చట్టాలతో అత్యాచారాలు అరికట్టడం సాధ్యమేనా?
posted on Aug 8, 2014 @ 11:47AM
గతేడాది డిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం తరువాత దేశ వ్యాప్తంగా మొదలయిన నిరసనలకు జడిసి అప్పటి యూపీఏ ప్రభుత్వం మహిళా రక్షణ, బాలనేరస్థుల చట్టాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చేతులు దులుపుకొంది. అయితే వాటి వలన దేశంలో అత్యాచారాలు ఆగలేదు, కనీసం తగ్గలేదు కూడా. ఇక నిర్భయ కేసును విచారించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినప్పటికీ నిందితులుగా నిర్ధారించబడిన నులుగురిలో ఏ ఒక్కరికీ ఇంతవరకు కూడా శిక్షలు కూడా పడలేదు. వారిలో ఒకరు బాల నేరస్థుడయిన కారణంగా కేవలం మూడేళ్ళ జైలు శిక్షతో బయటపడబోతున్నాడు. ఇటువంటి హేయమయిన నేరాలకు పాల్పడినవారిని మన న్యాయ వ్యవస్థ తక్షణమే కటినంగా శిక్షించలేని దుస్థితిలో ఉన్నందునే ఆనాటి నుండి దేశంలో మహిళలు, అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. గత మూడు నెలల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సామూహిక అత్యాచారాలు, హత్యలు ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్నితల దించుకొనేలా చేస్తున్నాయి.
అందువల్ల ఇకనయినా ఈ అత్యాచారాలను అరికట్టాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బాలనేరస్థుల చట్టాలకు మరింత పదును పెట్టింది. మొన్న మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో బాలనేరస్థుల వయసును 18 నుండి 16కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. అందువల్ల ఇకపై ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న బాలనేరస్థులను యువకులుగానే పరిగణిస్తూ బాలనేరస్థుల కోర్టులు శిక్షలు విదించవచ్చును. బాలనేరస్థులను శిక్షించే వీలు కల్పిస్తూనే, సమాజంలో బాలలకు రక్షణ కల్పించే విధంగా మోడీ ప్రభుత్వం చట్టంలో కొన్ని సవరణలు చేసింది. బాలల చేత మద్యం, మత్తుమందులు రవాణా, వారిని మానసికంగా, శారీరకంగా వేధించడం వంటి చర్యలను నేరాలుగా గుర్తిస్తూ చట్టంలో సవరణలు చేసారు. అదేవిధంగా దేశంలో పుట్టగొడుగులు మాదిరి వెలుస్తున్న శిశు, బాలల సంక్షేమ కేంద్రాలన్నీ తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద తగిన అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. అనుమతులు లేకుండా నడుస్తున్న అటువంటి కేంద్రాలపై కేసులు నమోదు చేసి చట్టపరకారం చర్యలు తీసుకోబడతాయి.
అయితే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ సమాజం ఆలోచనాధోరణిలో మార్పు రానంత కాలం ఈ అత్యాచారాలు కొనసాగుతూనే ఉంటాయి. అందువలన ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేసి దోషులను శిక్షించడంతోనే సరిపెట్టకుండా, ప్రాధమిక స్థాయి నుండే బాలలలో నైతిక విలువలు పెంపొందించే విధంగా మన విద్యా వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేయాలి. కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్న ఈ విపత్కాలంలో, కనీసం కళాశాలలో ‘నైతిక విలువలను కూడా ఒక సబ్జెక్టుగా భోదిస్తే కనీసం వచ్చే తరం మహిళలకయినా దేశంలో భద్రత ఏర్పడుతుంది.