కేంద్రంపై పోరాటంలో తెలంగాణా ప్రభుత్వానికి భంగపాటు తప్పదా?
posted on Aug 11, 2014 9:13AM
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలపాలంటే దానిలో కొన్ని సవరణలు చేయాలని ఆనాడు బీజేపీ పట్టుపట్టింది. కానీ నాటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కొన్ని హామీలు ఇవ్వడంతో ఆ బిల్లులో ఎటువంటి సవరణలు చేయకుండానే పార్లమెంటు ఆమోదం పొందేందుకు బీజేపీ మద్దతు ఇచ్చి సహకరించింది. అయితే ఆ సంగతి మరిచిపోయి హైదరాబాదు పరిధిలో గవర్నరుకు అధికారాలు కట్టబెడుతూ తెలంగాణా ప్రభుత్వానికి ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలుకు అదే ప్రధాన అవరోధం కానుందని, కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావాలంటే లోపభూయిష్టమయిన రాష్ట్ర విభజన బిల్లులో సవరణలు చేయక తప్పదని మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు యస్. సుదర్శన్ రెడ్డి మరియు యన్. సంతోష్ హెగ్డేలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం కేంద్రప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేసి స్టే పొందే వీలుంటుందని వారు స్పష్టం చేసారు.
అందువల్ల పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే కేంద్రప్రభుత్వం విభజన బిల్లుకు సవరణలు చేయవలసి ఉంటుంది. లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న ఎన్డీయే కూటమికి అదేమీ పెద్ద కష్టమయిన పని కాదు. అదేవిధంగా ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత బలం లేకపోయినప్పటికీ, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ అండతో పోలవరం బిల్లును గట్తెక్కించినట్లే, అక్కడ కూడా ఈ సవరణలను ఆమోదింపజేయడం పెద్ద కష్టమయిన పనేమీ కాదు. అందువల్ల ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈవిషయంలో దానికి అక్కడా చుక్కెదురు కావచ్చును.
ఇక గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని పార్లమెంటులో నిరసించాలని కేసీఆర్ తన పార్టీ యంపీలను కోరారు. కానీ దానివలన సభ స్తంభింపజేయడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండబోదని గతంలో పోలవరం వ్యవహారంలో రుజువయింది. తెరాస యంపీలు పార్లమెంటులో ఎంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అవసరమయితే కాంగ్రెస్, బీజేపీలు కలిసి విభజన బిల్లుకు సవరణలు చేయవచ్చును.
ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, వారి మద్దతుతో ఈ అంశంపై కేంద్రంతో పోరాడాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే మళ్ళీ అక్కడ కూడా తెలంగాణా ప్రభుత్వానికి ఇంచుమించు అటువంటి అనుభవమే ఎదురు కావచ్చును. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఆయన సమావేశానికి హాజరుకారు గనుక ఇక మిగిలినవారిలో ఎంతమంది ఆయన సమావేశాని వస్తారనేది ప్రశ్నే. ఎందువలన అంటే అనేక చిన్నా పెద్ద రాష్ట్రాలు తమ రాష్ట్రాభివృద్ధికి, వివిధ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రం సహాయసహకారాలు ఆశిస్తున్నాయి. అటువంటప్పుడు తమకు సంబందంలేని తెలంగాణా సమస్యలో తలదూర్చి, కేసీఆర్ మాటలకు తలొగ్గి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతాయని భావించలేము. ఒకవేళ నాలుగైదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ తో కలిసి వచ్చినా, వారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీయడం అసంభవమని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు.
కేసీఆర్ ఈ అంశాన్ని ఏవిధంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారో, కేంద్రప్రభుత్వం కూడా తను జారీ చేసిన ఉత్తర్వులు అమలును అంతే ప్రతిష్టాత్మకంగా భావించడం సహజం. కనుక తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో, పార్లమెంటులో, చివరికి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా భంగపాటు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.