కాంగ్రెస్, వైకాపాలకు ఆయుధంగా అందివచ్చిన రుణమాఫీ
posted on Aug 6, 2014 @ 9:55AM
వ్యవసాయ రుణాలను రీ షెడ్యూల్ చేయడం కుదరదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాఘురామ రాజన్ విస్పష్టంగా ప్రకటించారు. బ్యాంకులు మరియు వివిధ సంస్థల నుండి తాము సేకరించిన నివేదికల ప్రకారం ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు పేర్కొన్నట్లు రుణాలను రీ షెడ్యూల్ చేయవలసిన పరిస్తితులేవీ తమకు కనబడలేదని, ఒకవేళ రీ షెడ్యుల్ చేసినట్లయితే అది రైతులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని అందువలన రీ షెడ్యుల్ చేయదలచుకోలేదని గవర్నర్ రాజన్ ప్రకటించారు. కానీ ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు రుణాల మాఫీపై ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితిలో లేనందున అవి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాతో పోలిస్తే కొంచెం తక్కువ రుణభారం, మిగులు బడ్జెటు ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఒకేసారి రూ.10, 000 కోట్లు బ్యాంకులకు చెల్లించి మిగిలిన మొత్తాన్ని రెండు లేదా మూడు వాయిదాలలో చెల్లించాలని భావిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోటు బడ్జెటుతో బాటు మూడింతల ఋణ భారం, ఈ అంశంపై గట్టిగా నిలదీసేందుకు బలమయిన ప్రతిపక్షం కూడా ఉంది. అందువల్ల ఈ సమస్య మరింత జటిలంగా మారింది. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క అవినీతిలో తప్ప మిగిలిన అన్ని రంగాలలో అభివృద్ధి కుంటు పడింది. అందువల్ల మళ్ళీ పరిపాలన గాడిన పడి, అభివృద్ధి జరిగేంతవరకు ప్రభుత్వం ఈ ఆర్దికలోటును పూడ్చుకోవడం అసాధ్యం.
ఇక ఈ రుణమాఫీ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ది పొందుదామని చూస్తున్న ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మరొక సమస్య సృష్టించేందుకు సిద్దంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన వల్ల కోలుకోలేని విధంగా గట్టి దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ, అహంకారంతో, అతి విశ్వాసంతో అధికారాన్ని చేజార్చుకొని బాధపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఈ వ్యవసాయ రుణాల వ్యవహారం, మళ్ళీ రాజకీయంగా నిలద్రొక్కుకొనేందుకు మంచి ఆయుధంగా అందిరావడంతో, రెండు పార్టీలు తీవ్ర ఆందోళనతో ఉన్న రైతులను కలుపుకొని ఉద్యమించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఒకవేళ రైతులు కూడా వాటితో కలిసి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టినట్లయితే, ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం తధ్యం.
ఇక ఈనెల 18నుండి రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. కనుక ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలలో గెలిచిన తరువాత విజయోత్సాహంతో ఉరకలు వేసిన తెదేపా ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవహారం వలన ఆత్మరక్షణలో పడినట్లయింది. మరొక రెండు నెలలలో ఈ రుణమాఫీ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రతిప్పాటి పుల్లారావు చెప్పడం, రైతులలో చాలా ఆందోళన రేకెత్తిస్తుంటే, కాంగ్రెస్, వైకాపాలకు అది మరొక ఆయుధంగా అందివచ్చింది. రైతుల ఆందోళనను ప్రతిపక్షాలు తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేయడం తధ్యం.
అందువల్ల ప్రభుత్వం తను ఎంచుకొన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సమస్య నుండి వీలయినంత త్వరగా బయటపడే ప్రయత్నం చేయడమే అన్ని విధాల మంచిది. లేకపోతే ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది.