ఆంద్ర, తెలంగాణా వివాదాలకు డిల్లీలోనే పరిష్కారం

  తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావలసిన జలాలను కేటాయించవలసిందిగా కృష్ణా ట్రిబ్యునల్ ను ఆదేశించమని కోరుతూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో నిన్న ఒక కోర్టులో పిటిషను వేసింది. ఆంద్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, నాలుగు వారాలలో దీనిపై స్పందించాల్సిందిగా ఆదేశించి ఈ కేసును ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా వేసింది.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వంపై పిర్యాదు చేస్తూ కేంద్రానికి ఒక లేఖ వ్రాసింది. కృష్ణాబోర్డు మరియు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందకుండా, కనీసం వాటికి తెలియజేయకుండా తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నదిపై జూరాల-పాకాల మరియు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్దం అవుతోందని, ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేయడానికి తెలంగాణా ప్రభుత్వం తన బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించిందని పేర్కొంటూ, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని దారిలో పెట్టేందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాసింది.   నీళ్ళు, విద్యుత్, ఉమ్మడి పరీక్షలు వంటి వివిధ అంశాలలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిత్యం జరుగుతున్న యుద్దాలను పరిష్కరించలేక చేతులెత్తేసిన గవర్నర్ నరసింహన్ కూడా నిన్న డిల్లీ వెళ్ళారు. అక్కడ సంబంధిత కేంద్ర మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి వారికి ఈ వివాదాల గురించి వివరించనున్నారు.   ఈ సమస్యలన్నిటినీ చర్చల ద్వారా రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఇరు ప్రభుత్వాలు పంతాలకు, పట్టింపులకీ పోతుండటంతో ఇప్పుడు మళ్ళీ డిల్లీలో పంచాయితీ అనివార్యమయింది. ఈ సమస్యలన్నిటినీ కారణం గత ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన చేయడమే. ఇటువంటి సమస్యలు వస్తాయని దానికి తెలియదని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే స్వయంగా ఆ పార్టీకే చెందిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీటన్నిటి గురించి యూపీఏ ప్రభుత్వాన్ని, దాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని పదేపదే హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తే కలిగే తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించుకొంది గానీ ఆయన హెచ్చరికలను పట్టించుకోలేదు.   అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య ఈ నీళ్ళ పంపకాలపై వివాదాలు వస్తాయని చేసిన వాదనలను తెరాస అధినేత కేసీఆర్ కూడా చాలా తేలికగా కొట్టి పడేశారు. చైనా, పాకిస్తాన్ దేశాలతోనే భారత్ నదీ జలాలు పంచుకోగలుగుతున్నప్పుడు, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలు పంచుకోలేవా? అని చాల తెలివిగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో నీళ్ళ పంపకాలపై కేసు వేసింది.   అందువలన ఈ సమస్యలన్నీ ఇక రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పరిష్కారం కావని అర్ధమవుతున్నాయి. కనుక ఇక సుప్రీంకోర్టు మరియు కేంద్రప్రభుత్వమే అంతిమ నిర్ణయాలు తీసుకొని వాటిని యధాతధంగా, ఖచ్చితంగా అమలుచేయవలసిందిగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడమే ఏకైక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. అయితే అప్పుడు కూడా ఒకవేళ తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఏవయినా నిర్ణయాలు తీసుకొంటే దానిపై కూడా మళ్ళీ పార్లమెంటులో రభస జరిగే అవకాశం ఉంది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి నిత్యం కత్తులు దూసుకోవడం కంటే అదే కొంత నయం కనుక డిల్లీలోనే ఈ వ్యవహరాలన్నిటిపై అంతిమ నిర్ణయాలు తీసుకోవడం మేలని చెప్పవచ్చును.

ఉనికి కోసం ప్రజా సమస్యల పేరిట ప్రతిపక్షాల పోరాటాలు

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని పునాదుల నుండి నిర్మించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇంతకాలం దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఇప్పుడు రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏర్పడింది. అందుకు ఆంధ్రప్రజలు ఎంతగా బాధపడుతున్నారో తెలుసు. రాష్ట్రం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అత్యవసరంగా రాజధాని నిర్మాణం చేయవలసి రావడం మరో పెద్ద సవాలు. ఇవి కాక హుద్ హూద్ వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాలలో ఉన్నతెలుగు ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి ఉడతా భక్తిగా తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సినీ పరిశ్రమ కూడా ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చింది. సింగపూర్, జపాన్ వంటి దేశాలు సైతం రాజధాని నిర్మాణానికి, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీలయినా కాంగ్రెస్ , వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, అది తలపెట్టిన ప్రతీ పనికి అడ్డం పడుతుండటం చాలా దురదృష్టకరం. రాజధాని భూముల సమీకరణ మొదలు హుద్ హుద్ తుఫాను వరకు దేనిని విడిచిపెట్టకుండా ప్రతీ అంశం నుండి రాజకీయ మైలేజీ పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.   తమిళనాడులో ప్రధాన పార్టీలయిన డీఎంకే, అధికార అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎంత రాజకీయ విభేదాలున్నప్పటికీ, నిత్యం ఒకరిపై మరొకటి ఎంతగా కత్తులు దూసుకొంటునప్పటికీ, శ్రీలంక జాలర్ల సమస్య, శ్రీ లంక తమిళుల సమస్య, హిందీ బాష వంటి అనేక అంశాలలో ఆ రెంటితో సహా రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, వై. కాంగ్రెస్ పార్టీలు మాత్రం ప్రభుత్వానికి ప్రతీ పనిలో అడ్డంకులు కల్పించడమే కాదు, రాష్ట్రంలో పొరుగు రాష్ట్రపు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో యుద్దాలు చేస్తుంటాయి.   సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని, రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కేవలం తమ ఉనికిని కాపాడుకొనేందుకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తుండటం చాలా విచారకరం. కానీ తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే అవి ప్రజాగ్రహానికి గురయ్యి తమ ఉనికిని కోల్పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.   రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చెప్పుకొనే ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నప్పటికీ, ఇటువంటి సవాళ్ళను, సంక్షోభాలను ధీటుగా ఎదుర్కొని వాటి నుండి అవకాశాలను సృష్టించుకొనే సత్తా తనకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విశేషం. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినప్పటికీ, తను చేస్తున్న ప్రయత్నాల కారణంగా దేశవిదేశాలు సహాయం చేసేందుకు ముందుకు వస్తుండటమే అందుకు మంచి ఉదాహరణ అని ఆయన నిన్న మేము సైతం కార్యక్రమంలో ప్రసంగిస్తున్నప్పుడు చెప్పారు.   రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం మేము మాత్రం మారబోమని తేల్చి చెపుతున్నాయి. హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు తరలివచ్చి వారం రోజులపాటు స్వయంగా తుఫాను సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి, విశాఖ ప్రజల మన్ననలు అందుకొంటుంటే, హూద్ హూద్ తుఫాను కోసం కేంద్రం ఇచ్చిన నాలుగు వందల కోట్ల రూపాయలను ఆయన జేబులో పడేసుకొన్నారని వైకాపా ఆరోపించడం చాలా దారుణం. కేంద్రప్రభుత్వం ఇచ్చిన డబ్బుకు  రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లెక్క అప్పజెప్పనవసరం లేదని వైకాపా ఏవిధంగా అనుకొంటోందో దానికే తెలియాలి.   ఇటువంటి ఆరోపణలు, స్వీయ మనుగడ కోసం ప్రజా సమస్యల పేరిట అభివృద్ధికి అవరోధాలు కల్పించడం వలన ప్రజలలో అవి మరింత చులకన అవడం తప్ప ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరదని గ్రహిస్తే మేలు. లేకుంటే మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో వాటికీ అటువంటి గుణపాటమే నేర్పడం తధ్యం.

స్వర్గీయ యన్టీఆర్ పేరుపై ఇంత రభస అవసరమా?

  శంషాబాద్ విమానాశ్రయంలో జాతీయ టెర్మినల్ కి స్వర్గీయ యన్టీఆర్ పేరు పెట్టడంపై పార్లమెంటులో కాంగ్రెస్, తెరాస మరి కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన యంపీలు తీవ్ర అభ్యంతరం చెపుతూ, కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ఆంధ్రాకు చెందిన యన్టీఆర్ పేరును తెలంగాణా రాష్ట్రానికి చెందిన విమానాశ్రయానికి పెట్టడం అంటే అది తమపై పెత్తనం చెలాయించడమేనని వారి వాదన. ఆ విధంగా చేసి తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ కూడా దీనిని వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రాలో ఇప్పుడు ఉన్న విమానశ్రయాలకో లేకపోతే ఇక ముందు కట్టబోయే అంతర్జాతీయ విమానాశ్రయాలకో ఆయన పేరు పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. అయితే   ఈరోజు తమ ప్రజల మనోభావాలు దెబ్బ తింటున్నాయని వాదిస్తున్నవారే ఒకప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాది ఆంద్ర రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు అవన్నీ భూటకపు ఉద్యమాలని వారిని పట్టించుకొనవసరం లేదని వాదించారు. అప్పుడు వారు ఆంధ్ర ప్రజల మనోభావాలు, ఆందోళనలు అంతా భూటకమని చాలా తేలికగా తీసిపడేసారు. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఏ ఒక్కరు ముందుకు వచ్చి అభ్యంతరం చెప్పకపోయినా వారి మనోభావాలు దెబ్బ తినేస్తున్నాయని వీరే కనిపెట్టి చెప్పేస్తున్నారు.   ఇక ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. అప్పుడు అది నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాదని వీ. హనుమంత రావు, కే.కేశవ రావు పెద్దలు అందరూ బల్లగుద్ది వాదించారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రం కేంద్రం గౌరవించాలని వాదించడం విడ్డూరం.   ఇక మన రాష్ట్రానికి చెందని మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరుపెట్టుకోవడానికి వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. బోఫర్స్ కుంభకోణంలో నిందితుడిగా పేర్కొనబడినప్పటికీ వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని నిలబెట్టిన ఒక అచ్చమయిన తెలుగువాడు స్వర్గీయ యన్టీఆర్ పేరు పెట్టేందుకు మాత్రం వారికి చాలా అభ్యంతరాలున్నాయి. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు బాష కోసం అహరహం తపించిన వ్యక్తి వారికి ఆంధ్రాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాత్రమే కనబడుతున్నారు.   ఈవిధంగా ఒకరొకరిని ఏరుకొంటూ, పంచుకొంటూపోతే చివరికి మిగిలేదెవరు? మహనీయులకు, స్వాతంత్ర సమరయోధులకు, చివరికి దేవుళ్ళకూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు అంటగట్టి వారిని కూడా పంచుకొనే దుస్థితికి చేరుకొన్నందుకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.   రాష్ట్ర విభజనలో ఒకవైపు తమ అధిష్టానానికి సహకరిస్తూనే మరోవైపు ఆంద్ర ప్రజలను చివరి నిమిషం వరకు మభ్యపెట్టిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేతలు మరో క్షమార్హం కాని తప్పు మళ్ళీ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యులయిన చిరంజీవి, కావూరి సాంబశివరావు, జెడి శీలం, కే.వి.పి. రామచంద్రరావు తదితర కాంగ్రెస్ యంపీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన వారయినప్పటికీ, వారు కూడా తెలంగాణా యంపీలతో కలిసి దేశీయ టెర్మినల్ కు యన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సభలో హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగం నుండే వచ్చిన చిరంజీవి కూడా యన్టీఆర్ పేరును వ్యతిరేకించడం చాలా దారుణం. యన్టీఆర్ కు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రజలు కోరుకొంటుంటే, చిరంజీవి మాత్రం విమానాశ్రయానికి కూడా ఆయన పేరు పెట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేయడం చాలా విచారకరం. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ వారి తీరు మారలేదని దీనిని బట్టి అర్ధమవుతోంది.  

భారత్ క్రికెట్ కి మచ్చ తెచ్చిన మామా అల్లుళ్ళు

  యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బి.సి.సి.ఐ.)కి ఐ.పి.యల్. మ్యాచులు ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అంతకంటే ఎక్కువ అపకీర్తిని కూడా మూటగట్టి ఇచ్చాయి. అందుకు ప్రధానంగా నిందించవలసిన వ్యక్తులు ఇద్దరే. ఇంతకాలం బి.సి.సి.ఐ.కి చైర్మన్ గా ఉన్న యన్. శ్రీనివాసన్ ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్. వారిరువురు కలిసి బి.సి.సి.ఐ. మరియు ఐ.పి.యల్. ఫ్రాంచైజీల మధ్య ఉన్న సన్నటి గీతను చెరిపివేసి, ఆ రెండూ ఒక్కటేననే విధంగా వ్యవహరించడంతో ఐ.పి.యల్.-6 సిరీస్ మ్యాచులలోజరిగిన స్పాట్-ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ వ్యవహారాల వలన బి.సి.సి.ఐ.కి చెడ్డ పేరు వచ్చింది.   బి.సి.సి.ఐ. చైర్మన్ గా కొనసాగుతున్న శ్రీనివాసన్ తన అల్లుడితో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ టీంలో భాగస్తుడిగా మారడాన్ని ఈరోజు సుప్రీం కోర్టు తప్పు పట్టేవరకు కూడా ఎవరూ తప్పుగా భావించకపోవడం చేతనే వారిరువురూ ఇంతగా రెచ్చిపోగలిగారు. అందుకే ఈరోజు జస్టిస్ ముద్గల్ కమిటీ నివేదికపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బి.సి.సి.ఐ., దాని మాజీ చైర్మన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురునాథ్ మేయప్పాన్ బి.సి.సి.ఐ.లో ఒక అంతర్గత బేరగాడుగా వ్యవహరిస్తుంటే, అతనిని నియంత్రించవలసిన శ్రీనివాసన్ నిమ్మకుండిపోయి తన బాధ్యతలను విస్మరించారని కోర్టు అభిప్రాయపడింది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వరించడంలో విఫలమయినందున శ్రీనివాసన్ను బి.సి.సి.ఐ.బోర్డు ఎన్నికలకు దూరంగా ఉండమని కోర్టు హెచ్చరించింది.   అంతే కాదు చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు ఎవరెవరో, దానిలో ఎవరెవరికి ఎంత వాటాలున్నాయో, శ్రీనివాసన్ కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థకు- చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు-ఆ మామా అల్లుళ్ళకీ మధ్య ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరిగాయో అన్నీ బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది. ఇక ఎటువంటి తదుపరి విచారణ చేయకుండా వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను రద్దు చేయమని ఆదేశించింది. ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా దోషు లందరిపై కటిన చర్యలు తీసుకోవలసిందిగా కోర్టు బి.సి.సి.ఐ.ని ఆదేశించింది. ఇకపై బి.సి.సి.ఐ.లో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరుగకుండా అవసరమయిన అన్ని చర్యలను తక్షణమే చేప్పట్టవలసింది కోర్టు ఆదేశించింది.   క్రికెట్ ఆటను ఒకమతంగా భావించే మనదేశంలో దానిని పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు దానికి మరింత మెరుగులు దిద్దుతూ, దేశంలో ఆ క్రీడను, ఆటగాళ్లను తయారుచేసుకోవలసిన బి.సి.సి.ఐ.బోర్డులో కనీసం బ్యాటు పట్టుకోవడం ఎలాగో కూడా చేతకాని రాజకీయనాయకులు, వారి ప్రాపకంతో అధికారం చేపడుతున్న శ్రీనివాసన్ వంటి అసమర్ధులు, అవినీతిపరులు, వారి వెనుకనే పరాన్నజీవుల వంటి గురునాథ్ మేయప్పన్ వంటి వారందరూ చేరి, బోర్డును చెదపురుగుల్లా తొలిచివేస్తుంటే కోట్లాది క్రికెట్ అభిమానులు నిస్సహాయంగా చూస్తుండి పోవలసివచ్చింది. కానీ విచిత్రమేమిటంటే మళ్ళీ ఆ గురునాద్ మేయప్పన్ చేసిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ నిర్వాకంవల్లనే, నేడు సుప్రీంకోర్టు కలుగజేసుకొని పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేసే అవకాశం కలగడం. క్రికెట్ ఆటను పర్యవేక్షిస్తున్న బి.సి.సి.ఐ. బోర్డులో బ్యాటు బాలు పట్టుకొని మైదానంలో క్రికెట్ ఆడిన వారికే చోటు కల్పించాలి తప్ప సిమెంట్ కంపెనీలు, సారా కంపెనీలు నడిపించుకొనే వ్యక్తులు కాదు. అప్పుడే క్రికెట్ ఆటకు పట్టిన ఈ చీడ వదిలే అవకాశం ఉంటుంది.

వైకాపాకు శల్యసారధ్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరునెలలయినపట్టికీ ఇంకా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న ఒంగోలులో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నరేంద్ర మోడీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందునే తెదేపా గెలిచిందని, లేకుంటే గెలిచి ఉండేది కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారం సంపాదించుకొన్నారని, కానీ తను అందుకు ఇష్టపడకపోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. వైకాపాకు కడప జిల్లాలో వచ్చినంత మెజార్టీయే తెదేపాకు యావత్ రాష్ట్రంలో వచ్చింది తప్ప పెద్దగా మెజార్టీ రాలేదని అన్నారు. తనకు అధికారం దక్కి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రజలందరూ మరో ముప్పై ఏళ్లపాటు గుర్తుండేవిధంగా పరిపాలన సాగించాలని అనుకొన్నానని ఆయన అన్నారు.   నరేంద్ర మోడీ ప్రభావం చేతనే తెదేపా అధికారంలోకి రాగలిగిందనే ఆయన చెప్పడం చూస్తే ఆయనకు ఇంకా రాజకీయ పరిణతి కలగలేదని అర్ధమవుతోంది. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ, ఆంద్ర, తెలంగాణాలలో మాత్రం ఆయన ప్రభావం లేదని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన ఆ ఎన్నికలలో ఆంధ్రాలో కాంగ్రెస్ వ్యతిరేఖత, రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు కారణంగా మంచి రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న చంద్రబాబు నాయుడి వైపే ప్రజలు మొగ్గు చూపడం వంటి అనేక కారణాల చేతనే తెదేపా అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణా సెంటిమెంటు కారణంగా అక్కడా అయన ప్రభావం పనిచేయలేదని చెప్పవచ్చును.   అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్న నరేంద్రమోడీతో చంద్రబాబు చేతులు కలపడం, మోడీ తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇవ్వడం, వారి కూటమికి అత్యంత ప్రజాధారణ గల పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వంటి అనేక అంశాలు తెదేపా విజయానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు. ఇవికాక రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల రుణమాఫీ వంటి అనేక అంశాలు కూడా తెదేపా విజయానికి తోడ్పడ్డాయి. కానీ ఇంత చిన్న విషయం కూడా గ్రహించలేని జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభావంతోనే రాష్ట్రంలో తెదేపా గెలవగాలిగిందని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ఆయన వాదనే నిజమనుకొంటే మరి మోడీ ప్రభావంతో తెలంగాణాలో ఎందుకు గెలవలేకపోయింది? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పవలసి ఉంటుంది.   ఇక చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆయన చెప్పడం చూస్తే ఆయన ప్రజలకు ఏమాత్రం ఆలోచించే శక్తి లేనివారని, వారు ఎవరు ఏది చెపితే అధినంమేసే మూర్ఖులని అంటున్నట్లుంది. చంద్రబాబు తమను మోసం చేస్తున్నారని వారు భావించి ఉండిఉంటే వారు జగన్మోహన్ రెడ్డికే ఓటువేసి వైకాపాకే అధికారం కట్టబెట్టేవారు. కానీ వారు అతనిని నమ్మలేదు. అందుకే వైకపా ఓడిపోయింది. కర్ణుడి చావుకు వెయ్యి కారనాలున్నట్లే వైకాపా ఓటమికి కూడా వెయ్యి కారణాలున్నాయని అందరికీ తెలుసు. తమ అతివిశ్వాసమే తమ కొంప ముంచిందని జగన్మోహన్ రెడ్డే స్వయంగా శాసనసభలో ప్రకటించుకొన్నారు కూడా. వెయ్యి కారణాలలో అది కూడా ఒకటని ఆయనే స్వయంగా చెప్పుకొంటున్నప్పుడు, చంద్రబాబుని ఇంకా ఆడిపోసుకోవడం తన అసమర్ధతను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తప్పితే దాని వలన పార్టీకి ఏమి ప్రయోజనం కలుగుతుంది? పార్టీని బలపరుచుకొనేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు, ఆయన పార్టీని ఏవిధంగా బలపరుచుకోవాలో తన నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. కానీ జరిగిన తప్పులని, చేసిన పొరపాట్లని కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబుని, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేయడంతోనే పుణ్యకాలం కాస్త పూర్తయ్యేలా ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే స్వయంగా పగ్గాలు చేతబట్టుకొని తన పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నప్పుడు తెదేపాకు అంతకంటే కావలసిందేముంటుంది?

రాష్ట్రానికి భారీగా జపాన్ పెట్టుబడులు... పరిశ్రమలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ దేశ పర్యటన ఆశించినట్లే రాష్ట్రానికి చాలా ప్రయోజనం చేకూర్చే విధంగా సాగుతోంది. భారత్ లో సర్వసాధారణమయిన లంచగొండితనం, పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు చేయడంలో జరిగే జాప్యం కారణంగా భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తున్న జపాన్ దేశ పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు లేవని, వారు పరిశ్రమలు స్థాపించడానికి వస్తే వారికి తమ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జపనీయులు ఆర్ధిక,సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ వారికి బాష ప్రధాన అవరోధంగా ఉంది. అది గ్రహించిన చంద్రబాబు తనను కలిసేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు అర్ధమయ్యే విధంగా జపనీస్ బాషలోనే పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నూతన పారిశ్రామిక విధానాల గురించి వారు అర్ధం చేసుకోగలిగారు.   తమ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కేవలం వారం రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి, భూమి, నీళ్ళు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశ్రామిక ప్రోత్సహాకాలు అందజేస్తుందని వారికి వివరించారు. వ్యవసాయ పరికరాలను తయారు చేసే ఎన్మార్ అగ్రికల్చరల్‌ మెషినరీ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ అనే సంస్థ, విద్యుత్ మోటార్లు తయారు చేసే ఎన్‌ఐడీఈసీ సంస్థ యాజమాన్యాలతో సమావేశమయిన చంద్రబాబు  బృందం వారి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకొన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం తమకు తగిన విధంగా సహకరిస్తే రాష్ట్రంలో తమ పరిశ్రమలను స్థాపించి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేసి రాష్ట్రానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూర్చగల సత్తా కూడా తమకు ఉందని ఆ రెండు సంస్థల యాజమాన్యాలు చెప్పడం గమనిస్తే వారు రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు సంసిద్దంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. ఆయన బృందం జపాన్ పర్యటన ముగించుకొని వచ్చేలోగా మరిన్ని సంస్థల ప్రతినిధులను కలిసి వారిని కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తారు .   కొన్ని రోజుల క్రితం జపాన్ దేశం పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా జపాన్ పారిశ్రామిక వేత్తలలో నెలకొన్న అనుమానాలను తొలగించి, భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆయన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా భరోసా ఇస్తుండటంతో జపాన్ పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చును. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో , ప్రధాని మోడీతో తనకు, తన ప్రభుత్వానికి చక్కటి సంబందాలున్నాయనే సంగతిని కూడా వారికి తెలియజేయడం ద్వారా వారికి తన ప్రభుత్వంపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేసారు.   రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, ఆ దేశం వినియోగిస్తున్న అత్యాదునికమయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు బృందం అధ్యయనం చేస్తోంది. రాజధాని, రాష్ట్ర పునర్నిర్మాణం, స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం కూడా జపాన్ దేశ సహకారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలున్నందున జపాన్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తున్నట్లు కనబడుతోంది. కనుక చంద్రబాబు నాయుడు తన జపాన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత, జపాన్ పారిశ్రామిక సంస్థల బృందాలు కూడా రాష్ట్రానికి వచ్చి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.

అభివృద్ధి మంత్రం జపిస్తున్న ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అంశాలపై కత్తులు దూసుకొంటునప్పటికీ, తమ తమ రాష్ట్రాలను పొరుగు రాష్ట్రం కంటే వేగంగా, ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలని పట్టుదలగా ప్రయత్నిస్తుండటం అభినందనీయం. వచ్చే ఎన్నికల నాటికి పొరుగు రాష్ట్రం కంటే తమ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపకపోయినా, సమస్యలను పరిష్కరించడంలో విఫలమయినా ప్రజలు తమ పార్టీని తిరస్కరించవచ్చనే భయం కూడా బహుశః వారిని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టేలా చేస్తున్నాయని భావించవచ్చును. కారణాలు, ఆలోచనలు ఏవయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాయి. ఆలోచిస్తున్నాయి. గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.   గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్రం ఆంద్ర పాలకుల చేతిలో దోపిడీకి, తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని గట్టిగా వాదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ఆంద్ర పాలకులకు, తమ పాలనకు మధ్య గల తీవ్ర వ్యత్యాసం చూపించాలనే ప్రయత్నంలో అన్ని వర్గాలను, ప్రాంతాల సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే తెలంగాణాలో అత్యధిక జనాభాగా ఉన్న యస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. తెలంగాణాను పట్టి పీడిస్తున్న తీవ్ర విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.   వ్యవసాయానికి నీటి వసతి కల్పించేందుకు చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలను జిల్లా కేంద్రాలతో, జిల్లా కేంద్రాలను రాజధానితో అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఇందిరా పార్క్ సమీపంలో ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఆకాశహర్మ్య నిర్మాణం చేయాలనే ఆలోచనలన్నీ పొరుగు రాష్ట్రంతో పోటీలో భాగంగానే భావించవచ్చును. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఇటువంటి ఆరోగ్యకరమయిన పోటీని హర్షిస్తారు.   మళ్ళీ పదేళ్ళ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూనే, రాజధాని నిర్మాణం దానితో బాటే రాష్ట్రాభివృద్ధి, అదే సమయంలో తన ఎన్నికల హామీలను, బడ్జెట్ లో ప్రకటించిన హామీలను కూడా అమలుచేసి తన సత్తా ఏమిటో ప్రజలకు చూపించాలని తపిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలోగా రాజధానికి ఓ రూపురేఖలు తీసుకురావాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. దేశంలో కెల్లా అత్యద్భుతమయిన, అత్యాదునికమయిన హంగులతో కూడిన రాజధానిని నిర్మించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు, దానికి ఎదురవుతున్న అడ్డంకులను ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు.   పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం వంటి భారీ కార్యక్రమాలను ఆయన పెట్టుకొన్నారు. ఈ రెంటివల్ల రాష్ట్రంలో అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు లభిస్తే వ్యవసాయం కూడా గాడిన పడుతుంది.   రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలంటే కొత్తగా భారీ పరిశ్రమలు, పెట్టుబడులు రావలసి ఉంటుంది. అయితే అంతకంటే ముందుగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నివారించడం చాలా అవసరమని గ్రహించిన ఆయన ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయ్యారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు ఆయన దేశ విదేశాలలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో వాటికి అవసరమయిన అనుమతులు మంజూరు చేస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అనుమతులు, విభజన చట్టంలో రాష్ట్రానికి హామీ ఇవ్వబడిన అనేక ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం ఆయన కేంద్రం ఒత్తిడి చేయడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు బహుశః త్వరలోనే ఫలితాలు కనబడటం మొదలవుతాయని చెప్పవచ్చును.   ఈ ఐదేళ్ళలో ఈ పనులన్నీచేసి చూపగలిగినట్లయితే అవి ఆయన ప్రభుత్వ పనితీరుకి, సామర్ధ్యానికి గీటురాయిగా నిలుస్తాయి. దానివలన వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి తన అధికారం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది కనుక, ముఖ్యమంత్రి చంద్రబాబు సాధ్యమయినంత వరకు ఈ పనులన్నిటినీ పూర్తిచేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఈవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ఒకదానికొకటి సహకరించుకొంటూ ముందుకు సాగినట్లయితే అందరూ హర్షిస్తారు.

ఓడలు బళ్ళయితే...వికృత రాజకీయ క్రీడలో రూల్స్ మారవు

  అధికారంలో ఉన్నంత కాలం రాజకీయ నాయకులు తాము శాశ్వితంగా అధికారంలో ఉంటామని, అందువలన ఇక తామే పనిచేసినా అడిగేవారు ఉండరని భావిస్తూ తమకు నచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. నిర్ణయాలు తీసుకొంటుంటారు. కానీ ఎన్నికలలో ఓడిపోగానే వారి కలల సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంతవరకు తాము ఎవరితో చెలగాటం ఆడుకొన్నారో వారే తమతో చెలగాటం ఆడటం మొదలుపెట్టినప్పుడు, అంతవరకు ప్రతిపక్షాలతో తాము ఆడిన ఆటలు మరిచిపోయి, అధికార పార్టీ తమపై కక్ష గట్టి వేధింపులకి పాల్పడుతోందని గగ్గోలు పెట్టడం మొదలుపెడతారు.   దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా దశాబ్దాలుగా ఈ వికృత రాజకీయ క్రీడను ఆడుకొంటున్నాయి. ఇంతకు ముందు యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో ముఖ్యంగా బీజేపీతో కాంగ్రెస్ పార్టీచెలగాటమాడింది. చివరికి తనకు బయటి నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల చెయ్యి మెలికపెట్టి మరీ వారు తనకు మద్దతు కొనసాగించేలా చేసుకొంది. అయితే కాంగ్రెస్ హస్తాన్నే మెలిపెట్టి ఒక ఆట ఆడించిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పంచన చేరే ప్రయత్నం చేయడం విశేషం.     మోడీ ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల డిల్లీలో బీజేపీయేతర పార్టీలన్నిటినీ కూడదీసి ఒక సమావేశం నిర్వహించింది. దానికి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. కనుకనే మోడీ సీబీఐను తన యంపీల మీద ప్రయోగించి అరెస్టులకు పాల్పడుతూ తనను, తన ప్రభుత్వాన్ని వేధిస్తున్నారని మమతా బెనర్జీ ఆక్రోశించారు. అయితే తాను ఇటువంటి బెదిరింపులకి భయపడనని, అవసరమయితే అటువంటి సమావేశాలలో మరిన్నిసార్లు పాల్గొంటానని ఆమె అన్నారు.   ఇంతవరకు బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యంపీలను శారదా స్కాం కేసులో సీబీఐ అరెస్టు చేసింది. అదే పార్టీకి చెందిన మరికొంత మంది పేర్లు కూడా సీబీఐ జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో సహజంగానే మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి, దాని వ్యతిరేక ప్రభావం ఉంటాయి గనుకనే ఆమె కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.   కానీ కేంద్రంలో తను వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక తన పార్టీ నేతలు, యంపీలు ఎటువంటి అవినీతికి పాల్పడినా విచారణ చేయకూడదు, అరెస్టు చేయకూడదు..చేస్తే అది వేధింపుల క్రిందే లెక్క అని మమతా బెనర్జీ వాదన అర్ధరహితం. అదేవిధంగా ప్రస్తుతం అధికారం చేతిలో ఉంది కదా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్ధులపై ఏదో ఒక నిందమోపి వేదింపులకు పాల్పడితే మున్ముందు వారికీ అదే పరిస్థితి ఎదురవవచ్చును. అధికారంలో ఉన్నప్పుడు ఈ వికృత రాజకీయ క్రీడ రాజకీయ పార్టీలకి చాలా ఆనందం కలిగించవచ్చును. కానీ ఓడలు బళ్ళు అయినప్పుడు అదే ప్రాణసంకటంగా కూడా మారుతుందని గ్రహిస్తే ఈ వికృత క్రీడకు ఎప్పుడో ముగింపు పలికేవి. కానీ ఇప్పుడు ఈ క్రీడను ఎవరూ ఆపలేని పరిస్థితికి చేరుకొన్నారు కనుక ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఓడలు బళ్ళయినంత మాత్రాన్న ఈ వికృత రాజకీయ క్రీడలో రూల్స్ మారవని రాజకీయ పార్టీలన్నీ గుర్తించుకోవడం మంచిది.

ప్రభుత్వంపై వైకాపా యుద్దాలు అందుకేనా?

  చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చెప్పట్టక ముందు నుండే కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి ఒత్తిడి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐదు నెలల కాలంలో ఆయన చాలా సార్లు ఇదేపని మీద డిల్లీ వెళ్లి వచ్చేరు. మొన్న కూడా మరోమారు అదే పనిమీద మళ్ళీ డిల్లీ వెళ్లి వచ్చేరు. ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరోవైపు దేశ విదేశాల నుండి పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు కూడా ముమ్మురంగా చేస్తున్నారు. క్రిందటి వారం సింగపూర్ మళ్ళీ త్వరలో జపాన్ పర్యటనలు కూడా దానికోసమే.   అదేసమయంలో రాష్ట్రంలో కొత్తగా భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమయిన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ(ఎ.పి.ఐ.ఐ.సి.)కు భూములు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. చిత్తూరు శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థకు, నెల్లూరులో సర్వేపల్లి పారిశ్రామిక వాడలో ‘క్రిషభ్ కో’ మరియు ఒక వ్యవయసాయ పరికారల ఉత్పత్తి సంస్థ నిర్మాణానికి అవసరమయిన భూములను ఎ.పి.ఐ.ఐ.సి.కి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరులోనే కంటైనర్ కార్పోరేషన్ సంస్థకు అవసరమయిన భూములను కూడా కేటాయించేందుకు పనులు చురుకుగా జరుగుతున్నాయి.   ఇటీవల సింగపూర్ పర్యటించి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆదేశం నుండి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి రెండు ప్రధాన అవరోధాలు కనబడుతున్నాయి. 1. రాష్ట్రానికి ఇంకా ప్రత్యేక హోదా రాకపోవడం. 2. భూముల కొరత. అందుకే ప్రత్యేక హోదా కోసం ఆయన పదేపదే కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఈవిషయంలో కొంత జాపం జరిగినప్పటికీ, ఈ ఒత్తిడి కారణంగా ఇప్పుడు కేంద్రంలో కూడా కదలిక మొదలయింది. ఇటీవల కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సంబంధిత శాఖలకు చెందిన ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, వీలయినంత త్వరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అవసరమయిన చర్యలు చేప్పట్టాలని ఆదేశించారు. ఆమెతో సమావేశమయిన కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఇరువురు కూడా త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.   ఇక రెండవ సమస్య అయిన భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు తను అధికారం చేప్పట్టిన కొద్ది రోజులకే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే గత ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తులకు, సంస్థలకు నిబంధనలు తుంగలో త్రొక్కి అడ్డుగోలుగా కట్టబెట్టిన భూములను గుర్తించేందుకు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీని వేసారు. అది గుర్తించిన భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి వేల ఎకరాలు అందుబాటులోకి వస్తున్నాయిప్పుడు. అయితే ఆ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించలేని ప్రధాన ప్రతిపక్షం వైకాపా, ప్రభుత్వం తన హామీలను అమలు చేయడంలేదంటూ వచ్చే నెల ఐదవ తేదీ నుండి ధర్నాలు, మహా ధర్నాలకు సిద్దం అవుతోంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ప్రతీ హామీని కూడా తప్పకుండా నేరవేర్చుతానని పదేపదే మీడియాముఖంగా చెపుతున్నారు. అంటే ఈ విషయంలో ఒకవేళ ఆయన మాట తప్పాలన్నా తప్పించుకోలేరని స్పష్టమవుతోంది. ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదు కనుకనే మీడియా ముఖంగా చెపుతున్నారని అర్ధమవుతోంది. ఆర్ధిక సమస్యలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ వైకాపా మాత్రం అదేమీ గమనించనట్లు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒర్రూతలుగుతోంది. దానికి ప్రజలు మద్దతు ఇస్తారో లేక కొర్రు కాల్చి వాతలు పెడతారో వేచి చూడాలి.

ప్రజా సమస్యలే ఆయుధాలుగా అధికార, ప్రతిపక్షాల యుద్ధం

  తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలను మరొక వారం రోజులు పొడిగించే విషయంపై చర్చించేందుకు ఈరోజు అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన బి.ఏ.సి. సమావేశం జరుగబోతోంది. అయితే ఇంతవరకు జరిగిన సమావేశాలలో తెలంగాణా రాష్ట్రాన్ని వేదిస్తున్నతీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులను కాపాడేందుకు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి సభలో ఏమయినా పరిష్కారాలు కనుగొన్నారా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఏమయినా చర్చించారా? అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. అలాగని సభలో ప్రజాసమస్యలపై లోతయిన చర్చ జరగలేదని చెప్పడానికి కూడా లేదు. వివిధ సమస్యలపై చర్చించిన ప్రజా ప్రతినిధులు వాటిపై తమకు పూర్తి అవగాహన ఉందని, వాటికి తగిన పరిష్కారమార్గాలు సూచించగల సమర్ధులని కూడా నిరూపించుకొన్నారు. అంటే సమస్యలున్నాయని అందరికీ తెలుసు. వాటిని ఏవిధంగా పరిష్కరించవచ్చో కూడా అందరికీ తెలుసని స్పష్టమవుతోంది. కానీ వారు ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు చేసే బదులు, అవే సమస్యలను ఆయుధాలుగా చేసుకొని సభలో వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలు, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడానికే తమ విలువయిన సమయాన్ని, తెలివితేటలను వినియోగించడం ప్రజల దురదృష్టమనే చెప్పుకోవలసి ఉంటుంది.   అధికార, ప్రతిపక్షాల వారిగా విడిపోయిన ప్రజాప్రతినిధులు ఆ సమస్యలను అడ్డుపెట్టుకొని ఒకరిపై మరొకరు ఎదురుదాడి చేసుకొంటూ సభలో తమ ప్రత్యర్ధులపై పైచేయి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించారు తప్ప ఆ సమస్యల పరిష్కారానికి చూపలేదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కే. అరుణ కనిమెట్ట అనే గ్రామంలో పెన్షన్ దక్కక అవస్థలు పడుతున్న వృద్ద దంపతుల గురించి ప్రస్తావించారు. అయితే ఆమె వారి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే బదులు, తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షలమందికి పెన్షన్లు ఇచ్చేమో గణాంకాలు వివరించే ప్రయత్నం చేయడంతో, ఆమె లేవనెత్తిన వృద్ధుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తారనుకొన్న మంత్రి కేటిఆర్ తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఐదింతలు ఎక్కువ మొత్తం పెన్షన్ ఇస్తోందని, దేశంలో కెల్లా అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తమదేనంటూ గొప్పలు చెప్పుకొన్నారు. ఆ విధంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చాలా గట్టిగా ప్రయత్నించారు తప్ప ఆ వృద్ధ దంపతుల సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు.   రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల పట్ల అధికార, ప్రతిపక్షాలు ఇదేవిధంగా వ్యవహరించాయి తప్ప వాటి పరిష్కారానికి మాత్రం ప్రయత్నించలేదనే చెప్పక తప్పదు. బీజేపీకి చెందిన డా. లక్ష్మణ్ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చక్కటి ప్రత్యామ్నాయాలు సూచించారు. కానీ వాటిని పట్టించుకొన్నవారు లేరు.   ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించాలి. అధికార పార్టీ అంటే ప్రతిపక్షాల నోరు నొక్కి సభను నడిపించాలి అన్నట్లు వ్యవహరించారే తప్ప ఎవరూ కూడా తాము చర్చిస్తున్న ప్రజా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలి? అని మాట్లాడకపోవడం విచిత్రం. అటువంటప్పుడు ఈ సమావేశాలు మరో వారం రోజులపాటు పొడిగించినా దాని వలన ప్రయోజనం ఏముంటుంది? ప్రజలకు ఒరిగేదేముంటుంది?   ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంగా ఉన్నారనే సంగతి మరిచిపోయి, రాజకీయ పార్టీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వారికి తగిన గుణపాటం నేర్పారు. అయినా రాజకీయ పార్టీలు మేల్కొనకపోతే ప్రజలే వారిని మేల్కొలపవలసి వస్తుంది.

తెరాసకు ముందు నుయ్యి వెనుక గొయ్యి

  తెలంగాణా శాసనసభ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేయబడిన తెదేపా సభ్యులు, నిన్నటితో ఆ గడువు ముగియడంతో ఈరోజు నుండి మళ్ళీ సభకు హాజరుకానున్నారు. కానీ వివిధ అంశాలపై వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారిపై ఎదురుదాడి చేస్తున్న తెరాస మంత్రులు మళ్ళీ వారిని ఏదో ఒక వంకతో సభ నుండి సస్పెండ్ చేయకుండా ఉంటారని భావించలేము. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ ఫిరాయింపుల అంశంపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తున్నారు. అర్హులయిన వేలాది మంది పెన్షనర్ల పేర్లను జాబితా నుండి తొలగించడంపై వారు ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు వారికి తెదేపా నేతలు కూడా మళ్ళీ తోడయినట్లయితే, సభలో ప్రతిపక్షాలను తట్టుకోవడం తెరాసకు చాలా కష్టమవుతుంది. అందువలన మళ్ళీ ఏదో ఒక సాకుతో వారిని సభ నుండి సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు.   అదే చేస్తే ఈసారి తెదేపా సభ్యులు మరింత ఉదృతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించవచ్చును. ఇంతకు ముందు వారిని వారం రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేసినప్పుడు, వారు ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను రాజధానికి వెంటబెట్టుకొని వచ్చి వారితో కలిసి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వారి ధర్నాకు మంచి మీడియా కవరేజ్ కూడా రావడంతో అది రాష్ట్ర ప్రజలందరి దృష్టికి వెళ్ళింది.   సభలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడానికి తెరాస ఎంత గట్టిగా కసరత్తు చేసినప్పటికీ వారిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతోంది. అందుకు కారణం ప్రతిపక్ష సభ్యులలో చాలామంది ప్రభుత్వపాలన, వ్యవహారాలలో తెరాస సభ్యులు, మంత్రుల కంటే చాలా అనుభవం ఉన్నవారు కావడమే. కానీ వారిని సభలో ధీటుగా ఎదుర్కోలేకపోయినంత మాత్రాన్న తెరాస ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదని చెప్పవచ్చును. విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, పెన్షన్లు తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తమకు సమాధానం ఈయకుండా తప్పించుకోవడానికే తమను సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపించి వేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బాధిత కుటుంబాలకు బాగానే చేరుతున్నాయి. దాని వలన తెరాస పార్టీకి దీర్ఘకాలంలో జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు.   ఇంతకు ముందు తెదేపా సభ్యులను వారం రోజులు సస్పెండ్ చేసిన తెరాస ప్రభుత్వం,తరువాత 14మంది కాంగ్రెస్ సభ్యులను కూడా సభ నుండి ఒకరోజుకి సస్పెండ్ చేయడంతో వారు కూడా తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతులకు, సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి సభలో ప్రతిపక్షాల గొంతు వినబడకుండా చేసి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ తరువాత వారు గవర్నరును కలిసి ప్రభుత్వంపై పిర్యాదు చేసారు కూడా.   కనుక తెదేపా సభ్యులను మళ్ళీ సభ నుండి సస్పెండ్ చేయాలనుకొంటే తెరాస ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకోక తప్పదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పలేక వారిని ఏదో సాకుతో సభ నుండి సస్పెండ్ చేస్తోందనే అపఖ్యాతి మూట గట్టుకోవడం మంచిదా లేకపోతే వారు సభలో వివిధ అంశాలపై తమ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమలడం మంచిదా? అనేది తెరాసయే నిర్ణయించుకోవలసి ఉంటుంది. తెరాస పరిస్థితి చూస్తుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది.

రాజధానిపై రాద్దాంతం చేసుకొంటే...

  తూళ్ళూరు మండలంలో గల 25గ్రామాల నుండి వచ్చిన 300మంది రైతులతో నిన్న సమావేశమయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానికి భూసేకరణ విషయంలో వారిలో నెలకొన్న అనుమానాలను, భయాందోళనలను నివృతి చేసి, రైతులకు వారి భవిష్యత్ పట్ల భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. రైతులకు భూములతో తరతరాలుగా ఉన్న అనుబందం గురించి తాను అర్ధం చేసుకోగలనని, కానీ రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడు త్యాగం చేసినట్లయితే వారికే ఆ కీర్తి, ఫలాలు అన్నీ దక్కుతాయని, అందువల్ల ప్రతిపక్షాల మాటలకు చెవొగ్గి ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దని ఆయన రైతులకు సలహా ఇచ్చారు. వారి భవిష్యత్తుకు, భద్రతకు తాను హామీ ఇస్తున్నానని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. కేవలం నోటి మాటలతోనే కాకుండా ఆరు నెలలలోగా రైతులు ఇస్తున్న భూములకు రికార్డులన్నీ సరిచేయించి, వారు తిరిగి పూర్తి ప్రయోజనం పొందే విధంగా శాసనసభ ద్వారా చట్టబద్దత కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు.   ఈ భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే నిరుపేద వ్యవసాయ కూలీలకు తగిన శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే వారికి ఉపాధి మార్గం చూపిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇళ్లులేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన భరోసాతో కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించగా మరి కొందరు ఇంకా అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం అంత తేలికగా పరిష్కరించగలిగేది కాదని మాత్రం చెప్పవచ్చును.   ముఖ్యమంత్రి స్వయంగా వారితో మాట్లాడినప్పటికీ, ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న ప్యాకేజీ వివరాలను ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించినట్లయితే రైతులకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. భూసేకరణ కోసం మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీని వేసినట్లే, రైతులకు ప్రభుత్వం ఈయదలిచిన ఇతర పరిహారాలను, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను, సంక్షేమ, శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తూళ్ళూరు మండలానికి చెందిన రైతులతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థను, దాని కార్యాలయాన్ని తూళ్ళూరులోనే ఏర్పాటు చేయడం వలన కూడా రైతులలో నెలకొన్న ఈ అనుమానాలు, అపోహలు తొలగించవచ్చును. ఆ కార్యాలయమే అటు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారదిగా నిలుస్తుంది కనుక రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి దిక్కులు చూడవలసిన ఆగత్యం తప్పుతుంది.   ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసి, రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారనే అప్రతిష్ట మూటగట్టుకొనే బదులు రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకు తాము వారికి అండగా ఉంటామనే భరోసా కల్పిస్తే బాగుంటుంది. రాష్ట్ర విభజన వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయిలో చర్చించుకొని పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ అందరూ పంతాలు పట్టింపులకీ పోయినందునే దేశ ప్రజల దృష్టిలో తెలుగు ప్రజలు చులకనయ్యారు. పిట్టల పోరు పిల్లి తినేసి తీర్చినట్లుగా రాష్ట్ర రాజకీయపార్టీల చేతగానితనం కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం తనకు ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర విభజన చేసి అందరికీ కష్టాలు మిగిల్చింది.   మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అటువంటి పరిస్థితే పునరావృతం కాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు విజ్ఞతతో మెలగవలసి ఉంటుంది. అందరూ కలిసి ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మించుకొని దేశానికే ఆదర్శంగా నిలవాలి తప్ప నలుగురిలో నవ్వులపాలయ్యేవిధంగా వ్యవహరించడం ఎవరికీ గొప్ప విషయం కాదు.

తెలంగాణా యుద్దభూమిలోకి షర్మిలను పంపడం దేనికో?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రల ద్వారా ప్రజలను ఆకట్టుకొని రాష్ట్రంలో తన పార్టీని బలపరుచుకోవాలనుకొన్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే దానికి బదులు ఆయన గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేసి ఉండి ఉంటే ఆయన ఆశించిన ప్రయోజనం నెరవేరి ఉండేదేమో. కానీ అయన ఈ ‘షార్ట్ కట్’ పద్దతిలో పైకి ఎదగాలనుకోవడం వల్లనే నేటికీ పార్టీ అనేక జిల్లాలలో చాలా బలహీనంగా మిగిలిపోయింది. అయితే ఆయన గతం నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోలేదని ఆయన సోదరి షర్మిల త్వరలో తెలంగాణా చేపట్టబోతున్న ‘పరామార్శ యాత్ర’ దృవీకరిస్తోంది.   కష్టాల్లో ఉన్నవారిని పరామార్శించడాన్ని ఎవరూ కూడా తప్పు పట్టరు. కానీ వారి కష్టాలను తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడాన్ని ఎవరూ సమర్ధించబోరు. తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటున్న వైకాపా అందుకోసం ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను, పంటలకు నీళ్ళందక కన్నీళ్ళు పెట్టుకొంటున్న రైతన్నలను పరామార్శించే సాకుతో యాత్రలు చెప్పట్టాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచనని చెప్పక తప్పదు. (రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు).   తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటే అందుకు నేరుగానే ప్రయత్నాలు చేసుకోవచ్చును. తెలంగాణాలో మిగిలిన పార్టీనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి పార్టీని మళ్ళీ ఈవిధంగా బలపరుచుకోవాలని చర్చించాలని ప్రయత్నించే బదులు కష్టాల్లో ఉన్న రైతులకు సానుభూతి చూపిస్తూ అందుకు ప్రతిగా తిరిగి వారి నుండి పార్టీ సానుభూతి పొందాలను కోవడం ఆ పార్టీకి రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఎటువంటిదో స్పష్టం చేస్తోంది. ఈవిధమయిన ఆలోచనలు చేయడాన్ని ఎవరూ కూడా హర్షించరు...సమర్దించలేరు కూడా. ముఖ్యంగా తెలంగాణా ప్రజలు.   ఒకప్పుడు తెలంగాణా ప్రజల సెంటిమెంటు గౌరవిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం తన పార్టీ నేతలయిన కొండా సురేఖ వంటి తెలంగాణా నేతల మనోభావాలను కూడా గౌరవించకుండా, వారి సలహాలను పెడచెవిన పెట్టి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ తెలంగాణా నుండి బయటపడ్డారు. ఆవిధంగా చేసి తెలంగాణా ప్రజల, తన పార్టీ నేతల మనసు నొప్పించిన జగన్మోహన్ రెడ్డి, సమైఖ్యాంధ్ర శంఖం పూరించి సీమాంధ్ర ప్రజల ఓట్లు పిండుకొందామని చేసిన ప్రయత్నం కూడా ఫలించక పోవడంతో ఆయన పార్టీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. అందుకే ప్రజలు కూడా ఆ పార్టీని, అది చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని కూడా అనుమానంగానే చూస్తుంటారు. అయినప్పటికీ ఆ పార్టీ అధినేత గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా మడమ తిప్పకుండా అదే పద్దతిలో ముందుకు సాగాలనుకోవడం విశేషమే. అందుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేని షర్మిల సేవలను ఉపయోగించుకోవాలనుకోవడము కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో ఉన్నపుడు, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఇరువురు ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేసారు. అందులో వారు చాలా వరకు సఫలీకృతులయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీని చూసుకొంటునప్పుడు తను వెళ్ళకుండా షర్మిలను పంపిస్తున్నారు. ‘యుద్దంలో దిగినవాడికి గుండెల నిండా దైర్యం ఉండాలి’ అని గొప్పగా చెప్పుకొనే ఆయన పార్టీకి పూర్తి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న తెలంగాణా యుద్దభూమిలోకి తను వెళ్ళకుండా చెల్లెలు షర్మిలను పంపించడం దేనికంటే అక్కడ ప్రజా వ్యతిరేఖతను తను తట్టుకోలేననే ఆలోచనతోనే అని చెప్పక తప్పదు. ఆమె పర్యటనతో పరిస్థితి కొంచెం మెరుగుపడితే బహుశః అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం చేస్తారేమో? కానీ షర్మిల వంటి వారు పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగా కృషి చేసినప్పటికీ, పార్టీలో “విశ్వసనీయత” లేకపోతే అది ఎన్నటికీ ప్రజల ఆదరణకు నోచుకాదు. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ద్వంద వైఖరిని విడనాడటం చాలా అవసరం.

ప్రభుత్వం విజయవాడకు వస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యం

  ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు వద్దగల ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించబోవడం చాలా తెలివయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. దానిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొలి మంత్రి వర్గ సమావేశాన్ని విశాఖలోని ఆంద్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించినప్పుడు ప్రజల నుండి ఇదే రకమయిన సానుకూల స్పందన వచ్చింది. ఆ తరువాత ఆయన విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించి, త్వరలోనే ప్రభుత్వం అక్కడికి తరలివచ్చి పనిచేయడం మొదలుపెడుతుందని చెప్పినపుడు కూడా యావత్ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషించారు. కానీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలవకపోవడంతో నేటికీ హైదరాబాద్ నుండే పరిపాలన సాగించవలసి వస్తోంది.   కానీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్ లో కూర్చొని తూళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని చెపుతూ రైతుల నుండి భూసేకరణకు పూనుకొంటున్నందున రైతులలో అనేక అనుమానాలు, ప్రభుత్వం ఇస్తున్న హామీలపట్ల ఒక అపనమ్మకం ఏర్పడటం సహజం. వారి అనుమానాలకు చాలా బలమయిన కారణాలే ఉన్నాయి. తీవ్ర ఆర్దికలోటు, నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వం విజయవాడకు తరలిరాకుండా హైదరాబాద్ నుండే పాలన సాగిస్తుండటం వలన వారు చెపుతున్నట్లుగా ఐదేళ్ళలో రాజధాని నిర్మించగలరా లేదా? ఉన్న కొద్దిపాటి భూములు ప్రభుత్వానికి అప్పగించేసాక, ఇప్పుడు విజయవాడకు తరలివచ్చేందుకే జంకుతున్న ప్రభుత్వం ఏ కారణాల చేతయినా రాజధాని నిర్మించలేకపోతే అప్పుడు తమ పరిస్థితి ఏమిటి? వంటి అనేక సందేహాలు రైతులలో కలగడం సహజం.   ప్రభుత్వం విజయవాడకు తరలిరాకుండా హైదరాబాద్ లో ఉండటం ప్రతిపక్షాలకు కూడా బాగా కలిసిరావడంతో అవి రైతులలో నెలకొన్న ఈ అనుమానాలను, భయాందోళనలను మరింత పెంచిపోషించే అవకాశం చేజిక్కించుకోగలుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించబోవడం తెలివయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. తద్వారా ప్రభుత్వంపై రైతులకు కూడా నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.   అందువలన ప్రభుత్వం తక్షణమే విజయవాడకు తరలిరాలేకపోయినా, సమావేశాలు ముగిసిన తరువాత అంచెలంచెలుగా ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడకు తరలించడం మంచిది. రైతులకు జీవనోపాధి కల్పిస్తున్న పంట భూములను త్యాగం చేయమని ప్రభుత్వం కోరుతోంది. అటువంటప్పుడు వివిధ కారణాలతో హైదరాబాద్ విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్న ప్రభుత్వోద్యోగులను, ఉన్నతాధికారులను కూడా చిన్నచిన్న త్యాగాలు చేయమని గట్టిగా చెప్పవచ్చును.   విజయవాడకు తరలిరావడం కష్టమని ఉద్యోగులు, వారు లేకుండా విజయవాడకు తరలివచ్చి తానొక్కడు ఏమిచేయగలనని ముఖ్యమంత్రి, ఆయన రాకుండా మేము మాత్రం ఏమి చేయగలమని ఇతర మంత్రులు అందరూ హైదరాబాద్ లోనే కొనసాగుతున్నారు. అటువంటప్పుడు వారు రాజధాని గురించి చెపుతున్న మాటలను భూములిస్తున్న రైతులు విశ్వసించడం కష్టం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలల పుణ్యకాలం పూర్తవబోతోంది. ప్రభుత్వం ఇంకా హైదరాబాద్ నే అంటిపెట్టుకొని అక్కడి నుండే రాజధానికి సంబందించిన నిర్ణయాలు తీసుకొంటూ, అక్కడి నుండే విధివిధానాల గురించి మాట్లాడుతున్నంత కాలం ఈ సమస్యలను పరిష్కరించడం అసాధ్యమేనని చెప్పవచ్చును. తద్వారా రాజధాని నిర్మాణం మరింత ఆలశ్యం జరగవచ్చును. ఆలశ్యం జరుగుతున్న కొద్దీ ప్రజలలో, రైతులలో అనుమానాలు పెరుగడం సహజం. అప్పుడు ఎవరూ ఊహించలేని కొత్త సమస్యలు పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు.   అందువలన రాజధాని నిర్మాణాన్ని సవాలుగా స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చుకోవాలంటే అంతకంటే ముందుగా తన ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భూములు ఇస్తున్న రైతులకు అందుబాటులో ఉంటే, చాలా సమస్యలు పరిష్కరింపబడవచ్చును. ఇటీవల హూద్ హూద్ తుఫాను సమయంలో ఆయన స్వయంగా విశాఖలో వారం రోజులు మకాం పెట్టి సహాయ, పునరావాస చర్యలు స్వయంగా పర్యవేక్షించడం ద్వారా తుఫాను దెబ్బ తిన్న ప్రజలలో ఒక గొప్ప ఆత్మస్థయిర్యం, ప్రభుత్వం తమకు అండగా ఉండనే భరోసా, భావన కలిగించగలిగారు. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి తూళ్ళూరు, గన్నవరం మండలాలలో రైతులకు అటువంటి ఆత్మస్థయిర్యం, భరోసానే కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయన అనుకొన్న పని నిర్విఘ్నంగా సాధించగలుగుతారు.

మోడీ నాయకత్వ లక్షణాలకు కాంగ్రెస్ సలాం

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న కొన్ని కార్యక్రమాలు ప్రతిపక్షాలకి, ముఖ్యంగా ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా మారుతున్నాయి. ఇటీవల ఆయన ప్రవేశ పెట్టిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఆయన పిలుపు మేరకు అంభానీ, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా వంటి పలువురు ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ వారు మరో తొమ్మిది మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా పిలుపునిస్తుండటంతో, దేశవ్యాప్తంగా అదొక మహాయజ్ఞంలా సాగిపోతోందిపుడు. దేశంలో అనేక రాజకీయపార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.   కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొంటే, మోడీని సమర్ధించినట్లవుతుందని దూరంగా ఉంటోంది. కానీ అదొక మంచి కార్యక్రమమని దేశ ప్రజలందరూ భావిస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నపుడు కాంగ్రెస్ మాత్రమే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటమ వలన ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతాననే బెంగ భయం కూడా ఉంది. కానీ ఆ సంగతి పైకి చెప్పుకోలేదు గాబట్టి, మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం గాంధీ నెహ్రుల కాలం నుండే తమ పార్టీ అమలు చేస్తూ వచ్చిందని, దానినే పేరు మార్చి మోడీ తన పధకంగా గొప్పలు చెప్పుకొంటున్నారని, మోడీకి కేవలం ప్రచారార్భాటమే తప్ప చిత్తశుద్ధితో దానిని అమలు చేయాలనే తపన ఏ కోశాన్న లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ప్రజలు తమను తప్పుపట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.   ఆ స్వచ్చమయిన గండం ఎలాగో గట్టెక్కామని సంతోషిస్తున్న కాంగ్రెస్ నేతల నెత్తిన మోడీ బండరాయి పెట్టారు. ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారింది.   ఆ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు అందరూ తమకు నచ్చిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని, కేంద్రప్రభుత్వం వారికి కేటాయించిన యంపీ లాడ్స్ (లోకల్ డెవలప్మెంట్ ఫండ్స్) నిధి నుండి, వాటిని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. మోడీ స్వయంగా వారణాసి వద్దగల జయ పూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొని మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారు. ఆయన స్పూర్తితో అనేకమంది యంపీలు కేంద్రమంత్రులు కూడా అనేక గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.   కేంద్రప్రభుత్వం యంపీలకు అందించిన నిధులతోనే గ్రామాలను అభివృద్ధి చేయవచ్చును కనుక పార్టీలకు అతీతంగా చాలా మంది యంపీలు తమకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తున్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో చీపురు పట్టి రోడ్లు ఊడవకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయమని అడుగుతున్నప్పుడు కూడా చొరవ చూపకపోతే తప్పకుండా ప్రజలు నిలదీసే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా ఈ సారి కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనవలసివస్తోంది.   ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన బీజేపీ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోక తప్పనిసరి పరిస్థితి కలగడం విశేషం. సోనియా గాంధీ తన రాయ్ బరేలీ నియోజకవర్గంలో గల ఉద్వా అనే గ్రామాన్ని దత్తత తీసుకొంటే, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తన అమేధీ నియోజకవర్గంలో గల డేహ్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. అయితే అంత మాత్రాన్న తామేమీ మోడీ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నట్లు కాదని చెప్పడం కొసమెరుపు. మోడీ ఈవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధులను కూడా తన మార్గంలో నడిచేలా చేయడం ఆయనలో ణాయకత్వ లక్షణాలకు ఒక చక్కటి నిదర్శనంగా చెప్పవచ్చును.

రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తే...

    రాష్ట్రంలో మరే ఇతర సమస్యలు లేనట్లుగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని భూముల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ వద్ద రాజధాని నిర్మించబోతునప్పుడు స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు, ఇప్పుడు రాజధాని రైతుల హక్కుల పరిరక్షణ కమిటీల ముసుగులో గ్రామాలలో పర్యటిస్తూ రైతులలో లేని పోనీ అనుమానాలు, భయాందోళనలు సృష్టిస్తూ భూసేకరణకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుండటం చాలా దురదృష్టకరం. అయితే తాము రైతుల హక్కులను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నాము తప్ప రాజధాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించడం లేదని సమర్ధించుకొంటున్నారు.   ఆ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులను, స్థానిక యంపీ, యం.యల్యేలను కూడా గ్రామాలలో పర్యటించి రైతుల సందేహాలు తీర్చి, వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించమని ఆదేశించారు. వారు తమకు అప్పగించిన బాధ్యత చాలా సమర్ధంగానే నిర్వహించారని చెప్పవచ్చును.   లక్షలు పలికే భూములకు ఎక్కడి నుండో వచ్చిన వ్యాపారులు ఇప్పుడు కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తున్నారో? ఆలోచించుకోవాలని వారు రైతులను కోరారు. రాజధాని ఇక్కడ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయం వలననే రైతుల భూముల ధరలు పెరిగాయని, అందువల్ల ఎవరి చెప్పుడు మాటలకో చెవొగ్గి అయినకాడికి భూములను అమ్ముకోవద్దని, రైతులు అన్నివిధాల లాభాపడేలా, వారి జీవితాలకు పూర్తి భద్రత, భరోసా కలిగేవిధంగా ప్రభుత్వమే భాద్యత తీసుకొంటుందని హామీ ఇచ్చారు. మంత్రులు చెప్పిన ఆ మాటలు రైతులకు బాగా చేరింది.   అప్పటి నుండే రైతులలో నెలకొన్న భయాందోళనలు క్రమంగా తగ్గు ముఖం పట్టి, ఒక్కో గ్రామంలో రైతులు స్వచ్చదంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు కోరుతున్న విధంగా 1000 గజాల స్థలానికి బదులు రాజధాని నగరంలో అన్ని విధాల అభివృద్ధి చేయబడిన 1200గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   రైతన్నలను భయాందోళనలు రేకెత్తించి, వారు రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వకుండా అడ్డుకోగలిగితే, రాజధాని నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో ముందుకీ, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కలుగుతుందని భావించిన ప్రతిపక్షాలకు ఇది ఊహించని పరిణామమేనని చెప్పవచ్చును. కానీ వారి ప్రయత్నాలు వారు ఇంకా చేస్తూనే ఉన్నారు.   సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గ్రామాలలో పర్యటించనంత కాలం, ప్రభుత్వం ఎక్కడో హైదరాబాద్ లో ఏసీ గదుల్లో కూర్చొని భూసేకరణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు వారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తూ వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించి భూసేకరణకు మార్గం సుగమం చేస్తుంటే, అధికార పార్టీ నేతలు రైతన్నలను బెదిరించి, భయపెట్టి భూములు స్వాధీనం చేసుకొంటున్నారనే మరో కొత్త ప్రచారం మొదలుపెట్టి, రైతన్నలకు అండగా నిలబడతాము అంటూ ప్రతిపక్ష నేతలు గ్రామాలలో పర్యటిస్తున్నారు.   అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ రాజకీయ చదరంగం ఇలా సాగుతుంటే, గన్నవరం మండలంలో గల అజ్జంపూడి, బుద్దవరం, దావాజీ గూడెం మరియు కేసరపల్లి గ్రామాలకు చెందిన రైతులు నిర్వహించిన గ్రామసభలో చేసిన తీర్మానం చాలా ఆసక్తికరంగా ఉంది.   కొత్త రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో గల ఆ నాలుగు గ్రామాల నుండి మొత్తం 406 ఎకరాల భూమిని సేకరించేందుకు కొన్నిరోజుల క్రితమే ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. చట్ట ప్రకారం భూసేకరణకు ఎంత పరిహారం చెల్లించవలసి ఉంటుందో అంతా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొంది. కానీ తూళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఏవిధమయిన నష్టపరిహారం ఇస్తోందో అదే విధంగా తమకు పరిహారం ఇవ్వాలని నిన్న గ్రామ సభలో రైతులు తీర్మానించారు. తూళ్ళూరులో రైతులు రాజధాని కోసం భూములు ఇస్తుంటే, తాము రాజధానికి అవసరమయిన విమానాశ్రయ విస్తరణకు భూములు ఇస్తున్నాము కనుక తమకూ అదేవిధంగా పరిహారం చెల్లించాలని వారు తీర్మానించారు.   వారి డిమాండ్ల మాట ఎలా ఉన్నప్పటికీ వారు చేసిన ఆ తీర్మానం తూళ్ళూరు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం మరియు ప్యాకేజీ చాలా బాగుందనే విషయాన్ని ద్రువీకరిస్తోంది. అందుకే తమకూ అటువంటి మంచి ప్యాకేజీయే ఇవ్వాలని గన్నవరం మండలం రైతులు కూడా కోరుతున్నారని అర్ధమవుతోంది. అంటే తూళ్ళూరు మండలంలో తెదేపా నేతలు, యం.యల్యేలు. రైతన్నలను బెదిరించి, భయపెట్టి భూములు స్వాధీనం చేసుకొంటున్నారని కాంగ్రెస్, వైకాపాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది.   నిన్న మొన్నటి వరకు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పేరు పొందిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పుణ్యమాని రాజధాని లేని దుస్థితిలో ఉందిపుడు. అందుకు కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా పశ్చాత్తాప పడకపోవచ్చును, సిగ్గుపడకపోవచ్చును. కానీ రాజధాని లేదని చెప్పుకోవలసిరావడం ఆత్మాభిమానం ఉన్న ప్రతీ తెలుగు వ్యక్తికీ చాలా సిగ్గు, బాధ కలిగిస్తుంటుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలయినంత త్వరగా రాష్ట్రానికి రాజధాని నిర్మించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నారు.   రాష్ట్ర పరిస్థితిని అర్ధం చేసుకొని ఆయనకు సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడం క్షమార్హం కాదు. తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పడు రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్న వారికి ప్రజలు అదే విధంగా బుద్ధి చెప్పగలరనే సంగతి వారు గ్రహిస్తేమంచిది.

సెలబ్రిటీల ఫోజులతో స్వచ్చ భారత్ సాధ్యమవుతుందా?

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి ఊహించినట్లే సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల నుండి మంచి స్పందన వస్తోంది. నిత్యం దేశంలో ఏదో ఒక చోట ఎవరో ఒక ప్రముఖుడు చీపురు పట్టుకొని రోడ్లు ఊడ్వడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇదొక మహా యజ్ఞంలా సాగుతోందని బీజేపీ దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇటువంటి కార్యక్రమాలు గాంధీ, నెహ్రుల కాలం నుండే తమ పార్టీ అమలు చేసిందని, అందువలన మోడీ కొత్తగా చేస్తున్నదేమీ లేదని వి హనుమంతరావు వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మోడీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ‘ఓస్ ఇంతేనా...’అంటూ తేలికగా తీసిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ఒబామా అంతటివాడు మోడీ మాటల మనిషి కాదు చేతల మనిషి అని మెచ్చుకొన్న సంగతి మాత్రం వారు ప్రస్తావించరు. అలాగని పారిశుద్యం గురించి మోడీ ప్రభుత్వం గనుక పట్టించుకోకపోతే, అప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు ‘అదే మా ప్రభుత్వమయితేనా...’అంటూ తప్పకుండా దీర్గాలు తీసేవారు.   ఎవరు ఏవిధంగా అనుకొన్నప్పటికీ ఒక ప్రభుత్వాధినేతకు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన రావడం, దానిని అమలుచేసేందుకు గట్టిగా కృషి చేస్తూ ఆ ప్రయత్నంలో తెలివిగా ప్రజలలో స్ఫూర్తి రగించగల సెలబ్రిటీల సహకారం కోరడం చాలా మంచి ఆలోచన. అందుకు మోడీని మెచ్చుకోవలసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సెలబ్రిటీలలో ఎందరు మోడీకున్న ఆ స్పూర్తిని కనబరుస్తున్నారు? ఎందరు తమ అభిమానులలో ఆ స్పూర్తిని రగిలించగలిగారు? ఒకసారి చీపురు పట్టుకొని నాలుగు ఫోటోలు తీయించుకోవడం వలన ఏమి ప్రయోజనం? వారు చీపురు పట్టుకొంటే మిగిలినవారు కూడా వారి వెనుకే నిలబడి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వలన ఏమి ప్రయోజనం? అని తమను తాము ప్రశ్నించుకోవలసి ఉంది.   ఆనాడు మహాత్మాగాంధీ ఎక్కడో డిల్లీ నుండో లేకపోతే గుజరాత్ లో ఏ మారుమూల గ్రామం నుండో ఒక చిన్న పిలుపునిస్తే యావత్ దేశ ప్రజలు ఉద్యమంలో పాల్గొనడానికి తండోపతండాలుగా కదిలి వచ్చేవారు. కానీ ఇప్పుడు దేశ ప్రజలలో ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం కరువయింది గనుక వారిలో ఆ స్ఫూర్తి రగిలించడానికి సెలబ్రేటీలు ఏదో మొక్కుబడిగా కాకుండా చాలా చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏ కార్యక్రమమయినా విజయవంతం అవుతుంది.   మన ప్రభుత్వాలు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఎంతమంది సెలబ్రేటీలు ఎన్ని చీపుర్లు అరగదీసినా, ప్రజల అలవాట్లు, ఆలోచనా తీరు మారనంత కాలం స్వచ్చ భారత్ సాధించడం చాలా కష్టం. కనుక సెలబ్రిటీల చేత రోడ్లు ఊడ్పించడం కంటే వారిద్వారా ప్రజలలో పరిశుభ్రత పట్ల చైతన్యం కలిగించడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవాలి. లేకుంటే ఒకవైపు సెలబ్రేటీలు చెత్త ఊడ్చి పోతుంటే, మరోవైపు ప్రజలు రోడ్ల మీద చెత్త పోస్తూనే ఉంటారు. దాని వలన వారి కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది.   చైనా, జపాన్, అమెరికా తదితర దేశాలు ఒలింపిక్స్ క్రీడలలో డజన్ల కొద్దీ వెండి బంగారు పతకాలు పట్టుకుపోతూ, భారత్ వంటి దేశాలకు కేవలం కాంశ్య పతకాలను మాత్రమే మిగుల్చుతుంటాయి. అందుకు కారణం ఏమింటంటే ఆ దేశాలు తమ పిల్లలను బాల్యం నుండే క్రీడలలో ప్రోత్సహిస్తూ, వారికి తగిన శిక్షణ ఇస్తూ మేటి క్రీడాకారులుగా మలుచుకొంటాయి. వాటికి అంతటి నిబద్దత, దూరదృష్టి ఉండబట్టే ఆ దేశాలు అన్నేసి బంగారు పతకాలు గెలుచుకోగలుగుతున్నాయి.   కనుక, మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నప్పటి నుండే పిల్లలకు స్కూళ్ళలో పరిశుభ్రత, ఆరోగ్యం, క్రీడలు, కళలు తదితర రంగాలలో వారి ఆసక్తిని బట్టి తగిన శిక్షణ, మగ పిల్లలకు స్త్రీలపట్ల గౌరవం, ఆడపిల్లల్లో న్యూనతాభావం తొలగించడం వంటివన్నీ నేర్పించడం మొదలుపెడితే, సమాజంలో మార్పులు సహజంగా మొదలవుతాయి. నేలలో మొక్కవేసి ఊరుకొంటే సరిపోదు. దానికి నిత్యం నీరందించగలిగినప్పుడే అది పెరిగి ఫలాలు ఇస్తుంది. అదేవిధంగా ఒక గొప్ప ఆశయాన్ని ఆచరణలో పెట్టి దానిని విజయవంతంగా అమలుచేయాలంటే అందుకు దీర్గకాలిక ప్రణాళిక, ప్రజల సహకారం కూడా చాలా అవసరం అని ప్రభుత్వాలు గుర్తించాలి.

బీజేపీని కాదని శివసేన ఘోర తప్పిదమే చేసింది

  మహారాష్ట్రలో శివసేన పార్టీ, బీజేపీతో జత కట్టి అధికారంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, పంతానికి పోయి ఆ సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకొని ప్రతిపక్షంలో కూర్చొంది. అందుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రేనే తప్పు పట్టవలసి ఉంటుంది. గత రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న శివసేన పార్టీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన శక్తిని అతిగా ఊహించేసుకొని, బీజేపీతో సీట్ల సర్దుబాటుకు అంగీకరించకుండా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి మొదటి తప్పు చేసింది. ఆ తరువాత బీజేపీకి 121 సీట్లతో అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతున్నప్పుడు, 63 సీట్లు గెలుచుకొన్న శివసేన దానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో అధికారం పంచుకోవచ్చును. అందుకు బీజేపీకూడా సానుకూలంగానే స్పందించింది. కానీ, ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో శివసేన తన నిర్ణయం మార్చుకొంది.   మహారాష్ట్ర ఎన్నికల తరువాత మళ్ళీ బీజేపీకి దగ్గరయిన శివసేనకు బీజేపీ రెండు కేంద్రమంత్రి పదవులు ఆఫర్ చేసింది. అందుకు శివసేన చాలా సంతోషించి ఉండాలి. కానీ ప్రధాని మోడీ శివసేనలో తనకు నచ్చిన సురేష్ ప్రభుకే కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపడంతో ఉద్దవ్ టాక్రేకు ఆగ్రహం కలిగించింది. అయినా మోడీ ఖాతరు చేయకుండా సురేష్ ప్రభుకే కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడం, ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శివసేనకు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరడంతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రే మరింత ఆగ్రహం చెందారు.   అందుకే తమ పార్టీ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోదని ప్రకటించడమే కాకుండా అన్నంత పని చేసి చూపించారు కూడా. ఈరోజు శాసనసభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలనిరూపణ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా తన పార్టీ సభ్యుల చేత ఓటు వేయించారు కూడా. దానితో ఇక ఆ రెండు పార్టీల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే అయ్యింది. అయితే దీనివలన శివసేన పార్టీయే ఎక్కువ నష్టపోయిందని, నష్టపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   శివసేన కొంచెం సంయమనం పాటించి ఉండి ఉంటే, కేంద్రంలో రెండు మంత్రి పదవులు నిలబెట్టుకోవడమే కాకుండా రాష్ట్రంలో కూడా అధికారంలో పాలుపంచుకోగలిగేది. కానీ పంతానికి పోయి గొప్ప సువర్ణావకాశం పోగొట్టుకొంది. కేంద్రంలో శివసేనకు చెందిన సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉండి ఉంటే, ఆ పార్టీకి దక్కే గౌరవమే వేరుగా ఉండేది. కానీ తన పంతం కారణంగా అత్యంత కీలకమయిన రైల్వే శాఖను నిర్వహిస్తున్న సురేష్ ప్రభును బీజేపీకి వదులుకొంది.   అయితే శివసేన కష్టాలకు ఇది అంతం కాదు ఆరంభమేనని చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే, గత పదిహేనేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న శివసేన, ఇప్పుడు మరో ఐదేళ్ళ వరకు ఎదురు చూడవలసి ఉంటుంది. ఆ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా శివసేన ఖచ్చితంగా గెలుస్తుందని ఎవరూ చెప్పలేరు. అందువలన ఇక నుండి ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఒకరొకరుగా బీజేపీలో చేరడం మొదలుపెడితే, మిగిలినవారిని కాపాడుకోవడానికే శివసేనకు సరిపోతుంది.   ఇప్పటికే మహారాష్ట్రాలో చాల బలంగా ఉన్న బీజేపీ ఈ ఐదేళ్ళలో మరింత బలపడుతుంది. పనిలోపనిగా తను వ్యతిరేకించే పార్టీలను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసే ప్రయత్నం చేయవచ్చును కూడా. ఎప్పటికయినా మహారాష్ట్రాలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలుగంటున్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రేకు ఈ పరిణామాలు తట్టుకొని నిలబడటం చాలా కష్టమేనని చెప్పక తప్పదు.

త్వరలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా?

  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించక ముందు నుండే రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఐదు నెలలలో ఆయన అనేక సార్లు డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి నిధుల విడుదల, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం వారిపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన మళ్ళీ మరోమారు డిల్లీ వెళ్లి ఇదేపనిపై కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఆ తరువాతే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రెండు వారాలలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.   ఈరోజు కేంద్రవాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ధిక, వాణిజ్య, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో డిల్లీలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు మరియు సుజనాచౌదరి కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తరువాత ఆర్ధిక, పారిశ్రామిక, విద్యుత్ తదితర శాఖల మంత్రులు కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లయితే, ప్రధాని నరేంద్రమోడీ తన పదిరోజుల విదేశీపర్యటన ముగించుకొని డిల్లీకి తిరిగిరాగానే దీనిపై ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.   ఈ రోజు వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటన చేసినట్లయితే, ప్రస్తుతం సింగపూరులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని ఉపయోగించుకొని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించగలుగుతారు. అదేవిధంగా ఇంతవరకు ఈ ప్రత్యేక హోదా ప్రకటన కోసం వేచి చూస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా ఇకపై రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావచ్చును. ఒకవేళ ఈ నెలాఖరులోగా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, బహుశః వచ్చే ఏడాది నుండి రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. దానితో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో గణనీయమయిన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దాని వలన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా జోరందుకోవచ్చును.   ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులు, విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు జరిగేందుకు కూడా ఇది దోహదపడవచ్చును. కనుక కేంద్రం కూడా సానుకూలంగానే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.