మోదీ మాట – ఊరించిందా! ఉసూరుమనిపించిందా!
posted on Jan 1, 2017 @ 12:09PM
నవంబరు 8. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, 50 రోజులు ఓపిక పడితే అద్భుతాలు జరుగుతాయని మోదీగారు మాటిచ్చారు. జనం నోరు తెరుచుకుని ఆ అద్భుతం కోసం ఎదురుచూశారు. ఏటీఎంల ముందు నిల్చొని మరీ ఆ అద్భుతం ఎక్కడి నుంచి ఊడిపడుతుందా అని ఆశలపల్లకి మోశారు. 50 రోజులలో నగదు పరిస్థితి ఎలాగూ మెరుగుపడలేదు. పైగా నగదురహిత సహాజం అనే కొత్త పల్లవిని కేంద్రం అందుకోవడంతో... అసలు లోటు నగదుని భర్తీ చేసే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని అర్థమైపోయింది. సో.. 50కి మరో 150 రోజులు గడిచినా కూడా నగదు కోసం క్యూలు కట్టక తప్పదని తేలిపోయింది. దాంతో మరింకే అద్భుతం జరగనుంది అన్న అనుమానం మొదలైంది జనాలకి. మోదీగారు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు అన్న వార్త రావడంతో... ఆ అద్భుతమేదో ఆయన నోటి నుంచే విందామనుకున్నారు దేశప్రజలు.
నిన్న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ప్రధాని నల్లధనం గురించి మాట్లాడలేదు. ఇన్నాళ్లుగా ఎంత ధనం పోగైంది? అందులో నల్లధనం ఎంత? దాని వలన ప్రభుత్వానికి ఉపయోగం ఎంత? ఆ ఉపయోగాన్ని ప్రజలకు ఎలా చేరవేస్తున్నారు? లాంటి సవాలక్ష ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. నల్లధనం అదుపు కోసం ఇంకెలాంటి కఠినచర్యలు తీసుకుంటున్నారో తెలియచేయలేదు. గృహరుణాల మీద వడ్డీ తగ్గింపు, సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ, గర్భిణీలకు ఆరువేల రూపాయలు, రైతు రుణాల మీద రెండు నెలల వడ్డీ మాఫీ, చిన్న పరిశ్రమలకు రుణాలు అంటూ తాయిలాలు ప్రకటించారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలే! ఇలాంటి పథకాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ నిస్సత్తువగా మారిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలంటే ప్రజల జీవనస్థాయిని మెరుగుపరచాలే కానీ... వారిని ప్రభుత్వం మీద ఆధారపడేలా చేయకూడదన్నది నిపుణులు తెగ మొత్తుకుంటున్నారు. ఇలాంటి పథకాల వల్ల ఓట్లు రావడం, ప్రభుత్వపు భుజకీర్తులు తళతళ్లాడటం తప్ప దీర్ఘకాలిక ప్రయాజనాలు ఉండవన్నది నిపుణుల మాట. కాబట్టి, దేశ అర్థిక రంగాన్ని ప్రక్షాళనం చేస్తానంటూ వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇలా యూటర్న తీసుకోవడం ఆర్థికవేత్తలను సైతం నివ్వెరపరిచింది. కానీ నల్లనోట్ల రద్దుతో కునారిల్లుతున్న రియల్ఎస్టేట్ రంగాన్ని, చిన్న పరిశ్రమలని ప్రోత్సహించేందుకే ఈ రాయితీలు ప్రకటించామన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఇక నిరంతరం రైతుల కష్టాల గురించి మాట్లాడే ప్రతిపక్షాలకు చెక్ చెప్పేందుకే రైతు రుణాలలో వెసులుబాటుని అందించినట్లు తెలుస్తోంది.
మరి ఇంతకీ మోదీ మనసులో ఏముందన్నది చెప్పడం కష్టం. నిజంగా ఏ ఉద్దేశంతో పెద్దనోట్లని రద్దు చేశారు. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థను ఏ తీరున నడిపంచబోతున్నారన్నది ఊహకందని విషయం. కానీ ఏ నిర్ణయానికైనా ఆయన వెనుకాడరని, తన ప్రణాళికలకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడిపించదల్చుకున్నారనీ తేలిపోయింది. దాంతో ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశించడం తప్ప చేయగలిగిందేమీ లేదు.