అఖిలేష్ – తండ్రిని మించిన తనయుడా!
posted on Jan 2, 2017 @ 12:13PM
గత ఆర్నెళ్లుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న తతంగాన్ని గమనిస్తే... సెంటిమెంటు దట్టించిన సీరియళ్లు సైతం దిగదుడుపుగానే తోస్తున్నాయి. తరచి చూస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో తండ్రీకొడుకులు ఎందుకంతగా తగువులాడుతున్నారో ఓ పట్టాన బోధపడదు. సమాజ్‌వాదీ పార్టీలో కురువృద్ధుడైన ములాయం సింగ్ యాదవ్ సోదరులలో రాంగోపాల్, శివపాల్‌లే ఈ పోరులో కీలకంగా నిలుస్తున్నారు. శివపాల్ ములాయం వైపు నిలుస్తుండగా, రాంగోపాల్ అఖిలేష్‌కు మద్దతిస్తున్నారు. వీరి ఆధిపత్యానికి చెక్ పెట్టే క్రమంలోనే తండ్రీకొడుకులు తగవులాడుకుంటున్నారు.
ఐదేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ ప్రతినిధిగా అఖిలేష్‌ను నియమించినప్పుడు అంతా సవ్యంగానే ఉన్నట్లు తోచింది. దేశంలోనే అతిపిన్న వయసులో ఆ పదివిని చేపట్టినవాడిగా అఖిలేష్ చరిత్ర సృష్టించారు. అయితే అఖిలేష్‌ను ముందుంచి తామే సర్వాధికారులుగా వెలిగిపోదామనుకున్న ములాయం, శివపాల్‌ల ఆలోచనలు చెల్లలేదు. దాంతో ములాయం బహిరంగంగానే అఖిలేష్ మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. మొదట్లో ఇవి ఏవో పెద్దరికంతో కూడుకున్న హెచ్చరికలుగా భావించిన అఖిలేష్ వర్గం... క్రమేపీ వాటి వెనుక అమర్‌సింగ్, శివపాల్‌ల ప్రభావం ఉందని గుర్తించాయి. దాంతో శివపాల్ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టారు అఖిలేష్. శివపాల్ వర్గీయుల మీద వేటు వేయడంతో మొదలైన ఈ పోరు నెలలు గడిచేసరికి తారస్థాయికి చేరుకుంది.
గత కొద్ది నెలలుగా శివపాల్, అఖిలేష్‌లు ఏదో ఒక గొడవపడటం.... ములాయం జోక్యంతోనో, పెద్దల రాయబారాలతోనో అవి సద్దుమణగడం జరుగుతోంది. ములాయంగారి ఉద్వేగపూరితమైన హెచ్చరికలు, అఖిలేష్ కన్నీటి ప్రసంగాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు పరమ ఆసక్తిగా ఆస్వాదించారు. కానీ ఈ వివాదాలలో తాను మాత్రం తమ్ముడు శివపాల్ పక్షమని ములాయం స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. దానికి తోడుగా అఖిలేష్ సూచనలను పక్కనపెట్టి ఎప్పుడైతే పార్టీ అభ్యర్ధులను ప్రకటించారో, అప్పుడిహ చాటుమాటుగా సాగిన తండ్రీకొడుకుల పోరుకాస్తా రచ్చకెక్కింది.
తండ్రీకొడుకులు తాడోపేడో తేల్చుకునే కీలకదశలో పార్టీ యావత్తూ అఖిలేష్‌కు అండగా నిలబడటం ఆశ్చర్యకరమైన పరిణామం. శివ్‌పాల్ నియంతృత్వం మీద విద్వేషమో, ములాయం మొండిపట్టు మీద కినుకో, పదవిలో ఉన్న అఖిలేష్ మీద పక్షపాతమో... కారణం ఏదైతేనేం, పార్టీ ఇప్పుడు అఖిలేష్ వైపు ఉన్నదని తేలిపోయింది. 229 మంది ఎమ్మెల్యేలకు గాను 200 ఎమ్మెల్యేలు అఖిలేష్‌కు మద్దతు పలకడమే దీనికి పరాకాష్ట. పార్టీ మీద తనకు పట్టుందని తేలిపోవడంతో అఖిలేష్ మరో అడుగు ముందుకువేశారు. ములాయంను ఏకంగా జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తననే ఆ పదవికి ఎంపికయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక అమర్‌సింగ్, శివ్‌పాల్ యాదవ్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ హఠాత్పరిణామం తరువాత ములాయం ఎన్ని బింకాలు పోయినా, పార్టీ తన చేయి దాటిపోయిందని మాత్రం గ్రహించక తప్పలేదు.
ఇంతకీ ఈ పరిణామాలన్నీ రాబోయే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే విశ్లేషించదగ్గ విషయం. అఖిలేష్ ప్రభుత్వం అద్భుతాలు చేయనప్పటికీ, ప్రజలు ఆయనకు మద్దతుగానే ఉన్నారని కొన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. యువకుడు కావడం, వ్యూహాలు పన్నే నేర్పు కలిగి ఉండటం, చురుగ్గా మెసలడం, మౌలిక వసతుల మీద దృష్టి పెట్టడం వంటి లక్షణాలతో అఖిలేష్ మీద అక్కడ సానుభూతి మెండుగానే ఉంది. అధికారం కోసం అదను చూస్తున్న బీఎస్పీ, బీజేపీలకు ప్రస్తుత పరిస్థితులు ఎలా స్పందించాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే ప్రజల ఆసక్తి అంతా ఇప్పుడు ములాయం, అఖిలేష్‌ల మధ్య జరుగుతున్న పోరు మీదే నిలిచి ఉంది. ప్రజల దృష్టిని అలా మరల్చేందుకే తండ్రీకొడుకులు నాటకమాడుతున్నారని విమర్శిస్తున్నవారూ లేకపోలేదు. అసలే ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలాగైనా భాజపా పాగా వేయాలని మోదీ పట్టుదలగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఈ ఎన్నికలలో ఎస్పీ, బీఎస్పీలు సాగించే ధనప్రవాహాన్ని అడ్డుకోవాలన్న వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. పైగా మొన్నటికి మొన్న మోదీ తన ప్రసంగంలో కురిపించిన వరాల జల్లులు కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వెలువడ్డాయని విశ్లేషిస్తున్నారు.
ఒక పక్క మోదీ ప్రభంజనం, మరోపక్క అమర్‌సింగ్‌వంటి నేతల జిత్తులు, ఇంకోవైపు పంతం నెగ్గించుకునే పట్టుదలతో రగులుతున్న తండ్రి... వీటిన్నింటినీ దాటుకుని, మాయావతిని ఎదుర్కొని, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అఖిలేష్ మరోమారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారా? అదే కనుక జరిగితే అతని రాజకీయ చతురత చరిత్రలో నిలిచిపోతుంది.