స్వైన్-ఫ్లూ నేర్పిన గుణపాఠం ఏమిటంటే...
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల హైదరాబాద్ కి వచ్చినప్పుడు తెరాస పార్టీ బలాబలాల గురించి చాలా చక్కగా విశ్లేషించారు. ఆ పార్టీ కేవలం ఒకరిద్దరి వ్యక్తుల సామర్ధ్యం మీదనే ఆధారపడి నడుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆ మాట తెరాసకే కాదు తెలంగాణా ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందేమో అనిపిస్తోంది స్వైన్-ఫ్లూపై ప్రభుత్వ స్పందన చూస్తుంటే. తెలంగాణాలో స్వైన్-ఫ్లూ జ్వరాల కారణంగా మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ తాపీగా కూర్చొన్న నీరో చక్రవర్తిలా తెలంగాణా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య ఉదాసీనత వహించడంతో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే కలుగజేసుకొని నివారణ చర్యలు చేప్పట్టవలసి వచ్చింది.
సంబంధిత అధికారులు, మంత్రులతో సమీక్షాసమావేశం నిర్వహించి స్వైన్-ఫ్లూ మహమ్మారిని అదుపు చేసేందుకు అవసరమయిన చర్యలు చేప్పట్టవలసిందిగా ఆదేశించారు. అంతేగాక ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డాతో కూడా మాట్లాడి కేంద్రం నుండి అవసరమయిన సహాయం పొందుతున్నారు. గత రెండు మూడు వారాలుగా రాష్ట్రంలో స్వైన్-ఫ్లూ జ్వరాలు ప్రబలి నానాటికీ మరణాల సంఖ్య పెరుగుతున్నా అందరికంటే ముందుగా స్పందించవలసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య ఏనాడు మీడియా ముందుకు వచ్చి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేయలేదు.
ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడని రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చేయడానికి నిత్యం మీడియా ముందుకు వచ్చే మంత్రులు, ఇటువంటి అతి ముఖ్యమయిన విషయంపై మాట్లాడేందుకు మీడియా ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా ఈ విషయంలో ఆయన మంత్రిత్వ శాఖ కూడా విఫలమయింది. అందువలన ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి కేసీఆరే స్వీకరించవలసి వచ్చింది. ఆయన మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు దైర్యం చెప్పి స్వైన్-ఫ్లూని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, దాని బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరించారు. నిజానికి ఈ పని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇంతకు ముందే చేసి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అప్రతిష్ట కలిగేది కాదు. ఇలా ప్రతీ చిన్న వ్యవహారాన్ని కూడా కేసీఆరే చక్కబెట్టవలసిరావడం ఆయనకు చాలా ఇబ్బందికరమే కాకుండా ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లవుతుంది.
ఇదే సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా క్రమంగా స్వైన్-ఫ్లూ విస్తరిస్తోంది. అది ఇంకా విస్తరించకుండా అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా స్వైన్-ఫ్లూపై యుద్ధ ప్రాతిపాదికన నివారణ చర్యలు చేప్పట్టడానికి ఆయన కూడా తన శాఖలో అధికారులను, వైద్యులను అప్రమత్తం చేసి, మీడియా ద్వారా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం అత్యవసరం. లేకుంటే ఆంధ్రాలో కూడా అదే పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.
ఇక ఈ సమస్య కారణంగా అర్ధమవుతున్న మరో విషయం ఏమిటంటే, సమర్దులయిన మంత్రులను ఎంచుకోకపోతే వారి అసమర్ధతకు, వైఫల్యానికి మూల్యం చెల్లించుకోవలసింది ప్రజలేనని. దాని వలన అధికార పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇదేమీ ఈరోజు కొత్తగా కనుగొన్న విషయం ఏమీ కాదు. కానీ ఇది మరోసారి రుజువయింది. రాజకీయ నేతలు ఎన్నికలలో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవుల కోసం పోటీపడతారు. కానీ మంత్రి పదవి దక్కిన తరువాత అన్నీ ముఖ్యమంత్రే స్వయంగా చూసుకోవాలన్నట్లు ఈవిధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుంటారు.
వారికి రాజకీయాలపై ఉన్న శ్రద్దాసక్తులు తమ శాఖలను సమర్ధంగా నిర్వహించడంపై ఎందుకు చూపరని ప్రశ్నించుకొంటే, వారిలో చాలా మందికి తమ శాఖల వ్యవహారాల పట్ల సరయిన అవగాహన లేకపోవడం, అధికారుల ముందు ఆ విషయం బయటపెట్టుకోలేక వారికే ఆ బాధ్యతలు అప్పజెప్పేసి తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు, రాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటం వంటి అనేక కారణాలు కనబడుతుంటాయి. ఆంధ్రా, తెలంగాణా మంత్రులలో కేవలం నలుగురైదుగురు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మిగిలినవారు ఏమి పనిచేస్తున్నారో, అసలు పనిచేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
అందుకే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రుల పనితీరుని సమీక్షిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇకపై ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుని సమీక్షిస్తూ వారికి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించి వారి నుండి పని రాబట్టుకోవడం మంచిది. మంత్రులు అంటే కేవలం అధికారులు తీసుకువచ్చిన ఫైళ్ళ మీద సంతకాలు గీకడానికే పరిమితం కాకుండా తమ సామర్ధ్యం నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే అటు వారి పార్టీకీ, ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు.