దేశాన్ని కుదిపేసిన మూడు సంఘటనలు
posted on Dec 31, 2016 @ 11:14AM
2016- సంఖ్యాపరంగా 9ని సూచించే ఈ సంవత్సరంలో అంతా శుభాలే జరుగుతాయని అంతా ఆశించారు. శుభాల సంగతేమా కానీ ఊహించని సవాళ్లు మాత్రం ఎదురుపడ్డాయి. పక్క రాష్ట్రాల దగ్గర్నుంచి ప్రపంచ దేశాల వరకూ అనూహ్యమైన పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఇంట్లో తన మానాన తను పడుండే మధ్యతరగతి స్థితప్రజ్ఞులను సైతం ఉలిక్కిపడేలా చేశాయి. వాటిలో ముచ్చటగా మూడు పరిణామాలు ఇవీ...
2016 సంవత్సరం ఇలా అడుగుపెట్టిందో లేదో, పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద పాక్ ప్రేరేపిత మూకలు అలా విరుచుకుపడ్డాయి. ఇందులో జరిగిన ప్రాణనష్టం సంగతి అటుంచితే, ఉగ్రమూకలు ఏకంగా మన రక్షణ రంగం మీదే దాడి చేసి, మన భద్రతా వ్యవస్థని వెక్కరించినట్లయ్యింది. పఠాన్‌కోట్ సంఘటనకీ తమకీ సంబంధం లేదంటూ పాకిస్తాన్ ఎన్ని చిల్లర మాటలని వల్లించిందో భారతీయులు పంటిబిగువున గమనిస్తూనే వచ్చారు. భారతీయుల సహనాన్ని అలుసుగా తీసుకున్న పాక్ చెలరేగిపోయింది. కశ్మీర్‌లో విధ్వంసాన్ని సృష్టించి మూడు నెలల పాటు అక్కడి జనజీవనం స్తంభించిపోయేలా చేసింది. పాకిస్తాన్ విధేయగణం అక్కడి ఉరీ సెక్టారులోని సైనికు స్థావరం మీద విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టించారు. దాంతో మన సహనానికి కూడా హద్దుంటుందన్న విషయాన్ని పాక్ పాలకులకు గుర్తచేయక తప్పలేదు. ఉరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సరిహద్దులను దాటుకుని వెళ్లి మరీ పాక్ గడ్డ మీద పాలుపోసుకుంటున్న ఉగ్రవాదులను తుదముట్టించింది. మున్ముందు మన జోలికి వస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్‌తో పాటుగా ప్రపంచానికి కూడా ఈ సర్జికల్ దాడులు హెచ్చరికగా నిలిచాయి.
సర్జికల్ దాడుల తరువాత మన దేశాన్ని కుదిపివేసిన మరో అంశం పెద్ద నోట్ల రద్దు. నల్ల ధనాన్ని వెలికితీయడమే తన లక్ష్యమంటూ పదవిని చేపట్టిన మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం యావత్తూ నివ్వెరబోయింది. 90 శాతం మనుషులు నగదు కార్యకలాపాలకే అలవాటు పడిన దేశంలో, ఏకంగా 87 శాతం నగదుని రద్దుచేయడంతో జనమంతా బ్యాంకుల బాట పట్టారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వినిపించినా, సాహసోపేతమైన నిర్ణయం అంటూ ప్రశంసలు లభించినా... ఏది ఏమైనా జనం సర్దుకుపోక తప్పలేదు. ఈ నిర్ణయంతో నల్లధనం మీద అంతగా ప్రభావం లేదని తేలిపోవడంతో కేంద్రం నగదు రహిత సమాజం అంటూ కొత్త పల్లవిని అందుకుంది. ఏది ఏమైనా ఈ నిర్ణయంతో మున్ముందు అద్భుతాలు జరుగుతాయనే ఆశతో... మధ్య తరగతి జీవి మాత్రం ఏటీఎంల చుట్టూ తిరుగుతూ తన సహనానికి పదును పెట్టుకుంటున్నాడు.
సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు తరువాత భారతీయులంతా ఉలిక్కిపడేలా చేసిన మరో అంశం ట్రంప్‌గారి విజయం. అమెరికా అధ్యక్షపదవి పోటీలో ముందు నిలిచిన ట్రంప్ విజయం ఆ దేశ వాసులకే కొరుకుడుపడటం లేదు. మన దేశ రాజకీయ నాయకులలాగానే ట్రంప్ ఆ దేశవాసుల భావోద్వేగాలను జయించే చిట్కాలు ప్రయోగించడంతో ట్రంప్ అనూహ్యంగా అమెరికా అధ్యక్షపదవిని చేరుకున్నారు. దేశవాసులకే ఉద్యోగాలిస్తాను, పరమతస్తులను అణిచివేస్తాను అంటూ వదరిన ట్రంప్ వాచాలత్వం అక్కడి పౌరుల మీద బాగానే పనిచేసినట్లుంది. కానీ ఈ సాంకేతిక యుగంలో అమెరికా అభివృద్ధి కోసం అహర్నిశం తోడ్పడిన అక్కడి భారతీయుల పరిస్థితే అగమ్యగోచరంగా మారిపోయింది. అమెరికాలో అడుగుపెట్టడమే జీవితాశయంగా భావించే నిపుణులకీ ట్రంప్ విజయం అడ్డుగోడ కానుంది. వీటికి తోడు చపలచిత్తానికి పేరుగాంచిన ట్రంప్ చైనా, పాకిస్తాన్‌లకు అనుకూలంగా ప్రవర్తిస్తాడేమో అన్న అనుమానంతో రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.