కాంగ్రెస్ ని వదిలి చంద్రబాబుపై విమర్శలేల?
posted on Nov 3, 2014 8:12AM
ఈ ఐదు నెలల కాలంలో తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం బాగా ముదిరిపోయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తెలంగాణా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. అసలు సమస్యల కంటే వారి విమర్శలు, చేపడుతున్న బస్సు యాత్రలు, ధర్నాలే ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో మరింత పలుచన చేస్తుండటంతో వారిని ఎదుర్కొనేందుకు ‘ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వాలే కారణమని’ తెరాస ఎదురు దాడి ప్రారంభించింది.
అయితే తెలంగాణా తెదేపా నేతలు తెరాస నేతల దాడిని త్రిప్పి కొడుతూ, “రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్రలో కూడా తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేదని, కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నాలుగు నెలలలోనే పరిస్థితులను పూర్తిగా చక్కదిద్ది రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేసారని, కానీ కేసీఆర్ మాత్రం గత ప్రభుత్వాలను నిందిస్తూ తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని” ధీటుగా జవాబీయడంతో తెరాస అధినేత కంగు తిన్నట్లయింది. గత ప్రభుత్వాల మీద నింద మోపి, సమస్య నుండి చేతులు కడుకొందామని తెరాస ప్రభుత్వం భావిస్తే ఆశించిన ఫలితం దక్కపోగా తన పరువు తానే తీసుకొన్నట్లయింది.
తప్పులను విమర్శించినా తట్టుకోవచ్చునేమో కానీ వేరొకరితో అదీ తను తీవ్రంగా ద్వేషించే వ్యక్తితో పోల్చి చూపుతూ తన అసమర్ధతను ఎత్తి చూపితే భరించడం ఎవరికయినా కష్టమే. బహుశః అందుకే, ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వాలే కారణమని ఇంతవరకు వాదిస్తున్న తెరాస మంత్రులు అందరూ కూడా గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడే దోషి’ అని వాదించడం మొదలుపెట్టారు.
తెలంగాణా రాష్ట్రంలో కూడా తన పార్టీని నిలబెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు, తెరాస మంత్రులు చేస్తున్న ఈ విమర్శల వలన అక్కడ తన పార్టీకి తీరని నష్టం కలుగుతుందని గ్రహించగానే, ఆయన కూడా ఇక ఎంత మాత్రం ఉపేక్షించకుండా, స్వయంగా కేసీఆర్ పై ఎదురు దాడి మొదలుపెట్టారు. ‘తెలంగాణాలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముందు చూపులేకపోవడమే’నని ఆయన చేసిన విమర్శ తుపాకీ గుండులా నేరుగా తగలవలసిన చోటనే తగలడంతో కేసీఆర్ విలవిలలాడిపోయారు. సాటి ముఖ్యమంత్రినని చూడకుండా చంద్రబాబు తనకు ముందు చూపులేదంటూ ఘోరంగా అవమానించారని బాధపడుతూ ఎదురుదాడి చేసేందుకే ప్రయత్నించారు తప్ప మేల్కొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగిపోయాయి. దానితో ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ధర్నాలు, ర్యాలీలు మరింత జోరుగా చేయడం ఆరంభించాయి.
బహుశః అందుకే ఆయన విజయవాడలో సభపెట్టి చంద్రబాబు బండారం బయటపెడతానని బెదిరించి ఉండవచ్చును. నిజానికి కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు ప్రతివిమర్శలు చేసి ఉండి ఉంటే, అది పట్టుకొని ‘తెలంగాణా ప్రభుత్వంపై ఆంద్ర సర్కార్ జులుం చేస్తోంది’ అంటూ తిరిగి ఎదురుదాడి చేసేందుకు ఆయనకు అవకాశం దక్కేది. కానీ చంద్రబాబు ‘విజయవాడలోనే కాదు...కావాలంటే కేసీఆర్ ఆంధ్రాలో ఎక్కడయినా సభ పెట్టుకోవచ్చును,’ అని గడుసుగా బదులివ్వడంతో ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది.
రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ కు ఈ దుస్థితి కలిగించిన తెరాస అధినేత కేసీఆర్, తన రాష్ట్రంలో సమస్యలనే పరిష్కరించుకోలేక సతమతమవుతూ ఇప్పుడు ఆంధ్రలో సభపెట్టి ఆంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎండగడతానని బెదిరించడం హాస్యాస్పదం. అది కేసీఆర్ వల్ల కానిపని. బహుశః అందుకే చంద్రబాబు కూడా చాలా గడుసుగా కేసీఆర్ ని స్వాగతించారు.
ఏమయినప్పటికీ ఇంతకు ముందు రెండు రాష్ట్ర ప్రజల మధ్య జరిగిన యుద్ధం, విభజన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొదలయింది. అదిప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యుద్ధంగా రూపుదిద్దుకోవడం చాల దురదృష్టకరం. దీనివలన రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవడమే తప్ప ఎవరికీ మేలుజరుగదు.