కలెక్టర్ల సదస్సుకు ఇంత ఆర్భాటం అవసరమా?
posted on Aug 7, 2014 @ 9:42AM
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో 13 జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో ఒక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ప్రధానోదేశ్యం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న ఏడు రంగాలపై లోతుగా చర్చించి, వాటి అభివృద్ధికి అవసరమయిన కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవడం. వ్యవసాయం, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, పర్యాటక, మానవవనరుల అభివృద్ధి, స్కిల్ డెవెలప్మెంట్, పారిశ్రామికాభివృద్ధి మరియు సంక్షేమ పధకాల అమలు వగైరా అంశాలపై ఈ సదస్సులో చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఉన్నతాధికారులు అందరూ పాల్గొంటున్న ఈ సదస్సులో అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ ప్రసంగించిన తరువాత వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు తమ శాఖలు చేప్పట్టిన, చేప్పట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పవర్ పాయింటు ప్రజంటేషన్ ఇస్తారు.
కీలకమయిన ఈ సదస్సును విజయవాడలో నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువలోనే ఉందనే సంకేతం పంపడం ఒక ఉద్దేశ్యం అయితే, నేటికీ చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు-విజయవాడ వద్దనే రాజధాని నిర్మించాలని భావిస్తునట్లు అర్ధమవుతోంది.
తీవ్ర ఆర్ధిక సమస్యలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం సరిగ్గా వారం రోజుల క్రితమే అన్ని ప్రభుత్వ శాఖలు తక్షణమే పొదుపు చర్యలు పాటించాలని ఆదేశిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అందువల్ల ఈ సదస్సు కూడా చాలా నిరాడంబరంగా నిర్వహించవచ్చని ఎవరయినా భావిస్తారు. కానీ ప్రభుత్వం చాలా అట్టహాసంగా నగరంలో ఉన్న ‘తాజ్ గెట్ వే’ స్టార్ హోటల్లో ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుండి వస్తున్న వీఐపీల కోసం నగరంలో ఉన్న మురళి ఫార్ట్యూన్, డీవీ మెనోర్, మినర్వా, ఐలాపురం వంటి స్టార్ హోటల్స్ లో ప్రత్యేక గదులు బుక్ చేసారు. వారందరి కోసం ప్రభుత్వం దాదాపు 500 వాహనాలను కూడా సిద్దంగా ఉంచింది. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఒకేసారి విజయవాడ తరలివస్తున్నారు కనుక సహజంగానే అందుకు తగ్గట్లు భారీ పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు, వాటి వలన నగరవాసులకు అవస్థలు తప్పవు. ఈవిధంగా ప్రభుత్వం తను స్వయంగా జారీ చేసిన పొదుపు మార్గదర్శకాలను తనే స్వయంగా తుంగలో తొక్కి ఇంత అట్టహాసంగా సదస్సు నిర్వహించడం వలన తన ఆదేశాలకు తనే విలువ లేకుండా చేసుకొంది.
ప్రభుత్వమే స్వయంగా ఇంత అట్టహాసంగా సదస్సు నిర్వహిస్తున్నందున, ఇక క్రింద స్థాయి అధికారులను, ఉద్యోగులను పొదుపు పాటించమని చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు సచివాలయంలో హుండీలు ఏర్పాటు చేసుకొనే దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఈవిధంగా ప్రతీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వాహించడం దేనికో పాలకులకే తెలియాలి. ఇంత అట్టహాసంగా నిర్వహించిన సదస్సు వలన పరిపాలనలో కానీ ప్రభుత్వ పనితీరులో గానీ గొప్ప మార్పులు వచ్చి వాటి వలన ప్రజలకు ఏమయినా మేలు జరుగుతుందో లేక ఇది కూడా మరొక నిరుపయోగమయిన సదస్సుగా మిగిలిపోతుందో చూడాలి. ప్రభుత్వోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా వెతుక్కోవలసిన పరిస్థితి ఉందని నిత్యం చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత భారీ ఖర్చుతో ఇంత ఆర్భాటంగా ఈ సదస్సు నిర్వహించడం సహజంగానే విమర్శలకు తావిచ్చేదిగా ఉంది.