బీసీసిఐకి సుప్రీం బౌన్సర్
posted on Jan 3, 2017 @ 1:35PM
మన దేశంలో ఓ గొప్ప సుగుణం ఉంది. ఇక్కడ ఎంతటి నియంతలైనా సరే... సమాంతర రాజకీయాలను నడపడం సాధ్యం కాదు. ఏదో ఓ సందర్భంలో వారికి పౌరుల నుంచో న్యాయవ్యవస్థ నుంచో భంగపాటు తప్పదు. రాజ్యంగవ్యవస్థని ధిక్కరించి ‘మమ్మల్నేం చేసుకుంటారో చేసుకోండి...’ అని జబ్బలు చరిచే అవకాశం ఇక్కడ ఉండదు. బీసీసీఐ విషయంలో ఈ నిజం మరోసారి రుజువైంది.
ఒకప్పుడు బీసీసీఐ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు.కానీ ఎప్పుడైతే 1983 ప్రపంచకప్ తరువాత మనదేశంలో క్రికెట్ వేళ్లూనుకోవడం మొదలైందో... అప్పటి నుంచి ఆ మీద ఆట మీద అధికారాన్ని చెలాయించేందుకు అటు రాజకీయ నేతలూ, ఇటు వ్యాపారవేత్తలూ తహతహలాడటం మొదలుపెట్టారు. 2001లో జగ్మోహన్ దాల్మియా అధ్యక్ష పదవిని చేపట్టాక బీసీసీఐ సంస్థ పక్కా ప్రొఫెషనల్ సంస్థగా మారిపోయింది. క్రికెట్ ఆటని ఒక బంగారు బాతుగా మర్చేసి, వ్యాపారమే పరమావధిగా పనిచేయడం మొదలుపెట్టింది.
ఒక వైపు టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు క్రికెట్ ఆటకి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువస్తే... మరోవైపు ఆ ప్రాచుర్యాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోసాగింది బీసీసీఐ. లలిత్ మోదీ, శరద్ పవార్, శశాంక్ మనోహర్, రాజ్‌సింగ్ దుంగాపూర్ వంటి వారు బీసీసీఐలో చేరి ఆటని శాసించడం మొదలుపెట్టారు. ఒక స్థాయిలో ప్రపంచ క్రికెట్‌నే శాసించగల స్థాయికి బీసీసీఐ చేరుకుంది. బీసీసీఐతో ఏదన్నా వివాదం వస్తే, అవతల ఏ దేశమైనాన సరే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాచ్ వేదికలను నిర్ణయించాలన్నా, అంపైర్లను తొలగించాలన్నా బీసీసీఐ పంతమే నెగ్గేది.
బీసీసీఐ ఒక సమాంతర శక్తిగా ఎదగడం చూసి నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఎవరూ నోరెత్తి ప్రశ్నించలేకపోయేవారు. బీసీసీఐకి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా వారి క్రీడా జీవితం అగమ్యగోచరంగా మారిపోయేది. కపిల్‌దేవ్ వంటి మహామహలు సైతం బీసీసీఐకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానాల పాలయ్యారు. భారతీయ క్రికెట్ జట్టులో ఎవరుండాలి? ఆటగాళ్లు ఎన్ని ఆటలు ఆడాలి? ఎవరికి ఎంత రుసుం లభించాలి? వంటి కీలకమైన విషయాలను తనకి ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయించసాగారు బీసీసీఐ పెద్దలు. ఇక ఐపీఎల్ కూడా మొదలవడంతో ఆటగాళ్లను కేవలం గెలుపు గుర్రాలుగా మార్చి అమ్మకాలు మొదలుపెట్టేశారు.
నానాటికీ పెరిగిపోతున్న బీసీసీఐ నియంతృత్వం మీద ఎట్టకేళకు సుప్రీం కన్నుపడింది. దేశంలో క్రికెట్ మీద అధికారం చెలాయిస్తున్న సంఘాల తీరుని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా నేతృత్వంలో ఓ సంఘాన్ని ఏర్పాటుచేసింది. బీసీసీఐ ఎప్పటిలాగే తన తలపొగరుకి తిరుగులేదన్న భ్రమతో కాలాన్ని గడపసాగింది. సంస్కరణలను రూపొందించే సమయంలో లోధా తనని సంప్రదించలేదంటూ అనురాగ్ ఠాకూర్ దర్పాన్ని ప్రదర్శించారు. కానీ అసలు నిన్ను సంప్రదించాల్సిన ఖర్మేంటంటూ సుప్రీం తలంటడంతో ఆయనకు మొదటిసారిగా శృంగభంగమైంది.
జులై 2016లో సుప్రీం కోర్టు లోధా కమిటీ సూచించిన సంస్కరణలలో చాలా అంశాల పట్ల తన ఆమోదాన్ని తెలియచేసింది. వాటిని నాలుగు నెలలలో అమలు చేయాలంటూ బీసీసీఐని ఆదేశించింది. కానీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని బీసీసీఐ అప్పుడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం అంటూ నానుస్తూ వచ్చింది. పైగా 70 ఏళ్లకు పైబడిని క్రికెట్ సంఘాల నేతలని తొలగించాలనే లోధా సిఫార్సు అమలు సాధ్యం కాదని సన్నాయినొక్కులు మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ సంస్కరణతో శరద్‌పవార్ వంటి జిత్తులమారి వృద్ధ నేతలంతా ఆట మీద చెలాయిస్తున్న అధికారాన్ని వదులుకోక తప్పదు.
అనురాగ్ కుప్పిగంతులను, అహంకారపూరిత వ్యాఖ్యలనూ చూస్తూ వచ్చిన సుప్రీం చివరికి ఆయనను తొలగించి పారేయడంతో బీసీసీఐలో కొత్త శకం ఆరంభమైనట్లుగా భావించవచ్చు. ఇక నుంచి చట్టం కనుసన్నలలోనే బీసీసీఐ ప్రవర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీని వలన భవిష్యత్తులో క్రికెట్‌కు మరింత మేలు జరుగుతుందనే భావిద్దాము. బీసీసీఐలో సుప్రీం జోక్యం కారణంగా మున్ముందు ధనప్రవాహంలో మార్పులు వచ్చినా... అసలైన ఆటగాళ్లకి తగిన గుర్తింపు లభిస్తుందనీ, ఎలాంటి పక్షపాత వైఖరీ లేకుండా, ఆటే తొలి ప్రాధాన్యతగా బీసీసీఐ తీరు సాగుతుందనీ ఆశిద్దాం.