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ ప్రభుత్వం వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఏపీపీఎస్సీ ద్వారా 4,009 ఖాళీలు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 5,991 ఖాళీల్ని భర్తీ చేస్తారు. గ్రూప్‌-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో వెయ్యి పోస్టులను ప్రభుత్వం గుర్తించింది. అలాగే వైద్య ఆరోగ్య విభాగంలో 422 ఖాళీలున్నాయి. వివిధ శాఖల్లోని సాంకేతిక సంబంధిత పోస్టులు 1,000 ఉన్నాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సివిల్ విభాగంలో ఎస్సైలు 287, మహిళ ఎస్సైలు 110, కానిస్టేబుళ్లు 1,103, మహిళా కానిస్టేబుళ్లు 60 భర్తీకానున్నాయి.    రాజధానికి ప్రాధాన్యత.. కొత్త రాజధానిలో కొత్త తరహా పరిపాలన సాగించాల్సిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి అమిత ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనరేట్, గుంటూరు అర్బన్, రూరల్, జిల్లా విభాగాలను పటిష్టపరిచనున్నారు. తుళ్లురు సబ్‌డివిజన్‌లో అవసరమైన మేరకు పోలీసు నియామక ప్రక్రియను చేపడుతున్నారు.

ఆర్టీసీని మూసేస్తారా!

రాష్ట్ర విభజన జరిగిపోయింది. అన్నదమ్ములు వాటాలను పంచుకున్నట్లుగా అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణలు తమతమ వనరులను పంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అప్పటి దాకా ఒక్కటిగా ఉన్న శాఖలన్నీ కూడా ఆంధ్రా, తెలంగాణ కింద విడిపోయాయి. అలా విడిపోయిన శాఖలలో ఆర్టీసీ ఒకటి. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులది కూడా ఓ ముఖ్యపాత్రే! మిగతా ఉద్యమకారులతో ఏమాత్రం తీసిపోకుండా వారు ఉద్యమంలో పాల్గొన్నారు. అనుకున్నదీ సాధించారు. కానీ ఉద్యమం ముగిసిన తరువాత తెలంగాణలోని వివిధ యూనియన్లు తమలో తాము కుమ్ములాడుకోవడం మొదలుపెట్టేశాయి. వీటికి తోడు కొందరు యూనియన్ నేతల మీద అవినీతి ఆరోపణలు రాజుకోవడంతో, కార్మికుల నైతిక స్థైర్యం దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు తమ సంస్థను కాపాడుకోవల్సిన బాధ్యత కూడా కార్మికుల మీద పడింది.   నిన్న ఆర్టీసీ అధికారులతో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినా కూడా ఇంకా ఆర్టీసీ నష్టాలలోనే నడుస్తోందనీ, ఇలా నష్టాలలో కూరుకుపోతూ ఉంటే సంస్థను  మూసేయడమే మేలనీ అన్నారు. కేసీఆర్‌ కాస్త కఠినంగా మాట్లాడినప్పటికీ, ఆర్టీసీ తరచూ నష్టాలలోనే నడుస్తూ వస్తోందన నిజం ప్రజలకు కొత్తేమీ కాదు. అయితే ఒకోసారి ఆర్టీసీ బాధ్యతారాహిత్యమే అలాంటి నష్టాలకు కారణం కావడం ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు సంక్రాంతి వంటి పండుగ సందర్భాలనే తీసుకుందాం. ఇలాంటి సమయంలో ఆర్టీసీకి ఎనలేని ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. హైదరాబాదు నుంచి విజయవాడకు ఓ సిటీ బస్సుని నడిపినా ఎక్కేంతగా రద్దీ ఉంటుంది. కానీ ఆ సమయంలోనే ఆర్టీసీ సర్వర్లు మొరాయిస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్నచిన్న సాంకేతిక కారణాల వల్ల ఆర్టీసీ అక్షరాలా కొన్ని కోట్లను నష్టపోతోందని తేలింది. కానీ ఏడాది తరువాత ఏడాది ఇదే సందర్భం పునరావృతం అవుతూ ఉంటుంది. దీనికి కారణం కొందరు ఆర్టీసీ అధికారులు ప్రైవేటు రవాణా సంస్థలతో కుమ్మక్కు కావడం అన్న ఆరోపణలూ వినిపిస్తూ ఉంటాయి.   ఇక సమయపాలన లేకపోవడం, అవసరానికి తగినట్లుగా బస్సులను నడపకపోవడం వంటి సమస్యలు ఎలాగూ ఉన్నాయి. హైదరాబాదు వంటి నగరాలలో నిత్యం వేలాది మంది జనం బస్సుల కోసం ఎదురు చూస్తూ నిల్చోవడం ఓ విషాదకర దృశ్యం. అదే సమయంలో కొన్ని రూట్లలో వెళ్లే బస్సులు ఖాళీగా వెళ్లడం కడుపు మండించే అంశం. ఏ దిశలో రద్దీ ఎక్కువగా ఉంది? ఏ సమయంలో ఎక్కువ బస్సులు అవసరం అవుతూ ఉంటాయి? తక్కువ సామర్థ్యం ఉన్న బస్సులను ఎంత మేరకు ఉపయోగించగలం? వంటి సవాలక్ష సమస్యలను ఆలోచించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉండవచ్చు. ఒక పక్క ఆర్టీసీ భాగస్వామ్యంతో తిప్పుతున్న ప్రైవేటు బస్సులు లాభాలని అర్జిస్తూ ఉంటే, మరో పక్క మిగతా సంస్థ నష్టాలలో కూరుకుపోవడాన్ని ముఖ్యమంత్రి సైతం ఎత్తిచూపారు.   ఆర్టీసీ లాభాల బాటను పట్టేందుకు ఆయన చాలా సలహాలే అందించారు. టికెట్లే కాకుండా కొరియర్‌, సరుకు రవాణా వంటి ఇతరత్రా సేవల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలనీ; పది పదిహేను మంది ప్రయాణించగల వాహనాలను నడపాలనీ; బస్టాండులలో మౌలిక వసతులను పెంచాలనీ; బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాలను వినియోగించుకోవాలనీ.... సూచించారు. మరి ముఖ్యమంత్రి మాటలను ఆర్టీసీ ఎంతవరకూ ఆచరిస్తుందో వేచిచూడాలి. నిజానికి ఆర్టీసీ లాభాపేక్షంగా నడుస్తుందనీ, సురక్షితంగా గమ్యానికి చేరుస్తుందనీ ఇప్పటికీ ప్రయాణికులలో ఓ సద్భావన ఉంది. ఆ సద్భావనకు తోడుగా మెరుగైన సేవలు లభించినరోజున, సామాన్య ప్రయాణికులు నిస్సంకోచంగా ఆర్టీసీకి అండగా నిలబడతాడు. అప్పుడు ఆర్టీసీని మూసేయడం అన్న మాట కలలో కూడా వినిపించదు! 

ఆకాశవీధిలోకి సామాన్యుడు

అబ్బా ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకుని..ఆ స్థోమత లేక కలల్లో విమానం ఎక్కే పేదవారికి ఇక నుంచి ఆ కల నిజం కానుంది. 130 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో ఏటా 80 లక్షల మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. గగన విహారాన్ని మరింత చౌకగా, సులువుగా మార్చేస్తూ సరికొత్త విమానయాన విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆఖరి నిమిషంలో ఛార్జీలు పెంచేసి ప్రయాణీకుల జేబులు గుళ్లచేసే పలు సంస్థలకు ముకుతాడు వేసింది.  ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కొత్త పౌర విమానయాన విధానాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకతపై చర్చించింది. గత కొన్నేళ్లుగా తీవ్ర ఇక్కట్లతో పీకల్లోతు కష్టాల్లో ఏటికి ఎదురీదుతున్న విమానయాన రంగాన్ని పునర్జీవింప చేసేందుకు కొత్త పౌర విమానయాన విధానానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.   దేశీయ విమానయాన రంగాన్ని సమూలంగా మార్చివేసే పాలసీగా దీనిని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అభివర్ణించారు. ఈ పాలసీ విజయవంతమైతే 2022 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే టికెట్ ఛార్జీని వసూలు చేయాలి. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే ఛార్జీ ఉండాలి. విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలకు అడ్డుగా ఉన్న వివాదాస్పద 5/20 నిబంధనను రద్దు చేశారు. దీని ప్రకారం కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలు విదేశీ రూట్లలో సర్వీసులను నడపాలంటే కార్యాకలాపాలు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తవడంతో పాటు కనీసం 20 విమానాలు కంపెనీకి ఉండాలి. ఈ నిబంధనను రద్దు చేసి దీని స్థానంలో 0/20 నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. అంటే విదేశీ రూట్లలో సర్వీసులు విస్తరించాలంటే కనీసం 20 విమానాలు కలిగి ఉంటే సరిపోతోంది. లేదంటే తమ విమానాల్లో 20 శాతాన్ని దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తే ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుంది. ఈ కొత్త పాలసీ వల్ల విస్తారా, ఎయిర్ ఆసియా వంటి కొత్తగా సర్వీసులు ప్రారంభించిన సంస్థలు కూడా విదేశీ సర్వీసులు నిర్వహించే అవకాశం కలుగుతుంది.   దేశంలో విమాన సర్వీసులకు ప్రాంతీయ అనుసంధాన్ని పెంచే ఉద్దేశ్యంతో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రీప్‌లు, ఎయిర్‌పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రీజనల్ కనెక్టివిటీ ఫండ్‌ను ఏర్పాటు చేసి నిధుల నిమిత్తం డొమెస్టిక్ టికెట్లపై రెండు శాతం లెవీ వసూలు చేస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో సర్వీసులు ప్రారంభించే విమానయాన సంస్థలు పన్ను ప్రోత్సాహకాలు పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు కావడం..ఎయిర్‌లైన్స్‌లు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోవడం వంటి ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఇకపై ఇలాంటి పనులు చేస్తే తాట తీయనుంది.   బోర్డింగ్ పాస్ ఇచ్చాకా ఏ కారణంగానైనా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ రద్దు చేయడం, ప్రయాణానికి అనుమతించకపోతే ఇకపై భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది. కొత్త పాలసీ ప్రకారం విమానం రద్దయిన గంటలోపు మరో విమానాన్ని సిద్ధం చేస్తే ఓకే ..అలా కాకుండా 24 గంటల్లోపు ప్రయాణానికి వీలు కల్పిస్తే..నష్టపరిహారం 200% ఉంటుంది. 24 గంటల తర్వాత ప్రత్యామ్యాయ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే..నష్టపరిహారం 400% చెల్లించుకోవాలి. అదే విధంగా ఫ్లైట్ లేదా టికెట్ రద్దయితే ప్రయాణికుడికి 15 రోజుల్లోగా రిఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విమానాల్లో చెక్-ఇన్ కింద ఉచితంగా 15 కేజీల వరకూ బ్యాగేజీని అనుమతిస్తున్నాయి. అదనంగా లగేజీని తీసుకువెళ్లాలంటే ప్రతీ కేజీకి రూ.250 నుంచి రూ.350 ఛార్జీని వసూలు చేస్తున్నాయి. కొత్త పాలసీలో దీనిని రూ.100కి తగ్గించారు. విమానయాన రంగంలో నిపుణులైన ఉద్యోగుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసి 2025 నాటికి 3.3 లక్షల మందిని ఈ రంగానికి అందివ్వనున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవల అందించడానికి ఎయిర్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం నాలుగు హెలీహబ్స్ అభివృద్ధి చేయడానికి కేంద్రం సాయం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, పీపీపీ పద్ధతిలో విమానాశ్రయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. పౌరవిమానయానశాఖ కేవలం నిర్ణయాత్మకంగా వ్యవహరించనుంది.   ఏపీకి వరం: కొత్త విమానయాన విధానం ఆంధ్రప్రదేశ్‌కు వరం కానుంది.. ఎందుకంటే విశాఖ, విజయవాడ, తిరుపతి ఇప్పటికే అభివృద్ధి చెందిన విమానాశ్రయాలు. అయితే కడప, పుట్టపర్తి విమానాశ్రయాలు చిన్నవి కావడంతో ఇక్కడి నుంచి సర్వీసులు ప్రారంభించడానికి విమానయాన సంస్థలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త పాలసీ ద్వారా ఈ ఎయిర్‌పోర్ట్‌లపై ఎయిర్‌లైన్స్లు దృష్టిసారించనున్నాయి. విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని విలువ తెలుసుకున్న సర్కార్ విమాన ఇంధనంపై పన్నును 1 శాతానికి తగ్గించడంతో ఏపీలో వృద్ధి రేటు దాదాపు 60% ఉంది. ఈ కొత్త పౌరవిమానయాన విధానాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.  

శాపంలా వృద్ధాప్యం

వృద్ధాప్యం ఓ భిన్నమైన జీవన దశ! కాలంతో పాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ..దశాబ్ధాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు అందే సమయం. జీవితంలో చివరి దశ కావడంతో శారీరక మార్పులను ఆపడం ఎవరి తరం కాదు. మనిషికే కాదు, ప్రతి జీవికి ఈ మజిలీ తప్పదు. ముదిమి వయసులో శారీరక సమస్యలు, మానసిక ఇబ్బందులు ఇలా ఆ రెంటీకి ఆర్ధిక సమస్య కలిస్తే ఆ జీవితం నరకమే. కాని ఆ వయసులో వృద్ధులు పిల్లల నుంచి ఆదరణ కోరుకుంటారు. కాని నేటీ సమాజంలో వారిని భారంగా తలుస్తూ..అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. కడుపునిండా తిండి పెట్టకపోవడం, అవసరానికి మందులు కొనకపోవడం, భావోద్వేగాలతో బెదిరించడం, అరవడం, తిట్టడం, కొట్టడం, నిర్బంధించడం వంటి దారుణాలతో కృష్ణా, రామా అనుకుంటూ వెళ్లిపోవాల్సిన దశలో వృద్ధాప్యం శాపంగా మారుతోంది. ఇలా నిత్యం ఛీత్కారాలు ఎదుర్కొంటూ..ఇబ్బందులు పడుతూ కుమిలిపోతున్న పెద్దలెందరో..! వేధింపులకు గురవుతున్న వృద్ధుల ప్రత్యేక దినం సందర్భంగా ప్రత్యేక కథనం   పండుటాకుల్లో ఎక్కువమంది నిత్యం కుమారుల చేతుల్లోనో..కుమార్తెల చేతుల్లోనో వేధింపులకు గురవుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా ఛైనా మొదటి స్ధానంలో ఉంది. ఇక్కడ 60 ఏళ్లకు పైబడిన వారు 16 కోట్ల 70 లక్షల మంది, 80 ఏళ్లకు పైబడిన వారు పది లక్షల మంది ఉన్నారు. జపాన్‌లో నూటికి 30 మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం వయసు మళ్లిన వారు అన్ని దేశాల్లోనూ తక్కువే. 2010 నాటికి 23 దేశాల్లో వీరి సంఖ్య క్రమంగా పెరిగింది. 2050 నాటికి 64 దేశాలు 30 శాతం వృద్ధులతో నిండిపోనున్నాయి. అంటే వృద్ధుల జనాభా 120 కోట్లకు చేరుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 80 శాతం మంది వృద్ధులుంటారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.   ఇక భారత్ సంగతి చూస్తే స్వాతంత్ర్యం వచ్చినపుడు సగటు ఆయుర్దాయం కేవలం 27 ఏళ్లు. జీవన ప్రమాణాలు మెరుగుపడటం, వైద్య రంగంలో వచ్చిన అనూహ్య పురోగతి కారణంగా దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1960లలో మనదేశంలో 2.4 కోట్ల మంది వృద్ధులుండగా..2001 జనాభా లెక్కల నాటికి 7 కోట్లకు చేరుకున్నారు. ఇప్పటికీ దేశ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే కనిపిస్తుంది. నూటికి 70 మంది సీనియర్ సిటీజన్లు పల్లెల్లోనే నివసిస్తున్నారు. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకులేకపోతున్నారు. వీళ్లకు ఏవిధమైన ఆర్ధిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు.   ఎంతో కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని పై చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలోనో, మరో దేశంలోనో స్ధిరపడి తల్లిదండ్రులను ఆదుకోని వారు కోకొల్లలు. ధీర్ఘకాల రోగల బారినపడి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. అయితే వీరితో పోలిస్తే నగరాల్లో, పట్టణాల్లో ఉండే వారి పరిస్ధితి కాస్త నయం. డబ్బు లేదా ఆస్తులు, పెట్టుబడులు, పొదుపు మొత్తాలు, వారసత్వం లేదా ప్రేమగా చూసుకునే పిల్లలు ఉండటంతో కొద్ది మంది వృద్ధులు వృద్ధాప్యాన్ని హాయిగా గడిపేస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.  దేశానికి మార్గదర్శకుల్లాంటి వృద్ధుల సమస్యలపై చాలా దేశాలు దృష్టిసారించాయి. 2004లో స్సెయిన్‌లో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశంలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వం కూడా వృద్ధులకు తమ హక్కుల పట్ల చైతన్యం కలిగించడంతో పాటు వారి ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అమలు చేయాలి. ఇప్పటికే చాలా దేశాలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఆర్ధికంగా చేయూతనిస్తున్నాయి. అటు వృద్ధులు కూడా నాలుగు గోడల మధ్య ఒంటరితనంతో కుంగిపోకుండా స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ సంబంధాలను కొనసాగించడం..స్నేహాన్ని పంచుకోవడం చేయాలి. వీలైనంతగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.  

పెద్దన్నా..! ముందు నీ సంగతి చూసుకో

అర్థ, అంగ బలాలతో ప్రపంచాన్ని కనుసైగతో శాసిస్తోంది అమెరికా..తన మాట వినని ఏ దేశాన్నైనా  సామ, దాన, భేద, దండోపాయాలతో దారికి తెచ్చుకోవడం దానికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఏ డౌట్ వచ్చినా..ఏ సాయం కావాల్సి వచ్చినా తను తప్ప వేరే దిక్కులేదన్నట్టు చేసుకుని ప్రపంచానికి పెద్దన్నగా ప్రకటించుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా యుద్ధమే దానికి పెద్ద పరిష్కారంగా భావించి తనతో పాటు సంకీర్ణదళాలను ఏర్పాటు చేసి ఇరాక్, ఆఫ్గాన్‌లపై సైనిక చర్య జరిపి ఆ దేశాలను నామరూపాల్లేకుండా చేసింది. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ పేరు చెప్పి మరోసారి యుద్దవాతావరణం సృష్టిస్తోంది. ఇలా ఆయన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికాకు సొంతదేశంలోనే సొంతప్రజలు సవాలు విసురుతున్నారు. అమెరికాలోని ఆర్లాండోలోని ఒక నైట్ క్లబ్‌లో ఒమర్ మతీన్ అనే వ్యక్తి తాజాగా తుపాకీతో విరుచుకుపడి ఏకంగా 49 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన అమెరికాతో పాటు ప్రపంచాన్ని దిగ్బ్రాంతిలో ముంచేసింది. దీనింతటికి కారణం "ఆత్మరక్షణ".   శతాబ్దాలుగా అమెరికా చరిత్రతో తుపాకులు ముడిపడిపోయాయి. ముఖ్యంగా 1800ల నుంచీ తెల్లజాతి వలస ప్రజలు పశ్చిమదిశగా విస్తరించాయి. సారవంతమైన భూమి ఉండటాన్ని గుర్తించిన వలస జాతీయులు స్థానిక రెడ్ ఇండియన్లతో పోరాటాలు చేస్తూ, పశ్చిమ హద్దులను క్రమేపీ విస్తరించుకుంటూ టెక్సాస్, కాలిఫోర్నియాలతో పాటు 1830ల నాటికి అయోవా, మిస్సోరీ, ఆర్కాన్సాస్ వంటి ప్రాంతాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా బలం లేకపోవడం, స్థానిక రెడ్ ఇండియన్లతో పోరాటాలు చెయ్యాల్సి రావడంతో వలసదారులు తుపాకుల మీద ఆధారపడటం ఎక్కువైంది. తొలినాళ్లలో అక్కడంతా బంజరు నేలలే కావడంతో ఆహారం కోసం తుపాకులతో వేటాడటం నిత్యకృత్యమైంది. ఈ వేట రానురాను సంస్కృతిలో భాగమై ఒక క్రీడగా జీవన విధానంలో భాగమైపోయింది. దానికి తోడు హాలీవుడ్ హీరోల్లో తుపాకితో స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే కౌబోయ్ సినిమాలు అప్పుడప్పుడే వస్తుండటంతో ఆ కాలపు యువత తుపాకీని ధరించడం ఫ్యాషన్‌గా ఫీలయ్యేవారు.   అలా తుపాకీ అమెరికన్ల జీవితంతో పెనవేసుకుపోయి ప్రాధమిక హక్కుగా మారింది. 1791లోనే పౌరుల హక్కులను నిర్దేశిస్తూ రాజ్యాంగానికి 2వ సవరణ తెచ్చారు. భద్రతరీత్యా తుపాకులు ఉంచుకోవడం, తీసుకువెళ్లడం పౌరుల హక్కు అని ఆ సవరణ స్పష్టం చేసింది. మరలా 2008లో అమెరికా సుప్రీంకోర్టు ప్రజలకు తుపాకులు, ఆయుధాలు తమతో ఉంచుకునే హక్కును ఈ రెండో సవరణ స్పష్టంగా పరిరక్షిస్తోందని స్పష్టంగా తెలిపింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా పళ్లు, కూరగాయాలు దొరికినంత ఈజీగా తుపాకులు దొరుకుతున్నాయి. వీటిని ఆత్మరక్షణ కోసం మాత్రమే వాడాల్సిన ప్రజలు దొంగతనాలకు, బెదిరింపులకు వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది ఉగ్రవాద సానుభూతిపరులు, మతిస్థిమితం లేని వారి చేతుల్లోకి ఈ ఆయుధాలు వెళ్లడం వల్ల దశాబ్దాలుగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.   దీంతో తుపాకుల మీద నియంత్రణ అవసరమన్న వాదన బలంగా వినపడుతోంది. ముఖ్యంగా 1960లలో కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్‌లను తుపాకులతోనే హత్యలు చేసిన నేపథ్యంలో వాటిని కట్టడి చెయ్యటం చాలా అవసరమన్న భావన బలపడింది. దీంతో తుపాకీ నియంత్రణ చట్టం తెచ్చారు గానీ అది చాలా వరకూ తుపాకుల రవాణా, పంపిణీ లైసెన్సుల వంటి వ్యవహారాలకే పరిమితమైంది. కానీ ఈ మధ్యకాలంలో తరచూ పౌరుల చేతుల్లో తుపాకులు గర్జిస్తుండటంతో అమెరికా అధినాయకత్వం ఆలోచనలో పడింది. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తుపాకీ సంస్కృతిపై ఎప్పటి నుంచో వాపోతూనే ఉన్నారు.   తాజాగా నైట్ క్లబ్ ఘటనతో ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఆయుధాలు తేలిగ్గా లభించే తరహా దేశాన్ని మనం వాంఛిస్తున్నామా? అమెరికన్లు దీనిని తేల్చుకోవాలంటూ" ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇలా స్పందించడం ఇది తొలిసారి కాదు..2012 డిసెంబర్ 14న కనెక్టికట్‌లోని న్యూటౌన్ పాఠశాల పిల్లలపై కాల్పుల తర్వాత తుపాకులపై కఠినంగా వ్యవహరించాలంటూ పిల్లలు సాక్షాత్తూ ఒబామాకు లేఖలు రాయడంతో ఆయన స్పందించి తుపాకుల నియంత్రణ కోసం తన అధికార పరిధిలో, కాంగ్రెస్ అనుమతి అవసరం లేని 23 ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమెరికా సెనేట్ ఆమోదం పొందడంలో అది విఫలమైంది. ఈ విధంగా దేశం అశాంతిలో మగ్గుతుంటే అమెరికా పక్క దేశాల్లో శాంతి నెలకొల్పుతానంటూ బయలుదేరింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. 

రక్తమోడిన అమెరికా

  అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. ఫ్లోరిడాలోని ఒర్లాండో నగరంలో పల్స్‌ అనే ఓ నైట్‌ క్లబ్‌. స్వలింగ సంపర్కులకు పెట్టింది పేరైనా ఆ నైట్ క్లబ్‌లో శని, ఆదివారాలను ఒక్కటిగా ఆస్వాదించేందుకు చేరిన 300 మందికి పైగా యువత. ఒక పక్క సంగీతపు హోరుకి చెవులు దిమ్మెక్కిపోతున్నాయి. మరో పక్క మద్యంతో మనసు మత్తెక్కిపోతోంది. శనివారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తరువాత ఏదో మందుగుండు పేలిన శబ్దం. అది కూడా సంగీతంలో ఒక భాగమే అనుకున్నారు కానీ మృత్యు ఘంటికలకు ఎవరూ గ్రహించనేలేదు. కళ్లముందే ఒకో శరీరం విగతంగా పడిపోతున్నాక కానీ తామనుకున్న స్వర్గం కాస్తా నరకానికి దారితీయబోతోందని తెలియలేదు. అమెరికా చరిత్రలోనే అతి దారుణమైన కాల్పుల సంఘటనకు వారంతా సాక్షులుగా మిగిలిపోయారు.   అమెరికాలో ఎవరో ఒకరు ఇలా విచక్షణారహితంగా కాల్పులు జరపడం కొత్తేమీ కాదు. గత ఏడాది ఇలాగే కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులలో 14 మంది మరణించడంతో, తుపాకులకు సంబంధించిన చట్టాలను మరింత కఠినతరం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న తుపాకి సంస్కృతి గురించి ఒబామా కంటితడి పెట్టినా, చట్టానికి పదునుపెట్టినా... పరిస్థితిలో మాత్రం పెనుమార్పులేవీ రాలేదు. అమెరికాలో లక్షలకొద్దీ తుపాకులు ఎప్పుడెప్పుడా అని విరుచుకుపడేందుకు ఇంకా సిద్ధంగానే ఉన్నాయి. చట్టబద్ధంగా కావచ్చు, మరో విధంగా కావచ్చు... ఇంట్లో తుపాకీ ఉండటం అనేది అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. ఒత్తిడికి లోనయ్యో, భార్యాభర్తలు గొడవపడో, మార్కులు సరిగ్గా రాలేదన్న ఉక్రోషంతోనో... ఇలా ఏ చిన్న వేదనతోనైనా తుపాకీని తీసుకుని వీధిలోకి వచ్చేస్తున్నారు పౌరులు. జనం మీదకి ట్రిగర్‌ నొక్కి మనసులోని కసిని చల్లార్చుకుంటున్నారు.   ఇలాంటి తుపాకీ సంస్కృతికి ఇప్పుడు మతద్వేషం కూడా తోడైంది. ఒర్లాండో క్లబ్‌లో కాల్పులు జరిపింది ఒమర్‌ మతీన్‌ అనే ఓ యువకుడనీ, అతను ISIS ఉగ్రవాద సంస్థ అంటే సానుభూతిపరుడనీ ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఒమర్‌ తండ్రి మాత్రం తన కొడుకు ఉగ్రవాది కాడని చెబుతున్నారు. స్వలింగ సంపర్కం అంటే మతీన్‌కు చిరాకు అనీ, అందుకనే ఈ చర్యకు పాల్పడి ఉంటాడనీ చెప్పుకొస్తున్నారు. అలా చూసినా ఒమర్‌ సనాతన భావజాలంతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు తేలుతోంది. తన మతానికీ, సంప్రదాయానికీ, అభిప్రాయాలకు వ్యతిరేకంగా తుపాకిని చేపడుతున్న సంస్కృతికి, ఒమర్‌ నిదర్శనంగా నిలిచినట్లయ్యింది. ఒమర్ తల్లిదండ్రులు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికాకు వలస వచ్చినవారు. తీవ్రవాదం వల్ల తన మాతృభూమి ఎలా విచ్ఛినమైందో చూసినప్పుడైనా ఒమర్‌ తుపాకీని చేపట్టకుండా ఉండాల్సింది.   ఒర్లాండో కాల్పులను, అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధంగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, అమెరికా అధ్యక్షులు ఇరువురూ కూడా ఈ చర్యను ద్వేషపూరితమైనదిగా ఖండించారు. ఒమర్‌ తూటాలకు బలైన 50 మందికి ప్రపంచమంతా తన నివాళులను అర్పించింది. అమెరికా రక్షణ దళాలు త్వరగా ప్రతిస్పందించడంతో క్లబ్‌లోని మిగతా వ్యక్తులు సురక్షితంగా బయటపడగలిగారు. రక్షణ దళాల ఎదురుకాల్పులకు ఒమర్‌ నిలువలేకపోయాడు. కానీ ఒమర్‌ చావుతో ఈ సమస్య తీరలేదు సరికదా, మరింత జటిలం కానుంది. ఒమర్‌ చర్య ఇటు ISIS ఉగ్రవాదులకు మరింత నైతిక స్థైర్యాన్ని అందించనుంది. ఇప్పటికే ISIS ఈ చర్యకు ఉబ్బితబ్బయిపోతోంది. సామాజిక మాధ్యమాలలో ఈ చర్యలకు తామే కారణం అంటూ ఊదరగొట్టేస్తోంది. మరో పక్క ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని రగిలిస్తున్న ట్రంప్ వంటి రాజకీయ నేతల వాదనకు ఈ సంఘటన బలాన్నిచ్చినట్లు అయ్యింది. ఈ సంఘటన తరువాత పాశ్చాత్య దేశాలలో ఉన్న ముస్లింలు మరింత అభద్రతా భావనకు లోనయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   ఒర్లాండో కాల్పులు ఒక రకంగా అమెరికాకు హెచ్చరికే! ఈ సంఘటన తరువాత అమెరికా చేపట్టాల్సిన చర్యలు చాలానే ఉన్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికా, ఒకరి మాట వినే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ తుపాకి సంస్కృతిని, ప్రజల్లోని అభద్రతా భావాన్నీ, పెరిగిపోతున్న ఉగ్రవాద భావజాలాన్నీ... రాబోయే కాలంలో ఎలా అదుపుచేస్తుందన్నదే వేచి చూడాల్సిన విషయం.   Nirjara

తొలగిన "స్థానికత" అడ్డు

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏపీకి తరలిరావడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న స్థానికత సమస్య తొలగిపోయింది. తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను నిర్థారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా 2017 జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే అభ్యర్థులకు విద్య, ఉద్యోగాల పరంగా స్థానికత కల్పించే అధికారాన్ని కేంద్రప్రభుత్వం ఏపీ సర్కార్‌కు కట్టబెట్టింది. తెలంగాణ నుంచి తరలివచ్చే అభ్యర్థులు ఏపీలోని 13 జిల్లాల పరిధిలో ఎక్కడ నివాసం ఏర్పరుచుకున్నా అక్కడి స్థానికులతో సమానంగా పరిగణించబడతారు.   రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న సచివాలయాన్ని పదేళ్లపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంచింది కేంద్రప్రభుత్వం. అయితే తదనంతర కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మాకాంను విజయవాడకు మార్చారు. ఆయనతో పాటు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు బెజవాడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా జూన్ 27లోగా అమరావతికి వచ్చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఏపీకి తరలిరావడానికి ఉన్న ప్రధాన అడ్డంకి "స్థానికత".   ఉమ్మడి రాష్ట్రంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్లు కల్పించేందుకు గానూ 1973లో అప్పటి కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి "371(డి)" నిబంధనను తీసుకువచ్చింది. 1974లో ఇది అమల్లోకి వచ్చి, 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి 4వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాప్రాంతానికి చెందిన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్థిరపడ్డారు.  వీరి పిల్లలు ఇక్కడే చదివి ఉండటంతో వారు తెలంగాణ స్థానికత కలిగిఉన్నారు. ఉన్నపళంగా ఏపీకి తరలివస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటని వారు ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవడంతో ఆయన ఏజీ సలహా మేరకు స్థానికత మార్గదర్శకాల్లో సవరణ చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.   కేంద్రం ఫైలును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపడంతో పరిశీలించిన రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు-1974ను సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు-2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్‌లో సబ్ పేరా 2 తర్వాత సబ్ పేరా 1,2లకు సంబంధం లేకుండా 2014 జూన్ 2 నుంచి మూడేళ్లలోపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నా అక్కడి స్థానికులతో సమానంగా పరిగణింపబడతారు.   ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఉత్తర్వులు-1975ను సవరిస్తూ తాజాగా ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు-2016ను రాష్ట్రపతి జారీ చేశారు. దీని ప్రకారం పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా..తెలంగాణ నుంచి ఏపీలోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఏపీ స్థానిక అభ్యర్థిగా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణింపబడతారని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గెజిట్‌లో పొందుపరిచింది. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించినట్లైంది.

నెత్తుటి దారులు..

రోడ్డు ప్రమాదం..ఆనందంగా సాగిపోతున్న ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపుతుంది. భర్తకు భార్యను, భార్యకు భర్తను, పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతుంది. హత్యలు, ప్రాణాంతక వ్యాధులు, విపత్తులు, ఆఖరికి యుద్ధాలలో మరణించేవారి కన్నా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్యే ఎక్కువ. ఈ విషయం మేం చెబుతుంది కాదు. సాక్షాత్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ విడుదల చేసిన నివేదిక . 2015 సంవత్సరానికి సంబంధించి రోడ్డు ప్రమాదాల నివేదికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. ఈ నివేదిక నిగ్గుతేల్చే నిజాలను కళ్లకు కట్టింది. అంతకు ముందు ఏడాది కంటే ప్రమాదాలు 2.5%, మృతుల సంఖ్య 4.6% పెరిగాయి. దేశంలో గంటకు 57 ప్రమాదాలు జరుగుతున్నాయి. 17 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.    *  2014లో 4,89,400 ప్రమాదాలు జరిగితే 2015 నాటికి 5,01,423 లక్షలకు చేరాయి. *  2014లో 1,39,671 మంది చనిపోతే 2015లో 1,46,133 మంది దుర్మరణం చెందారు. *  2014లో 4,93,474 మంది గాయపడగా 2015లో 5,00,279 మంది గాయపడ్డారు. *  2014లో ప్రతి 100 ప్రమాదాల్లో సగటున 28.5 మంది చనిపోగా 2015     నాటికి 29.1కి పెరిగింది. *  దేశంలో రోజూ సగటున 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా ,     వాటిలో సగటున 400 మంది చనిపోతున్నారు. *  2015లో 57,083 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి.     20,709 మంది చనిపోయారు *  ఓవర్‌లోడ్ కారణంగా 77,116 ప్రమాదాలు జరిగాయి. 28,199 మంది చనిపోయారు. *  28.4% ప్రమాదాలు జాతీయ రహదారుల్లో, 24% రాష్ట్ర రహదారుల్లో జరిగాయి.    ఎక్కువ శాతం ప్రమాదాలన్ని ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాద శాతంలో ద్విచక్ర వాహనాల శాతం 28.8%గా నమోదైంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం మూడు నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ప్రమాదాలకు డ్రైవర్ల పొరపాట్లే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతివేగంతో 62.2% ప్రమాదాలు జరిగాయి. మద్యం, డ్రగ్స్ సేవించి వాహనం నడిపిన కారణంగా 4.2% ప్రమాదాలు, 6.4% మరణాలు సంభవించాయి. ప్రమాదాల్లో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది.   ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే..ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా , విజయవాడ-హైదరాబాద్ , చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారులపై రోజూ ఏదో ఒక సమయంలో ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. దేశంలోనే అత్యంత రద్దీ అయిన రహదారిగా పేరొందిన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరిగి, ఎంతో మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. నిన్న విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌టెన్‌లో నిలిచాయి. 24,258 ప్రమాదాలతో  ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఏడవ స్థానంలో నిలవగా, 21,252 ప్రమాదాలతో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. నగరాల్లో జరిగిన ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 2,761 ప్రమాదాలు జరగ్గా అందులో 425 మంది మరణించారు. 4,685 మంది గాయపడ్డారు. ఇక 1,644 ప్రమాదాలతో విజయవాడ 16వ స్థానంలో, 1,637 ప్రమాదాలతో విశాఖ 17వ స్థానంలో నిలిచింది.   మానవ నిర్లక్షం కూడా ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. సీటు బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పాటు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని ప్రభుత్వాలు నెత్తినోరు బాదుకుంటున్నారు. అయినా ప్రజల వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా చేతులేస్తున్నాయి. మొన్నామధ్య తెలంగాణ ప్రభుత్వం హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసినా జనం తప్పించుకుని తిరిగారు. ఇక చేసేది లేక సర్కార్ చూసీ చూడనట్లుగా వదిలేసింది. ప్రమాదవశాత్తూ జరిగిన వాటిని మనం తప్పించలేం. కాని తెలిసి తెలిసి ప్రమాదానికి కారణమవ్వడం మాత్రం క్షమించరాని నేరం. ఆ నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతుంది. కాబట్టి ప్రమాదాల నివారణలో ప్రభుత్వాలకు సహకరిద్దాం.

తలాక్‌కు తలాక్...

వివాహం..ప్రతి మనిషి జీవితంలో గొప్ప మలుపు. ఇద్దరు మనుషులను..రెండు కుటుంబాలను కలిపే ఈ కార్యానికి భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇదొక పవిత్రకార్యంగా భావిస్తారు. భగవంతుడు మానవజాతికి మాత్రమే ప్రసాదించిన అనేక ప్రత్యేకతలలో వివాహం ఒకటి. జాతి, కులం, మతం అనే తేడా లేకుండా ఈ కార్యాన్ని ఎవరి స్థోమతని బట్టి వారు వైభవంగా జరుపుకుంటారు. చిన్న, పెద్ద, పేద, గొప్ప అన్న తారతమ్యాలను మరచి వివాహ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు...కానీ అభిప్రాయాలు కలవకపోవడమో..ఆలోచనలు సరిపడకపోవడమో..సర్దుకుపోవడం కుదురకపోవడమో..కారణాలు ఏమైనా కొన్ని జంటలు విడిగా ఉండాలనుకుంటున్నాయి.   హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే పరస్పర అంగీకారం ఉండాలి. అలా అయితేనే న్యాయస్థానాలు వారి విజ్ఞప్తిని మన్నించి విడాకులు మంజూరు చేస్తాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ముస్లిం విడాకుల పద్ధతి. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఆ వివాహం చెల్లదు. ఖతార్‌కు చెందిన ఒక వ్యక్తి సరదాగా ఇంటర్నెట్‌లో తన భార్యకి తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. అంతే వివాహం రద్దు చేయబడింది. షరియా చట్ట ప్రకారం ఇస్లామిక్ మత సంస్థ దార్-ఉల్-ఉలూమ్ వివాహం చెల్లదని తీర్పు ఇచ్చింది.  షయారో బానో అనే భారతీయ ముస్లిం మహిళకు ముప్పై ఏళ్లు. సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన షయారాతో 15 ఏళ్లు కాపురం చేశాక ఆమె భర్త విడాకులిచ్చేశాడు. గత పదేళ్లుగా షయారో బానోను భర్త నానా రకాలుగా హింసిండం, కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. ఆమెకు బలవంతంగా గర్బస్రావాలు చేయించాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో  హింసించేవాడు, బయటకు కూడా వెళ్లనిచ్చేవాడు కాదు. షయారా ఆ బాధలను తట్టుకోలేకపోయింది.   ఒక రోజు ఆమె భర్తే అలహాబాద్‌లోని తమ ఇంటి నుంచి బానోను ఉత్తరాఖండ్‌లోని పుట్టింటికి పంపించేశాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె భర్త కాగితం మీద తలాక్..తలాక్..తలాక్ అని మూడుసార్లు రాసి షయారా బానోకు విడాకులు ఇచ్చేశాడు. ఈ చర్య ఆమెకు ఆగ్రహాన్ని కలిగించింది. భర్త విడాకులు ఇచ్చినందుకు ఏమాత్రం బాధపడని షయారా, సింపుల్‌గా తలాక్‌ చెప్పేసి భార్య నుంచి విడిపోవాలనుకునే భర్త చర్యలోని న్యాయబద్ధతను ప్రశ్నించాలనుకుంది. త్రిపుల్ తలాక్, బహుభార్యత్వం, నిఖా హలాలాలు చట్టవిరుద్ధమని వాటిని నిషేధించాలనే ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. మొట్టమొదటిసారి ఒక ముస్లిం మహిళ తన హక్కుల కోసం ప్రశ్నించడం పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆమె పోరాటం ఇలాంటి చర్యకే గురైన వేలాది ముస్లిం మహిళల్లో స్పూర్తిని నింపింది. దీంతో తలాక్ సిస్ట్‌మ్‌ను భారతదేశం నుంచి తొలగించాలంటూ భారతీయ ముస్లిం మహిళల సంఘం పోరాటం ప్రారంభించింది.   దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్‌కు మద్థతివ్వాలని కోరుతున్న సంఘం..జాతీయ మహిళా కమిషన్ కూడా తమకు సహకరించాలని కోరింది. నిజానికి కేవలం నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులిచ్చే పద్థతిని పాకిస్థాన్‌తో సహా 22 ఇస్లామిక్ దేశాలు నిషేధించినా భారతదేశం మాత్రం ఇంకా కొనసాగిస్తోంది. ఇస్లాంకు ముందునాటి అరబ్ సమాజంలో విడాకులకు అనాగరిక పద్ధతి అవలంభించేవారు. ఆ రోజుల్లో అరబ్ పురుషులు చీటికిమాటికి తలాక్ చెబుతూ తర్వాత తలాక్‌ను వెనక్కి తీసుకుంటూ భార్యలను అష్టకష్టాలు పెట్టేవారు. ఖురాన్ దీన్ని నిషేధిస్తూ తలాక్‌ను రెండుసార్లు మాత్రమే చెప్పవచ్చునని నిర్దేశించింది. భార్యాభర్తల మధ్య ఇక రాజీ కుదరదని భావిస్తేనే మూడోసారి తలాక్ చెప్పాలని ఖురాన్ తెలిపింది. ఏడో శతాబ్దికి పూర్వంనాటి ఈ దురాచారాన్ని ముస్లిములు ఇప్పటికీ ఎందుకు అనుసరించాలి.?   ఇస్లామ్‌లో ఖుల్లా అనే ఆచారం కింద ముస్లిం మహిళలు కూడా భర్తకు విడాకులిచ్చే వీలున్నా, దానికి భర్త నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ముస్లిం పురుషుడు మాత్రం తలాక్ చెప్పడానికి భార్య అనుమతి పొందనక్కర్లేదు. స్త్రీల పట్ల వివక్ష ఎలా ఉందో చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. ఇంతకాలం ఓపిక పట్టిన ముస్లిం మహిళా లోకం ఆందోళనబాట పట్టింది. ముస్లిం స్త్రీలకు ఖురాన్ ద్వారా, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులను తప్పకుండా అమలు జరపాలని బీఎంఎంఏ ఆన్‌లైన్ పిటిషన్ వేసింది. పాకిస్థాన్ సహా అన్ని ఇస్లామ్ దేశాలు మారుతున్న కాలానికి అనుగుణంగా వారి ఖురాన్ సూత్రాలను సంస్కరించాయి. కానీ భారత్‌లోని ముస్లిం పర్సనల్ లా బోర్డు తన లాను క్రోడీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షరియా బానో వేసిన పిటిషన్‌పై అందరి కళ్లు పడ్డాయి. సుప్రీం ఏం తీర్పు చెప్పబోతుందోనని ముస్లిం లోకం ఎదురు చూస్తోంది.

శిధిలం నుంచి శిఖరం దిశగా..నవ్యాంధ్రప్రదేశ్

సుసంపన్నంగా అలరారుతున్న తెలుగుజాతిని రెండు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆదాయాన్ని, ఆస్తులను తెలంగాణకి, అప్పులను ఆంధ్రకు పంచారు. అలాంటి సమయంలో దిక్కుమొక్కు లేని రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగల నాయకుడు కావాలి.  కేంద్రప్రభుత్వ సంస్థలు...రాజధాని..వేల కోట్ల ఆస్తులు అన్ని హైదరాబాద్‌లోనే మిగిలిపోయాయి. అంత నిరాశలోనూ ఒక్కటే ఆశ..ఒక్కడి మీదే ఆశ..ఒక్కడున్నాడన్న భరోసా...ఆ  ఒక్కడు..తొమ్మది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాట పట్టించిన మొనగాడు. పాలనకే కొత్త భాష్యం చెప్పిన అడ్మినిస్ట్రేటర్. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఒడ్డున పడేయగలడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టంగట్టారు. జూన్ 8, 2014 నాడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఆయన అధికారంలోకి వచ్చి నేటితో రెండు సంవత్సరాలు పూర్తైంది.   ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి ఏపీ పరిస్థితి మునిగేనావ లాంటిది. రాజధాని లేదు..ఆదాయం లేదు..పాతాళంలా కనిపించే రెవెన్యూలోటు..చేతిలో చిల్లిగవ్వ లేదు. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలన్న ఆలోచనతో తలచుకుంటేనే సగటు ఆంధ్రుడి గుండె చెరువైపోతోంది. ఇలాంటి పరిస్థితిలో అధికారం ముళ్ల కిరీటం లాంటిది. వేరే ఎవరైనా అయితే భయపడి పారిపోయేవారు కాని అక్కడుంది చంద్రబాబు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గెలిచిన మొండి ధైర్యం ఆయన సొంతం. అన్యాయం జరిగిందని ఆగిపోకుండా.. ఒక సవాల్‌గా స్వీకరించారు. పరిపాలనలో ఎదురయ్యే చిక్కుముళ్లను అధిగమిస్తూనే..సుధీర్ఘమైన ప్రణాళికతో రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు.   అధికారంలోకి వస్తూనే కరెంట్ కష్టాలను అంచనా వేసి ముందుగా మెల్కొని రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సమయంలో ఆయన ముందున్న ప్రధాన సమస్య రాజధాని..రాజధాని ఎక్కడో చెప్పకుండా కట్టుబట్టలతో బజారుకిడ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే రాజధాని ఎంపిక కమిటీని నియమించి అనేక తర్జనభర్జనల మధ్య అమరావతిని రాజధానిగా నిర్ణయించారు బాబు. అంతేకాదు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని రీతిలో రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. దీని కోసం రైతుల నుంచి ఘర్షణలు లేవు, ఉద్యమాలు జరగలేదు. దటీజ్ చంద్రబాబు. అలనాటి అమరావతిని మించిన మహానగరాన్ని నిర్మించాలనే మహా సంకల్పంతో రంగంలోకి దిగి..విదేశీ సంస్థల్ని సైతం రంగంలోకి దింపి, దేశం కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు.   రాష్ట్రానికి వెన్నెముక లాంటి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా తను ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీని అమలు చేశారు. వ్యవసాయానికి మూలాధారమైన సాగునీటి రంగాన్ని బలోపేతం చేయాలని ప్రణాళిక రూపొందించి, మహమహులు సైతం టచ్ చేయడానికే భయపడిన నదుల అనుసంధానాన్ని విజయవంతంగా చేసి చూపించారు చంద్రన్న. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతోపాటు తోటపల్లి, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్ట్, వంశధార-2, పట్టిసీమ ప్రాజెక్ట్‌లను పట్టాలపైకి ఎక్కించారు. విడిపోతే జీతాలు కూడా ఇవ్వలేమన్న భయం నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే అధికమొత్తంలో జీతభత్యాలు ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని చేర్చారు. ఇక సంక్షేమ రంగం గురించి చూస్తే రూ. 200గా వృద్థాప్య పెన్షన్‌ను రూ. 1500కు పెంచి ఎన్ని కష్టాలు వచ్చినా అభాగ్యులకు అండగా నిలబడ్డారు. అంతేకాదు సంక్షేమంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చి సంక్షేమ ఫలాలు పేదవాడి ఇంటికి చేరేలా చేశారు.   విభజనకు ముందు ఉన్నత విద్యాసంస్థలన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో నిట్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌ ఇలా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్ని ఏపీకి తీసుకువచ్చారు. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామీకీకరణ కూడా అత్యవసరం. ఈ విషయం చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అలాంటి ముందుచూపుతోనే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లతో పోటీపడి మరి తీసుకువచ్చారు. ఇప్పుడు నవ్యాంధ్ర వేగంగా కోలుకోవాలంటే శీఘ్రగతిన పారిశ్రామికీకరణ జరగాలి. అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో పర్యటించి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను  అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించారు. చంద్రబాబు కృషి ఫలితంగా తొలి ఏడాదిలోనే రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. అంతేకాదు స్నేహపూర్వక పారిశ్రామిక వాతావరణంలో దేశంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీసిటీ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి..మరికొన్ని సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.   ఇవి మాత్రమే కాకుండా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, నాలుగు లైన్ల రహదారులు, పర్యాటక సర్క్యూట్లు, మీ ఇంటికి మీ భూమి, స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, పోర్టులు, విమానాశ్రయాలు ఇలా బృహత్ ప్రణాళికతో రాష్ట్రాన్ని శిథిలం నుంచి శిఖరాగ్రానికి చేర్చేందుకు ఒక శ్రామికుడిలా కష్టపడుతున్నారు చంద్రన్న. ఈ సమరంలో ఎన్నో అటుపోట్లను ఆయన ఎదుర్కోన్నారు..ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. సోదర తెలంగాణ రాష్ట్రం చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వడం, సంస్థలు, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాకపోవడం, కేంద్ర ప్రభుత్వ సాయం అనుకున్న స్థాయిలో లేకపోవడం, కులాల కుమ్ములాటలు, ప్రతిపక్షనేత నుంచి ఇబ్బందులు వంటి సమస్యలు ముఖ్యమంత్రిని వేధిస్తున్నాయి. వీటికి తోడు పరిపాలనలో కీలకమైన సచివాలయ ఉద్యోగులు అనుకున్న సమయానికి అమరావతికి చేరుకోకపోవడంతో చంద్రబాబు డీలా పడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నా తనతో కలిసివచ్చే వారు లేకపోవడం ఆయన్ని మానసికంగా క్రుంగదీస్తోంది. అయినా ధృడ సంకల్పంతో ముందుగా సాగుతున్న చంద్రబాబు ఆంధ్రులు కలలుగన్న స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లాలని ఆకాంక్షిద్దాం.

తుని "తుట్టె"ను కదుపుతున్న ప్రభుత్వం..

కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉద్యమం పేరిట విధ్వంసానికి పాల్పడిన వారి తాట తీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధ్వంసంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు నిందితులను ఏపీ సీఐడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. వీరిలో  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దూడల మణీంద్ర అలియాస్ ఫణి, లగుడు శ్రీనివాసరావు, పెండ్యాల రామకృష్ణ, నక్కసాయి. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీశెట్టి శివగోపి మహేశ్, ముదిగొండ పవన్ కుమార్ ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనవరి 31, 2016 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జనకు పిలుపునిచ్చారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా కాపులను బీసీలలో కలపాలని, రూ.1000 కోట్ల నిధితో కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముద్రగడ ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాపులు తునికి చేరుకున్నారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై వేలాది వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమైంది. సభ ముగిసిన తర్వాత ముద్రగడ ఒక్కసారిగా రాస్తారోకో, రైల్‌రోకోకు పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం జీవోలు ఇచ్చే వరకు రోడ్లపైనే బైఠాయించాలని ముద్రగడ చెప్పడంతో యువకులు ఒక్కసారిగా ఐదో నెంబర్ జాతీయ రహదారిపై చేరారు. అనంతరం తుని రైల్వే స్టేషన్‌కు చేరుకుని అప్పుడే వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించారు.   ఆందోళనకారుల్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయపడి పరుగులు పెట్టారు. అందరూ దిగిపోయాక..బోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో 23 బోగీలు తగులబడిపోయాయి. అంతటితో ఆగకుండా పట్ణణంలోకి ప్రవేశించి తుని పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి సామాగ్రిని, వాహనాల్ని తగులబెట్టారు. పోలీసులపై దాడులకు దిగడంతో కొంతమందికి గాయాలయ్యాయి. పట్టణంలో దుకాణాలు మూసేయాలని హెచ్చరిస్తూ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ బీభత్సానికి తుని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా గడిపారు. మరుసటి రోజు వరకు అడుగు బయట పెట్టాలంటేనే వణికపోయారంటే అల్లరిమూకలు సాగించిన విధ్వంసాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ విధ్వంసంలో రైల్వే, పోలీసు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వంద కోట్లకు పైగా నష్టం జరిగింది. జరిగిన నష్టానికి సంబంధించి ముద్రగడతో పాటు పలువురిపై 73 కేసులు నమోదయ్యాయి.   వీటన్నింటిని సీఐడీకి బదిలి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రంగంలోకి దిగిన సీఐడీ ఆ రోజు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన, పలు కెమెరాల్లో బంధించిన, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన, ప్రజల నుంచి సేకరించిన చిత్రాలు, దృశ్యాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. తుని పరిసర ప్రాంతాల్లోని 50 సెల్‌టవర్ల నుంచి విధ్వంసం జరిగిన ప్రాంతానికి వెళ్లిన సంకేతాలను కూడా విశ్లేషించారు. ఘటనా స్థలంలో సెల్‌ఫోన్లను దొంగిలించి వాటి సాయంతో కమ్యూనికేషన్ నడిపినట్టు గుర్తించారు. ఆందోళనకారులతో పాటు సంఘ వ్యతిరేకశక్తులు జతకలవడంతో విధ్వంసం మరింత ఎక్కువైనట్టు సీఐడీ తేల్చింది. ఇలా దాదాపు 400 మంది పేర్లు, చిరునామాల జాబితాలు సిద్ధం చేసి తొలివిడతగా వారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితులను కూడా దశలవారీగా అరెస్ట్‌లు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ వార్తతో ఆ ఘటనలో పాల్గొన్న వారి వెన్నులో వణుకు మొదలైంది. కేసులతో భయాందోళనలకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పలువురు కాపు నేతలు ఆరోపిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలి తప్ప విధ్వంసానికి దిగితే సమస్య తీరకపోగా మరింత జఠిలమవుతుంది. ఈ విషయాన్ని ఉద్యమాన్ని నడిపేవారు గ్రహిస్తే మంచిది.  

మథుర ఘర్షణల్లో అసలు కోణం "ఆస్తి"

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి 29 మంది పోలీసుల మృతికి కారణమైన మథుర ఘర్షణల గురించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. మనిషి ఎంత కష్టపడినా డబ్బు కోసమే..తన తరువాతి తరాలు హాయిగా కాలు మీద కాలేసుకుని నిశ్చింతగా గడపాలని నీతిగానో..అవినీతిగానో కోట్లు వెనకేస్తుంటాడు. అలాంటి డబ్బు అప్పనంగా వస్తుంటే ఎవడు మాత్రం వద్దంటాడు చెప్పండి. తనకే దక్కుతుందనుకున్న ఆస్తి..తీరా వేరే ఎవరికో దక్కితే ఎలా ఉంటుంది. ఆ మనిషి ఆగ్రహంతో ఊగిపోడు. దానికి పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందనడానికి మథుర జవహర్‌బాగ్ పార్క్ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.   1975..జనవరి 13 కాన్పూర్‌ నగరంలోని నానా పార్క్‌లో ఓ ర్యాలీ జరగాల్సి ఉంది. ఆ ర్యాలీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాల్గొంటారంటూ అంతకు ముందే నగరమంతా ప్రచారం జరిగింది. కానీ అప్పటికి 30 ఏళ్ల క్రితమే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని అందరికి తెలుసు. కానీ నేతాజీ బతికే ఉన్నారని ఆయన అనుచరులు వాదిస్తూ వస్తున్నారు. దీంతో నేతాజీని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పార్క్‌కు వెళ్లారు. తెల్ల గడ్డంతో తెల్లబట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు వేదిక ఎక్కాడు.. నేనే సుభాష్ చంద్రబబోస్‌నని ప్రకటించాడు. అంతే ఆయన మరో మాట మాట్లాడకుండా జనం ఆ పెద్దాయనపై చెప్పులు, రాళ్లు, కుళ్లిన గుడ్లు విసిరారు. ఆ టైంలోనే దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో గురుదేవ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అధికారం కోల్పోయాక స్వయంగా ఇందిరాగాంధీ ఆ ఆశ్రమానికి వెళ్లి తనను క్షమించమని వేడుకున్నారు.     ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చారంటే ఆయన దగ్గర అంత శక్తి ఏముంది అనుకుంటున్నారా..? ఆయన ఒక బాబా. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి..గురువును అన్వేషించుకుంటూ ఇల్లొదిలి పోయాడని, ఆలీగఢ్‌లో గురెలాల్ శర్మ అనే రుషిని కలిసి జీవిత పరమార్థం తెలుసుకున్నాడని ఆయన శిష్యులు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత అనేక ఆశ్రమాలు నెలకొల్పి భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు.  అనంతర కాలంలో "దూరదర్శి" పార్టీ పెట్టి శాకాహారులనే అభ్యర్థులుగా నిలబెడతానని గురుదేవ్ ప్రకటించాడు. అయితే వరుస ఓటములు పలకరించడంతో రాజకీయాలు మనకు సరిపడవని ఆథ్యాత్మిక ప్రవచనాలకే పరిమితమయ్యాడు. అయితే మథుర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమి ఆక్రమణలో ఉన్నదని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆ భూమిలో అక్రమ తవ్వకాలు సాగిస్తూ విలువైన పురాతన విగ్రహాలను దొంగిలిస్తున్నారని పురావస్తు శాఖ ఆరోపించింది. ఈ క్రమంలో 116 వయస్సులో 2012లో జైగురుదేవ్ మరణించారు. ఈ భక్తి ముసుగులో ఆయన వేలకోట్ల రూపాయలు పొగేశారని ఆరోపణలున్నాయి. ఢిల్లీ-మధుర హైవేపైనా, ఇటావా జిల్లాలో పలు విలాసవంతమైన ఆశ్రమాలు, రూ. 150 కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు ఇలా జైగురుదేవ్‌కు యూపీ సహా దేశవ్యాప్తంగా 12 వేల కోట్ల ఆస్తులున్నట్లు తేలింది. ఆయన మరణానికి ముందే తన డ్రైవర్ పంకజ్ యాదవ్‌ను తన వారసుడిగా ప్రకటించారు.   దీంతో జైగురుదేవ్ అనుచరుడిగా ఉన్న రాంవృక్ష యాదవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆస్తులపై పట్టు సాధించేందుకు  జవహర్‌బాగ్ పార్క్‌ను తన అడ్డాగా చేసుకున్నాడు. వెయ్యి మందితో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశాడు. దీని పేరే "ఆజాద్ భారత వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి". దీని సాయంతో పంకజ్‌ను అంతమెందించి, అతని నుంచి జైగురుదేవ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే రాంవృక్ష యాదవ్ ప్రధాన లక్ష్యం. ఇయనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అక్కడకు మారణాయుధాలు తెస్తున్నా, బాంబులు పోగేసుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు. ఇంత చేసుకున్నా చివరికి రాంవృక్ష యాదవ్‌కు చావే మిగిలింది. పోలీసులను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సిలిండర్లను పేల్చారు. ఆ పేలుళ్లలో యాదవ్ మరణించినట్టు పోలీసులు నిర్థారించారు. ఇలాంటి వ్యక్తులను అదుపు చేయకపోతే ఏమవుతుందో మథుర ఉదంతం నిరూపించింది. దీనిని గుణపాఠంగా భావించి సంఘానికి చీడ పురుగుల్లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.