శశికళ వర్సెస్ మోదీ
posted on Dec 30, 2016 @ 10:17AM
తమిళనాట మరో అధ్యాయం మొదలైంది. శశికళని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. జయలలిత ఉన్నన్నాళ్లూ తన నుంచి పది అడుగుల కింద వరకు కూడా మరో నేత చేరుకోలేని విధంగా జాగ్రత్త పడ్డారు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన పన్నీర్‌సెల్వం సైతం ఇంచుమించుగా జయకు సేవకుని పాత్రనే పోషించారు. దాంతో జయకు ఏకైక నేస్తమైన శశికళ తప్ప ఆ పార్టీకి మరో దిక్కు తోచలేదు. కానీ ఇక్కడే జాతీయ ప్రభుత్వానికీ అన్నాడీఎంకేకూ మధ్య అగాధం మొదలైనట్లు తోస్తోంది.
శశికళ జయకి ప్రియ నెచ్చెలి కావచ్చు. ఆమె నిర్ణయాల వెనుక ఒక బలమైన కారణంగా ఉండి ఉండవచ్చు. కానీ జయకు ఉన్న ప్రతి వివాదంలోనూ శశికళ పేరు కూడా వినిపిస్తుండేది. ఒక సందర్భంలో జయను సైతం అదుపు చేసే ప్రయత్నం చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అందుకనే ఆమెను కొన్నాళ్ల పాటు జయ పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. అదంతా గతం కావచ్చు. కానీ వర్తమానంలోనూ శశికళ శైలి జాతీయ ప్రభుత్వానికి ఏమంత నప్పేదిగా లేదన్నది పరిశీలకుల మాట. జయ ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచీ కూడా ఆమె ప్రవర్తన అనేక అనుమానాలకు తావిచ్చేదిలా సాగింది. జయ చెంతకి ఆమె రక్తసంబంధీకులను సైతం రానీయకుండా జాగ్రత్త వహించడం, జయ ఆస్తులు అధికారాల విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదపడం చూస్తుంటే... ఆమె చతురత ఏ స్థాయిలో ఉందో, కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయింది.
శశికళ పట్ల తీవ్రమైన అనుమానాలను రేకెత్తించే అంశం మరొకటి కూడా ఉంది. జయ ఉన్నన్నాళ్లూ శశికళ భర్త నటరాజన్‌తో సహా ఆమె కుటుంబసభ్యులు ఎవ్వరినీ దరికి రానీయలేదు. కానీ ఎప్పుడైతే జయ తుదిశ్వాస విడిచారో, ఆమె భర్త నటరాజన్ వచ్చి వాలిపోయారు. దిల్లీలోనూ, చెన్నైలోనూ తెగ తిరుగుతూ చక్రం తిప్పేందుకు ఉత్సాహపడిపోయారు. ఇలాంటి వ్యక్తుల చేతిలో కనుక రాష్ట్రాన్ని ఉంచితే ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అందుకనే శశికళని అడ్డుకునేందుకు కేంద్రం శతధా ప్రయత్నిస్తోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. శశికళకు హితుడైన శేఖర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం, ఆమెకు సన్నిహితులైన వారందరి మీదా నిఘాని పెంచడంతో ఆమెకు తగిన హెచ్చరికలే అందాయి. ఇక జయ అంత్యక్రియలలో శశికళని ఓదార్చిన మోదీగారు, ఆమెను తిరిగి కలుసుకునేందుకు కూడా ఒప్పుకోకపోవడంతో... ఆమె పట్ల వారి వైఖరి చెప్పకనే చెప్పినట్లయ్యింది. దాంతో ఎలాగొలా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకుందామనుకున్న శశికళ వర్గం, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కథ ఇక్కడితో ముగిసిపోయిందనుకోవడానికి లేదు. శశికళ కూడా మోదీ సవాళ్లకు దీటుగానే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. వద్దు వద్దంటూనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడంతో, మున్ముందు ఆమె పార్టీలో బలమైన శక్తిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నారన్న సూచనలు కనిపించాయి. శశికళ కాకున్నా, ఆమెను అడ్డుపెట్టుకుని ఉన్న నటరాజన్ వంటి కుటుంబసభ్యులు ప్రభుత్వ పాలనలో ఎలాంటి జోక్యం చేసుకుంటారో వేచి చూడాల్సిందే! మరి మోదీ కూడా ప్రేక్షక పాత్రను వహిస్తారా లేకపోతే శశికళ ప్రాభవాన్ని వీలైనంతగా నిర్వీర్యం చేసేందుకు తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే!