రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్దమే, కానీ..
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం గుర్తించిన తూళ్ళూరు మండలంలో గల నేలపాడు, లింగాయపాలెం, దొండపాడు, శాఖమూరి, రాయపాడు, వెంకటపాలెం తదితర గ్రామాలలో రైతులు ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఈయబోమని తెగేసి చెప్పినట్లు ఒక ప్రభుత్వ వ్యతిరేఖ మీడియా పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. కానీ ఈరోజు తూళ్ళూరు గ్రామంలో మరొక ప్రముఖ తెలుగు ఛానల్ నిర్వహించిన పబ్లిక్ పాయింట్ కార్యక్రమంలో మాట్లాడిన రైతులందరూ ఆ వార్తలను ముక్తకంటంతో ఖండించారు. ఇంతవరకు ఏ మీడియాకు చెందిన ప్రతినిధులు తమ గ్రామానికి రాలేదని చివరికి తమ శాసనసభ్యుడు, మంత్రులయినా ఇంతవరకు గ్రామానికి రాలేదని, అటువంటప్పుడు తాము భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని వార్తలు వ్రాయడం ఏమిటని వారు ప్రశ్నించారు. అయితే ఒకసారి ఆర్డీఓలు, యం.ఆర్.ఓ. తదితర అధికారులు మాత్రం కొన్ని గ్రామాలలో పర్యటించి భూసేకరణ గురించి క్లుప్తంగా వివరించి, తమ డిమాండ్లను అడిగి తెలుసుకొన్నారని తెలిపారు. కానీ వారు తమకు ల్యాండ్ పూలింగ్-దాని విధివిధానాల గురించి కానీ, ప్రభుత్వం ఇవ్వబోయే ప్యాకేజి గురించి గానీ ఎటువంటి అవగాహన కల్పించలేదని,అందువల్లే రైతులలో భయాందోళనలు చెందుతున్నారని అన్నారు.
స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీలకు చెందినవారు వారి భయాందోళనలు మరింత పెరిగేలా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. చాలా గ్రామాలలో రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఈ వ్యతిరేఖ ప్రచారం వలన, అవగాహన లోపం వలననే భయాందోళనలకు గురయ్యి, పూర్తిగా నష్టపోతామేమోననే భయంతోనే తమ భూములను నష్టానికి అమ్మేసుకొంటున్నారని మరి కొందరు రైతులు విచారం వ్యక్తం చేసారు.
తమ భూముల గురించి మీడియా హైదరాబాదులో కూర్చొని వార్తలు ప్రచురించడాన్ని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడాన్ని రైతులు తప్పుపట్టారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని వారు కోరారు. లేదా ఈ 14గ్రామాల ప్రతినిధులను ఆయనతో హైదరాబాద్ లోనే సమావేశపరచాలని వారు డిమాండ్ చేసారు.
ఒకవేళ అది సాధ్యం కాకపోతే స్థానిక యం.యల్యే. మంత్రి స్వయంగా అన్ని గ్రామాలలో పర్యటించి రైతుల డిమాండ్లు తెలుసుకొని, ఈ ల్యాండ్ పూలింగ్ విధివిధానాల గురించి, ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న ప్యాకేజీ గురించి రైతులకు సరయిన అవగాహన కల్పించి వారికి భరోసా ఇచ్చినట్లయితే, రైతులు కూడా సంతోషంగా తమ భూములను ఇచ్చేందుకు అంగీకరిస్తారని చెప్పారు. ముందుగా అధికారులు, మంత్రులు క్షేత్ర పర్యటనకు వచ్చి రైతులతో నేరుగా మాట్లాడితే ఇటువంటి గందరగోళాన్ని నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక ఈరోజు మీడియాతో మాట్లాడిన తూళ్ళూరు మండల రైతులు తమ డిమాండ్లను, కొన్ని ఆసక్తికరమయిన విషయాలను మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసారు. అవేమిటంటే:
1. ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించేటప్పుడు పంటభూముల ప్రస్తుత మార్కెట్ రేట్లను, అందులో పండుతున్న పంటల వలన వస్తున్న రాబడిని, ప్రస్తుతం భూమి ఉన్న గ్రామం, ప్రదేశం, వాటికి గల లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ సౌకర్యాలు వంటివి అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని అందుకు తగినట్లుగా ప్యాకేజి ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
2. మంచి దిగుబడి, కౌలు రాబడి వచ్చే పంట భూములకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరుతున్నారు. అటువంటి పొలాలు, దిగుబడి ఉన్న రైతులకు అధిక ధరలు చెల్లించితే ఇతర రైతులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోమని అన్నారు.
3. బంగారం, భూములను బ్యాంకులలో తనఖా పెట్టుకొని ఏవిధంగా తాము బ్యాంకుల నుండి రుణాలు పొందగాలుగుతున్నామో అదేవిధంగా ప్రభుత్వానికి తాము ఇచ్చిన భూమికి ప్రతిగా ప్రభుత్వం తమకు ఇచ్చే భూమిపై రుణాలు పొందేందుకు వీలుగా దాని విలువను నిర్దారిస్తూ తమకు ప్రభుత్వం ‘హక్కు పత్రాలు’ తప్పనిసరిగా ఇవ్వాలని, వాటిని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు గౌరవించి రుణాలు మంజూరు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తద్వారా తమ భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తరువాత, పిల్లల పై చదువులకి, పెళ్ళిళ్ళులకు ఇతర అవసరాలకు ఎవరి ముందు చేతులు జాచే దుస్థితి కలగకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
4. ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకోవడానికి చూపుతున్న ఉత్సాహం, రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా చూపితే బాగుంటుందని వారు అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా తాము ఏ ప్రాంతంలో భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసామో, రాజధాని నిర్మించిన తరువాత తిరిగి అదే ప్రాంతంలో కనీసం ఎకరానికి 200గజాల కమర్షియల్ స్థలం కేటాయించాలని, సమీప ప్రాంతాలలోనే మరో వెయ్యి గజాలు కేటాయించాలని కోరారు.
5. అదేవిధంగా ప్రస్తుతం ఎకరానికి దాదాపు రూ.70,000 నుండి 1,00,000 వరకు ఆదాయం వస్తున్న పంట భూములకు ప్రభుత్వం కేవలం ఎకరానికి రూ.25, 000 మాత్రమే ఇస్తే తాము ఏవిధంగా కుటుంబాలను పోషించుకోగాలము? ఏవిధంగా పిల్లల పై చదువులు, పెళ్ళిళ్ళు చేసుకోగలము? తీవ్ర అనారోగ్యం ఏర్పడితే ఏవిధంగా ఖర్చులను తట్టుకోగాలము? అని వారు ప్రశ్నించారు. కనుక నష్టపరిహారం గురించి ప్రభుత్వం రైతులతో చర్చించిన తరువాతనే తన నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు.
6. కేవలం పెద్ద రైతులనే కాక, చిన్నకారు సన్నకారు రైతులను, వ్యవసాయ కూలీలను, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న గ్రామీణులను, చేతి వృత్తుల పనివారి శ్రేయస్సు గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరారు.
7. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిన్చినట్లయితే తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసారు. దేశ, విదేశాలలో పై చదువులు చదువుకొంటున్న, స్థిరపడిన తమ పిల్లలు కూడా రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమిని ఇమ్మనే తమను గట్టిగా కోరుతున్నారని, దాని వలన అందరికీ లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నట్లు రైతులు, గ్రామస్తులు తెలిపారు.
8. తూళ్ళూరు మండలంలో గల 14 గ్రామాలలో తొమ్మిది గ్రామాల రైతులు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి తమ భూములు అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని, మిగిలిన 5గ్రామాల ప్రజలలో నెలకొన్న ఈ సందేహాలను, భయాందోళలను తొలగించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసినట్లయితే మొత్తం 22, 600 ఎకరాల వరకు భూమి లభిస్తుందని వారు తెలిపారు.