తెలంగాణా రాష్ట్ర తొలి బడ్జెట్ నేడే
posted on Nov 5, 2014 8:13AM
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొట్టమొదటి రాష్ట్ర బడ్జెట్ ఈరోజు రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టబోతున్నారు. రోటీన్ బడ్జెట్లకు పూర్తి భిన్నంగా తెలంగాణా అవసరాలకు సరిపడేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపదేవిధంగా బడ్జెట్ ను చాలా జాగ్రత్తగా రూపొందించేమని మంత్రి అన్నారు. తను ఈరోజు ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో అన్ని వర్గాలకు వరాలే తప్ప ఎటువంటి కొత్త పన్నులు లేవని ఆయన స్పష్టం చేసారు. ఇది అత్యంత ప్రజారంజకమయిన బడ్జెట్ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆయన ఈరోజు పది గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.
తాజా సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ రూ.1.05 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. దానిలో సింహభాగం అంటే 60శాతం తెరాస పార్టీ ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలను అమలుచేసేందుకే కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రణాళిక వ్యయం రూ.48,000కోట్లు ఉండవచ్చునని సమాచారం. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న చెరువుల పునరుద్దరణ మరియు ఆధునీకరణ, త్రాగు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.3000కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం.
తెలంగాణా ప్రభుత్వం బడ్జెట్ గురించి కొంచెం అతిగా చెప్పుకోవడం వలన, సహజంగానే అన్ని వర్గాలలో దానిపై చాలా ఆశలు రేపినట్లయింది. కానీ బడ్జెట్లో అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎన్నడూ సాధ్యం కాదనే సంగతి విస్మరించి ప్రభుత్వం చేసుకొన్న అనవసరపు ప్రచారం వలన బడ్జెట్ కేటాయింపులతో సంతృప్తి చెందని వర్గాల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకోవలసి వస్తుంది.
ఈ బడ్జెట్లో వరాలే తప్ప పన్నులు ఉండవని చెప్పినప్పటికీ, ఆ తరువాత ప్రభుత్వం పన్నులు వడ్డించకుండా ఉండదు. బడ్జెట్ ఎంత భారీగా ఉంటే రాబడి కూడా అంతే నిష్పత్తిలో ఉన్నప్పుడే అందులో చేసిన కేటాయింపులకు నిధులు మంజూరు చేయడానికి వీలుంటుందని అందరికీ తెలుసు. తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇంతవరకు నిధులు కేటాయించడం లేదు. అటువంటప్పుడు తనపై నిత్యం కత్తులు దూస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి ఉదారంగా నిధులు అందజేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక బడ్జెట్ భారీగా ఉన్నట్లయితే, నిధులు సమకూర్చుకోనేందుకు మున్ముందు ప్రజలపై పన్నుల మోత కూడా తప్పకపోవచ్చును.
పన్నులు విధించకపోతే బడ్జెట్ కేటాయింపులలో కోతపెట్టక తప్పదు. అంటే ప్రభుత్వం చాల ఘనంగా బడ్జెట్ రూపొందించినప్పటికీ, దానిని యధాతంగా అమలుచేయలేకపోతే అది ప్రజలను మభ్యపెట్టేందుకే ఆకర్షణీయంగా రూపొందించినట్లు అవుతుంది. కానీ కేంద్రం ఎటువంటి సహాయం చేయకపోయినా, ప్రజలపై మున్ముందు కొత్త పన్నులు వడ్డించకుండా తెరాస ప్రభుత్వం తన బడ్జెట్ ను యధాతధంగా యధాతధంగా అమలుచేయగలిగితే, అది తప్పకుండా తెలంగాణా ప్రభుత్వ సమర్ధతకు, దీక్షాదక్షతలకు నిదర్శనమని అంగీకరించవలసిందే.
అయినా మరో కొద్ది సేపటిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కనుక తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడగడం దేనికి? తిన్నాకే దాని రుచి తెలుసుకొందాము.