తాత్కాలిక రాజధాని మంచి నిర్ణయమే!
posted on Aug 12, 2014 @ 10:36PM
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్విత రాజధాని నిర్మించడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు కనుక అంతవరకు విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొన్నారు. వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడ తరలించేందుకు అక్కడ తగిన భవనాలను గుర్తించి సిద్దం చేయమని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల ఐటీ పార్కులో గల మేధా టవర్స్ భవన సముదాయాన్ని కూడా పరిశీలించమని ఆదేశించారు. బహుశః అక్కడ తన కార్యాలయాన్ని, సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారేమో.
అయితే ఎక్కడో రాష్ట్రానికి దూరంగా హైదరాబాదులో ఉండి పరిపాలించడమేమిటి? అని ఇంతవరకు విమర్శించినవారే ఇప్పుడు ప్రభుత్వం విజయవాడకు తరలి వచ్చేందుకు సిద్దమవుతుంటే, తెదేపా నేతలకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ఈ ఆలోచన చేశారని విమర్శిస్తున్నారు. అన్ని సౌకర్యాలుగల హైదరాబాదు నుండి మరో పదేళ్ళపాటు పాలన సాగించే అవకాశం ఉండగా, ఇంత హడావుడిగా విజయవాడకు ఎందుకు తరలివస్తున్నారు? అని కాంగ్రెస్ నేతలు బొత్స, రామచంద్రయ్యలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదనకు ఒక్క రాయలసీమ జిల్లాల ప్రజలు తప్ప వైకాపాతో సహా అందరూ ఆయన నిర్ణయాన్ని సమర్దించారు. ఒకవేళ అక్కడ రాజధాని ఏర్పాటు చేసేమాటయితే, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడికే తరలిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్వయంగా ఇదివరకు చెప్పారు. మరి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారంటే, ప్రభుత్వం తీసుకొన్న ఏ నిర్ణయాన్నయినా విమర్శించడమే ప్రతిపక్ష బాధ్యత, అప్పుడే ప్రజల తరపున పోరాడినట్లవుతుంది అనే ఒక అర్ధంలేని సిద్దాంతాన్ని నమ్మడం వలననే.
చంద్రబాబు విజయవాడ-గుంటూరు మద్యనే రాజధాని ఉంటుందని మొదటి నుండి చెపుతున్నారు. కానీ ఆయన తొందరపాటు ప్రదర్శించకుండా ముందు ప్రభుత్వంపై పూర్తి పట్టు పెంచుకొని, ఆ తరువాత విజయవాడకు తరలివెళ్ళడంలో సాధ్యాసాధ్యాలను, దానిలో కష్టనష్టాలను పూర్తిగా అవగాహన చేసుకొన్న తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నారని భావించవచ్చును. అందుకు ప్రతిపక్షాలు ఎన్ని పెడర్ధాలు, వక్ర బాష్యాలయినా చెప్పుకోవచ్చును. కానీ చంద్రబాబు తను మొదటి నుండి చెప్పిందే చేస్తున్నారని మాత్రం స్పష్టమవుతోంది. ప్రభుత్వం విజయవాడకు తరలిరావడం వలన రాష్ట్రప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. కొత్త రాజధాని నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించుకోవచ్చును. ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ ఇకపై రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ, జిల్లాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించే వీలుంటుంది. ప్రభుత్వం విజయవాడకు తరలివస్తే ఇటువంటివి అనేక ప్రయోజనాలు ఉండవచ్చును. కానీ ప్రభుత్వం హైదరాబాదు నుండి తరలివచ్చేస్తే అక్కడ స్థిరపడ్డ ఆంధ్రప్రజలు తీవ్ర అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. బహుశః అందుకే ఇంతకాలం చంద్రబాబు నాయుడు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉండి ఉండవచ్చును. రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతున్న కొద్దీ నానాటికీ సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవని మొన్న కర్నూలులో జరిగిన ‘లక్ష గొంతుల పొలికేక’ ర్యాలీలు నిరూపించాయి.
ప్రభుత్వం ఎక్కడో అక్కడ త్వరగా స్థిరపడితే కానీ పరిపాలన గాడిన పడదు. సమస్యలు పరిష్కారం కావు. అభివృద్ధి కార్యక్రమాలు మొదలవవు. కనుక ఇప్పటికయినా చంద్రబాబు దైర్యంగా విజయవాడను తాత్కాలికంగానయినా రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమేనని చెప్పవచ్చును.
అయితే రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నాయకుడు ఇష్ట ప్రకారమే జరగదని, అందరూ ఎక్కడ కోరుకొంటే అక్కడే ఏర్పాటవుతుందని, అవసరమయితే దీనిపై లోతుగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్దం అని చంద్రబాబు ఇదివరకోసారి అన్నారు. ఆ ప్రకారం ఆయన అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొని ఉండి ఉంటే, నేడు ఈవిధంగా విమర్శలు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఎందువలనో ఆయన ఆ పనిచేయలేదు.