కేంద్రం, మమత – దొందూ దొందే!
posted on Jan 4, 2017 @ 2:51PM
ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన మమతాదీదీ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడెలాంటి వ్యాఖ్య చేస్తారో ఊహించడం కష్టం. కానీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారనీ, చేసిన వ్యాఖ్యలు ఘాటుగా ఉంటాయన్నది మాత్రం సందేహాతీతం. అందుకే నోట్ల రద్దు విషయంలో కేంద్రాన్ని ధిక్కరించేందుకు ప్రతిపక్షాలన్నీ వేచిచూస్తున్న వేళ, మమత మాత్రం మోదీని ఢీకొనే సాహసం చేశారు.
మోదీ,మమతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సందర్భంలోనే పశ్చిమబెంగాల్లో కేంద్ర రక్షణదళాలు మోహరించడంతో... వీరి మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. తృణమూల్ ప్రభుత్వాన్ని భయపెట్టేందుకే మోదీ ఈ చర్యకు ఆదేశించారంటూ మమత మండిపడ్డారు. ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే తృణమూల్ పార్లమెంటరీ నేత సుదీప్ బందోపాధ్యాయని నిన్న సీబీఐ అరెస్టు చేసింది. దీంతో మీడియా ముందు మమత మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనని అరెస్టు చేసి చూడమంటూ సవాలు విసిరారు. అసలైన దొంగ మోదీయేనని మెటికలు విరిచారు.
అవడానికి సీబీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా, కేంద్ర ప్రభుత్వం దానిని తన ఇష్టానుసారంగా వినియోగించుకుంటుందన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యక్తి జోలికీ సీబీఐ పోకపోవడం, కీలక సమయాలలో ప్రతిపక్ష నేతల మీద విరుచుకుపడటం చూస్తే ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదనిపిస్తుంది. అలాగని పట్టుబడిన సదరు సుదీప్ బందోపాధ్యాయులవారు నిష్టగరిష్టులా అంటే అందుకూ ఆధారాలు కనిపించడం లేదు. మరమరాలు నమిలినంత తేలికగా ప్రజల సొమ్ముని మింగేసిన రోజ్వ్యాలీ అనే చిట్ఫండ్ కంపెనీకి ఆయన అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి.
మన దేశంలో ఇప్పటిరకూ బయటపడిన నగదు కుంభకోణాలన్నింటిలోకీ రోజ్వ్యాలీ కుంభకోణం పెద్దదంటున్నారు. ఓ అంచనా ప్రకారం ఈ కుంభకోణంలో దాదాపు 60 వేల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయి. ఈ కుంభకోణం సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం యావత్తూ సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. సుదీప్ బందోపాధ్యాయులవారు రోజ్వ్యాలీ అందించిన అర్థికసాయంతో విదేశీయాత్రలు సైతం చేపట్టారని సీబీఐ వాదిస్తోంది. ఆ అంశం మీద సుదీప్ ఇచ్చిన వివరణ సహేతుకంగా తోచకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
సీబీఐ చర్య మమతా దీదీకి ఏమాత్రం నచ్చలేదన్నది వేరే చెప్పాలా! నోట్ల రద్దు నిర్ణయం మీద తాము చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకే ఈ అరెస్టు జరిగిందని ఆమె ఆరోపించారు. పార్లమెంటులో తమ గళాన్ని బలంగా వినిపించినందుకే తమ పార్లమెంటు సభ్యుని అరెస్టు చేసిందంటున్నారు. సుదీప్ నిర్దోషి అనీ, ఆయన్ని జైలుకి పంపినా కూడా పార్టీ ఆయనకు అండగా నిలుస్తుందనీ భరోసా ఇచ్చారు. మమత మాటల్ని పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగానే పరిగణించినట్లు కనిపిస్తోంది.
అందుకనే దీనిని భాజపా ప్రతీకార చర్యగా భావిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు కోల్కతాలో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు.సీబీఐ వంటి అత్యున్నత సంస్థని కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం, మమత వంటి నిబద్ధత కలిగిన నేతలు సైతం తమ పార్టీ నాయకులు తప్పు చేసినా వెనకేసుకురావడం... ఈ రెండూ కూడా ప్రజస్వామ్యానికి తప్పుడు సంకేతాలని అందిస్తున్నాయి. నానాటికీ దిగజారిపోతున్న ఈ రాజకీయ విలువలను చూస్తూ- ఓ మహాత్మా ఓ మహర్షి అంటూ గుడ్ల నీరు కక్కుకోవడం తప్ప ఏం చేయగలం!