ఇక కేంద్రంపై పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం సిద్దం?
posted on Aug 9, 2014 @ 10:53AM
హైదరాబాదు పరిధిలో శాంతి భద్రతలపై సర్వాధికారాలు గవర్నరుకు కట్టబెడుతూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్నితెలంగాణా ప్రభుత్వం వ్యతిరేఖించడం సహజమే. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కత్తెర వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. నిజానికి సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ చర్యను అందరూ ఖండించేవారే, కానీ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఈవిధంగా చేయాలని ముందే నిర్ణయం జరిగింది. అదే విషయాన్నీ విభజన బిల్లులో కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఆ బిల్లును ఆంద్ర యంపీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపుడు తెలంగాణా యంపీల మద్దతుతోనే పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ తరువాత ఆ ఖ్యాతిని స్వంతం చేసుకొనేందుకు తెరాస, కాంగ్రెస్ పార్టీలు పోటీలు పడిన విషయం కూడా అందరికీ తెలుసు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు కేవలం ఈ ఒక్క అంశమే కాకుండా, తెలంగాణకు ఇబ్బంది కలిగించే పోలవరం, ఉమ్మడి రాజధాని, ఉన్నత విద్యా సంస్థలలో ఉమ్మడి ప్రవేశాలు, నీరు, విద్యుత్, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు వంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటికీ ఆనాడు తెరాస అభ్యంతరాలు చెప్పినప్పటికీ, ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చాలన్నట్లు వ్యవహరించడంతో, బిల్లులో పేర్కొన్న విధంగానే రాష్ట్ర విభజన జరిగింది. ఆ షరతులతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వం చాలా ఘనంగా తెలంగాణా సంబురాలు నిర్వహించింది కూడా. అంటే ఆ బిల్లును తెరాస యధాతధంగా అంగీకరిస్తున్నట్లేనని భావించక తప్పదు. కానీ తెరాస తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిల్లులో ఉన్న ఈ ఇబ్బందికరమయిన అంశాలను వ్యతిరేఖించడం మొదలుపెట్టింది. తత్ఫలితంగా అటు కేంద్రంతో ఇటు పొరుగునున్న ఆంద్రప్రభుత్వంతో ఘర్షణ తప్పడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం, ఆంద్ర ప్రభుత్వాలే రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ తమ హక్కులను కబళించే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణా ప్రభుత్వ వాదన.
విభజన బిల్లులో పేర్కొన్న అనేక అంశాల పట్ల తెరాస మొదటే గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసి, వాటిని తనకు అనుకూలంగా సవరించిన తరువాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి ఉండి ఉంటే నేడు ఇటువంటి సమస్యలు తలెత్తేవి కావు. ఇక గవర్నరుకు హైదరాబాదు పరిధిలో శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థపై సర్వాధికారాలు కట్టబెట్టడాన్ని తాము అంగీకరించబోమని తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదనల వలన సాధించేదేమీ ఉండబోదు.
ఇప్పటికే విభజన బిల్లులో పేర్కొన్న అనేక అంశాలతో విభేదిస్తూ తీసుకొన్న నిర్ణయాల వలన హైకోర్టు, సుప్రీం కోర్టులలో తెలంగాణా ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. పార్లమెంటు ఆమోదించిన విభజన బిల్లులో పేర్కొనబడిన ఈ అంశంపై కూడా తెలంగాణా ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్దమయితే ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చును. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో కేంద్రం వేలు పెట్టడం ఎవరూ సమర్దించరు. కానీ, చట్టబద్దంగా చేసిన విభజన బిల్లులో వేలు పెట్టడాన్ని కూడా ఎవరూ సమర్దించబోరనే సంగతి గ్రహించి తదనుగుణంగా వ్యవహరిస్తే ఏ సమస్యలు ఉండవు.